మద్యం మనోడిదే!

ABN , First Publish Date - 2020-05-27T16:30:04+05:30 IST

‘బ్రాండ్‌’ బోర్డర్‌ దాటి వచ్చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రెండు వేలకు..

మద్యం మనోడిదే!

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో తరలింపు

సరిహద్దులు దాటి వస్తున్న మద్యం

ప్రజాప్రతినిధుల అనుచరులే కీలకం


ఆంధ్రజ్యోతి - విజయవాడ: ‘బ్రాండ్‌’ బోర్డర్‌ దాటి వచ్చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రెండు వేలకు పైగా మద్యం సీసాలు పొరుగు రాష్ట్రం నుంచి మన సరిహద్దుల్లోకి వచ్చినట్టు సమాచారం. పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల వద్ద ఉన్న రికార్డుల్లోని లెక్క ఇది. ఈ లెక్కలోకి రాని మద్యం చాలా ఉంది. సరిహద్దు గ్రామాల నుంచి వివిధ మార్గాల్లో మద్యాన్ని జిల్లాలోకి తరలించేస్తున్నారు. ఇదంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో వారి అనుచరుల ద్వారానే జరుగుతుందన్న విమర్శలున్నాయి. 


జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు తెలంగాణ నుంచి సొంత వాహనాల్లో కేసుల కొద్దీ మద్యాన్ని తీసుకొచ్చి, అనధికారికంగా డిపోలను తెరిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రామచంద్రాపురం రోడ్డులో ఏపీ 21 బీఈ 0333 నెంబరు ఇన్నోవా కిస్టా కారులో ఉన్న 724 మద్యం సీసాలను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ కారు నెంబర్‌ను బట్టి కూపీలాగితే ఇది ఓ ఎమ్మెల్యే అనుచరుడిదని తేలింది. తెలంగాణ సరిహద్దుల నుంచి ఈ సరుకును ఇక్కడికి తీసుకొస్తున్నారు. 


జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటికీ బ్రాండ్‌ సరుకు లభించడం లేదు. దీనికి తోడు ధర కూడా అధికంగా ఉంది. రాష్ట్రంలోని మద్యం ధరలకు, తెలంగాణలోని మద్యం ధరలకు చాలా వ్యత్యాసం ఉండడం, మందుబాబులు అమితంగా ఇష్టపడే టాప్‌ బ్రాండ్లు అక్కడ అందుబాటులో ఉండడంతో దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో బార్లలో ఉన్న సరుకును రహస్యంగా తరలించి, సొమ్ములు చేసుకున్నవారు ఇప్పుడు తెలంగాణ నుంచి తీసుకొచ్చిన మద్యం ద్వారా సొమ్ము వెనకేసు కోవడానికి మార్గాలను అన్వేషించారు. జగ్గయ్యపేట, నందిగామ, పెనుగంచిప్రోలు, తిరువూరు ప్రాంతాల నుంచి తెలంగాణకు ఉన్న అన్ని మార్గాలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. ఇలా రహస్యంగా బోర్డర్‌ దాటుతున్న బ్రాండ్‌ సరుకుకు బాస్‌లుగా అధికార పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తామేమీ తక్కువ కాదంటున్నారు వలంటీర్లు. ఇప్పటికే జగ్గయ్యపేట సమీపంలో ఇద్దరు వలంటీర్లు పొరుగు గడ్డపై నుంచి మందు తీసుకొస్తూ పోలీసులకు చిక్కారు. 


ఇప్పుడు అధికార పార్టీ నేతల అనుచరులు అదే పనిగా తెలంగాణ నుంచి మద్యాన్ని జిల్లాలోని రహస్య ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటిని ఒక గోడౌన్‌లో భద్రంగా ఉంచి, వారికి విశ్వాసపాత్రులుగా ఉండేవారితో అమ్మకాలు సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ధరకు కాస్త ఎక్కువగానూ, రాష్ట్రంలో ఉన్న ధరకు కాస్త తక్కువగానూ ఉండేలా ధరలను నిర్ణయించుకుని విక్రయాలు సాగించేస్తున్నారు. 

Updated Date - 2020-05-27T16:30:04+05:30 IST