కిక్కులేదు!

ABN , First Publish Date - 2020-06-03T11:31:56+05:30 IST

జిల్లాలో మందుబాబులు మే నెలలో కేవలం 28 రోజుల్లో రూ.165 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.

కిక్కులేదు!

మే నెలలో మందుబాబులు తాగిన మద్యం విలువ రూ.165.9 కోట్లు

 75 శాతం ధరల పెంపుతో మూడో వంతుకు పడిపోయిన అమ్మకాలు

 ప్రస్తుతం రోజుకు రూ.5 కోట్లు మాత్రమే 

ఇక్కడ అధిక ధరలతో తెలంగాణవైపు చూపు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మందుబాబులు మే నెలలో కేవలం 28 రోజుల్లో రూ.165 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. అంకెలు ఘనంగా కనిపిస్తున్నా తాగేవారి సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది. ఎం దుకంటే మార్చి నెలలో పాత ధరలు ఉన్నప్పుడు కేవలం 22 రోజుల్లో రూ.123.58 కోట్ల విలువైన మందు తాగారు. మేలో ధరలు ఏకంగా 75 శాతం పెరిగాయి. అంటే గతంలోలా తాగితే సుమారు రూ.500 కోట్లు విలువ ఉంటుంది. కానీ ధరలు పెరగడం వల్ల కొనుగోలు తగ్గించారు. పాత ధరలు ఉన్నప్పుడు రోజుకు జిల్లాలో రూ.6-7 కోట్లు అమ్ముడయ్యేది. మే 4న షాపులు తెరిచినప్పుడు సుమారు రూ.13కోట్లు అమ్ముడైంది.


తర్వాత అమాంతంగా రేట్లు పెంచేయడంతో రోజువారీ అమ్మకాలు పడిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో రోజుకు రూ.5 కోట్ల వరకే అమ్మకాలున్నాయి. ఆదివారం మాత్రం రూ.5.30-6 కోట్ల దాకా ఉంటోంది. మే నెలలో సామర్లకోట డిపో పరిధిలో రూ.59.34 కోట్లు, రాజమహేంద్రవరం డిపో పరిధిలో రూ.57.83 కోట్లు, అమలాపురం డిపో పరిధిలో రూ.47.92 కోట్ల అమ్మకాలు జరిగాయి. మార్చి నెలలో సామర్లకోట పరిధిలో రూ.45.29 కోట్లు, రాజమహేంద్రవరం పరిధిలో రూ.42.64 కోట్లు, అమలాపురం పరిధిలో  రూ.35.65 కోట్లు విలువైన మద్యం అమ్మారు.


ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరగడం వల్ల తక్కువ ధరలకే లభిస్తున్న తెలంగాణ మద్యం వైపు కొందరు దృష్టి సారించినట్టు సమాచారం. ఎటపాకలో తెలంగాణ మద్యం స్వాధీనం  చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం తెచ్చుకుని కొందరు వ్యాపారం కూడా చేస్తున్నట్టు ఆరోపణ లున్నాయి. అధిక ధరలకు తోడు అలవాటైన బ్రాండ్లు దొరకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది.


సారాకు డిమాండు

మద్యం అధిక ధరల కారణంగా నాటుసారా బాగా పెరిగింది. ప్రభుత్వ మద్యం కొనలేని వ్యక్తులు సారా మీద పడ్డారు. జిల్లాలో ప్రతీరోజూ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో చేస్తున్న దాడుల్లో సారా, బెల్లంఊట పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. జిల్లాలో వందలాది గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారు. పట్టుకోవడానికి అధికారులు ఎన్ని ఎత్తులేస్తున్నా తప్పించుకోవడానికి సారా తయారీదారులు, అమ్మకందారులు అనేక పైఎత్తులు వేస్తున్నారు. 

Updated Date - 2020-06-03T11:31:56+05:30 IST