Abn logo
Sep 25 2021 @ 00:22AM

అలకలు.. బాయ్‌కాట్‌లు.. రాజీనామాలు..

ముండ్లమూరులో ఉదయం ఎంపీపీ ఎన్నికకు సభ్యులు రాక ఖాళీగా ఉన్న కుర్చీలు రాజీనామా చేసిన ఎంపీటీసీలు వెంకటరెడ్డి, భూపాల్‌రెడ్డి

ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం 

మాట నెగ్గించుకున్న ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు 

అసమ్మతివాదులను హెచ్చరించి సైలెంట్‌ చేసిన బాలినేని 

జిల్లాలో ఎంపిపి ఎన్నికల నేపథ్యం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

సాక్షాత్తూ ముఖ్యమంత్రి సూచనలు, హెచ్చరికలు.. ఆపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల బెదిరింపులు.. అన్నింటికీ మించి మంత్రి బాలినేని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నా మండల పరిషత్‌ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీలోని లొసుగులు బట్టబయలయ్యాయి. పలు మండలాల్లో కొందరు స్థానిక నేతలు, ఎంపీటీసీలు అలకబూనగా కొన్నిచోట్ల సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. ఇంకొన్ని చోట్ల ఇటు పార్టీకి అటు ఎంపీటీసీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు. ముండ్లమూరు మండలంలో నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక జరిగినా వైరివర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోట్లు కుమ్మరించినా ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నా తన భర్తకు పార్టీ అన్యాయం చేసిందంటూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇన్ని ఘటనల మధ్య జిల్లాలో ఆగిపోయిన మూడు తప్ప మిగిలిన 53 మండల పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను ముగించేశారు. 

 

జిల్లాలో శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎంపిక సందర్భంలో అధికార వైసీపీలో అనేక లుకలుకలు బహిర్గతమయ్యాయి. అధిష్ఠానం నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పలువురు ఎంపీటీసీలు సమావేశాలకు గైర్హాజరు కావటం, కొందరు రాజీనామాలు చేయటం, ఇంకొందరు బహిరంగ నిరసనలు తెలియజేయటం, మరికొందరు మీకు మీ పార్టీకి ఓ నమస్కారం అంటూ రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించటం, చివరికి ఏకంగా తన భర్తకు జరిగిన అన్యాయంపై ఓ గృహిణి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించటం లాంటి ఘటనలు జరిగిపోయాయి. కారణాలు ఏమైనప్పటికీ గతం మాదిరి కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల మాటకే అధిష్ఠానం ఆమోదముద్ర వేసింది. దీంతో వారు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రూపురాజకీయాలకు అనుగుణంగా పదవులు కేటాయించేశారు. దీంతో అన్యాయం జరిగిందంటూ పలు ప్రాంతాల్లో నాయకులు నిరసనలు వ్యక్తం చేయక తప్పలేదు. 

ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం 

జిల్లాలోని ఓ ఎంపీపీ పదవిని ఆశించి రెండవసారి ఎంపీటీసీగా గెలిచి మండలంలోని ఎక్కువమంది సభ్యుల మద్దతు ఉన్న ఒకరికి ఎమ్మెల్యే ఆశీస్సులు లేవంటూ అధిష్ఠానం తోసిపుచ్చింది. దీంతో సదరు ఎంపీటీసీ సభ్యుడి సతీమణి గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. సమీపంలోని జిల్లాకేంద్రంలో ఆ నాయకుడు నివాసముంటారు. అక్కడే ఆమె నిద్రమాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యకు యత్నించటంతో హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. తన భర్త రెండవసారి ఎంపీటీసీ అయ్యారు.  జగన్‌ సీఎం కావాలంటూ కోట్లు తగలేశాం. ఇప్పుడు ఎంపీపీ పదవి కోసం మరో రూ.2.5కోట్లుకుపైగా ఖర్చుపెట్టాం. చివరికి మాకు పార్టీ పట్ల ఉన్న నిబద్ధతా పనికి రాలేదు, ఖర్చుపెట్టిన కోట్లు ఉపయోగపడలేదంటూ ఆమె గత రెండు మూడురోజుల నుంచి పలువురితో వాపోయినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం తన భర్తకు కాకుండా వేరేవారికి బీఫాం ఇచ్చారని తెలిశాక ఆమె పెద్దసంఖ్యలో నిద్రమాత్రలు మింగింది. ఈ విషయాన్ని బయటకు చెప్పినా పార్టీపరంగా ప్రభుత్వపరంగా ఇబ్బంది వస్తుందేమోనన్న ఆందోళనతో ఆ కుటుంబసభ్యులు కానీ ఆమె భర్త కానీ నోరు మెదపటం లేదు. 

