పిల్లలందరికీ ఆల్బెండజోల్‌

ABN , First Publish Date - 2021-02-27T05:47:06+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా. మాత్రలను మింగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు.

పిల్లలందరికీ ఆల్బెండజోల్‌

  1. నులి పురుగుల నివారణకు ఏర్పాట్లు చేయండి
  2. వైద్య, విద్యాశాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం


కర్నూలు(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 26: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా. మాత్రలను మింగించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌  సమావేశ భవనంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా నులి పురుగుల నివారణ దినోత్సవ జిల్లా కో ఆర్డినేషన్‌ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి 9వ తేదీ వరకు ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసు లోపు వారికి ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించాలని ఆదేశించారు. పోషకాహార లోప నివారణ కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ సమావేశాలను నిర్వహించి నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలలు, ఐటిఐ, పాలిటెక్నిక్‌ కాలేజీలకు కూడా మాత్రలను పంపిణీ చేయాలని ఆదేశించారు. డివిజన్‌ స్థాయిలో సబ్‌ కలెక్టర్‌/ఆర్డీవో, మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవో తదితర అధికారులతో సమావేశాలు నిర్వహించాలని, నులి పురుగుల వలన కలిగే దుష్పరిణామాలపై అధికారులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 10.55 లక్షల మంది విద్యార్థులకు మాత్రలను భోజనం తర్వాత తినిపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏ స్కూల్లో ఏ రోజు మాత్ర లు వేస్తారో ప్రణాళిక తయారు చేసుకోవాలని డీఈవోను ఆదేశించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి గ్రామంలో డీవార్మింగ్‌ పై సమావేశాలు నిర్వహించుకునేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమాలన్నీ కొవిడ్‌ నిబంధనలను అనుసరించి చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, డీఈవో సాయిరాం, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రెడ్డి, అన్ని సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:47:06+05:30 IST