ముండ్లమూరులో నాటకీయ పరిణామాలు 

ముండ్లమూరులో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ సిఫార్సు చేసిన వారికే ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ బీఫాం ఇచ్చింది. అయితే వైసీపీలోని నలుగురు ఎంపీటీసీలు ఎమ్మెల్యేకి మద్దతుగా ఒక టీడీపీ ఎంపీటీసీ మాత్రమే ఉదయాన్నే సమావేశానికి హాజరయ్యారు. మద్దిశెట్టి సూచించిన నాయకుని భార్య ఎంపీపీ పదవికి నామినేషన్‌ వేశారు. అయితే పార్టీలోని ఏడుగురు ఎంపీటీసీలతో పాటు టీడీపీకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరు గైర్హాజరయ్యారు. వెంటనే అధిష్ఠానం తరపున మంత్రి బాలినేని రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లికి ఫోన్‌చేసి  మిగిలిన సభ్యులు సమావేశానికి హాజరుకాకుంటే ఇబ్బందిపడతావంటూ హెచ్చరించారు. దీంతో శివప్రసాదరెడ్డి విజయవాడలో ఉన్న  ఎంపీటీసీలతో మాట్లాడి వారిని ముండ్లమూరుకి రప్పించారు. తర్వాత అద్దంకిలో ఉన్న టీడీపీ, బీజేపీ ఎంపీటీసీలు కూడా ముండ్లమూరుకు చేరారు. 3 గంటల ప్రాంతంలో వీరు కూడా సమావేశానికి హాజరుకావటంతో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగాయి. అయితే తెరవెనుక జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఎక్కువమంది మద్దతుతో ఉన్న బూచేపల్లి వర్గీయుడు వెంకటేశ్వరరెడ్డికి ఏఎంసీ కానీ నామినేటెడ్‌ పదవి కాని ఇస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు ఆయన ఎంపీటీసీల గెలుపుకోసం వెచ్చించిన ఖర్చులో అధిక భాగాన్ని ఒక నాయకుడు చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఈ పరిణామంతో ఎమ్మెల్యే వర్గీయులు సంబరాలు చేసుకోగా అసమ్మతివర్గం మొత్తం నిరాశతో వెనుదిరిగారు.

పలువురు రాజీనానాలు

వైసీపీకి లేక తాము ఎన్నికైన పదవులకు రాజీనామాలు చేసే వ్యవహారం శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లాలో ప్రారంభమైంది. బేస్తవారపేట మండలంలో ఎంపీపీ పదవిని ఆశించిన పూనూరు భూపాల్‌రెడ్డి ఇటు ఎంపీటీసీ పదవితో పాటు అటు వైసీపీకి కూడా రాజీనామా చేసేశారు. అతనితో పాటు మరో ఎంపీపీ ఓసూరురెడ్డి కూడా అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. చివరికి ఎమ్మెల్యే సిఫార్సుతో ఓసూరురెడ్డికి ఎంపీపీ పదవి దక్కింది. తనను కావాలని రంగంలోకి దింపి అన్యాయం చేశారంటూ భూపాల్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇంటికెళ్లి పిలవగా ‘మీకో దండం మీరు మీ పార్టీ చేసిన సేవలు చాలు’ అంటూ ఎంపీటీసీకి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొనకనమిట్ల మండలంలో కూడా మరో సీనియర్‌ నాయకుడు మెట్టు వెంకటరెడ్డి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. అక్కడ ఎంపీపీ పదవి బీసీలకు రిజర్వ్‌ కాగా ఉపాధ్యక్ష పదవి ఇస్తానని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆయన మామ ఉడుముల శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన హామీతో ఎంపీటీసీకి పోటీచేసి గెలుపొందినట్లు ఆయన తెలిపారు. అయితే చివరిక్షణంలో ఆయనను కాదని ఎస్సీని ఎంపిక చేశారు. దీంతో ఆయన పదవికి రిజైన్‌ చేస్తూ ఎమ్మెల్యే, ఆయన బంధువర్గంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి రాజీనామాల వ్యవహారం కింది వరకు సాగుతూనే ఉన్నట్లు శుక్రవారం అర్థరాత్రి వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

పలుచోట్ల గైర్హాజరులు

కాగా పలు మండలాల్లో వందలాది మంది ఎంపీటీసీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్‌ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికకు గైర్హాజరు కావటం విశేషం. కొండపి మండలంలో సీనియర్‌ నాయకులైన పిచ్చిరెడ్డి భార్య ప్రస్తుతం ఎంపీటీసీ. ఆమెతో పాటు ఆ మండలంలోని నలుగురు ఎంపీటీసీలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. మార్కాపురంలో ఇద్దరు ఎంపీపీ పదవిని ఆశించగా ఇద్దరి నుంచి ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు వసూలు చేశారు. చివరికి ఎవరికో పదవి అనేది తేల్చిచెప్పకుండా చెరి సగం కాలం చేయాలని ప్రతిపాదించారు. అందులో ఎవరు ముందు చేయాలన్న విషయంపై వివాదం నెలకొనగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అరుణ అనే అభ్యర్థిని వైపు మొగ్గుచూపారు. దీంతో ఆ పదవిని ఆశించిన లక్ష్మీదేవి, మరో ఎంపీటీసీ సభ్యుడు సమావేశానికి గైర్హాజరయ్యారు. పొన్నలూరు మండలంలో వైస్‌ ఎంపీపీగా ఇన్‌చార్జ్‌ వెంకయ్య గతంలో ఓ పేరుని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ మండలంలోని వైసీపీ ఎంపీటీసీలంతా కలిసి మరొకరిని వైస్‌ ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో కలత చెందిన వెంకయ్య పొన్నలూరుకు వెళ్లలేదు. ఆయన కోసం ఎదురుచూసిన నాయకులు తదనంతరం వారంతట వారే ఆనందోత్సాహాలతో ర్యాలీ నిర్వహించుకున్నారు. అలాగే జరుగుమల్లిలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు ఒకేవర్గం వారికి దక్కాయి. మరో వర్గం వారు అనూరాధ నాయకత్వంలో పార్టీ మండల కన్వీనర్‌ పదవి అయినా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు. వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వెంకయ్య దిగి వచ్చి  వారు సూచించిన వ్యక్తిని మండలకన్వీనర్‌గా ప్రకటించారు. మార్టూరు మండలంలో ఎంపీపీ పదవి దళితులకు రిజర్వ్‌ కాగా ఉపాధ్యక్ష పదవికి పలువురు పోటీపడ్డారు. సీనియర్‌ నాయకులు, మాజీ డెయిరీ చైర్మన్‌ చెంగలయ్య కోనంకి నుంచి గెలుపొందిన వ్యక్తిని బలపరిచారు. మొత్తం 21 మంది ఎంపీటీసీలలో 11 మంది ఆయనకు మద్దతు పలికారు. అయితే సమావేశం ఆరంభంలో ఎంపీ నందిగం సురేష్‌ వచ్చి పార్టీ మరో పేరుని ప్రతిపాదించిందంటూ ఆ నిర్ణయాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఖబడ్ధార్‌ అని హెచ్చరించి వెళ్లారు. ఆ తర్వాత ఎన్నికల కార్యక్రమాన్ని ఆరుగురు వైసీపీ సభ్యులు, ముగ్గురు టీడీపీ సభ్యులు బహిష్కరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పలుచోట్ల నెలకొన్నాయి. ఇంకా జడ్పీటీసీలు జనరల్‌లో ఉంటే ఎంపీపీ పదవులను బీసీ, ఎస్సీలకు కేటాయించాలన్న జగన్‌ సూత్రాన్ని స్థానికంగా ఎక్కడా ఎవరూ పాటించిన దాఖలాలు లేవు.