అగనూరు వెలవెల

ABN , First Publish Date - 2022-04-16T06:14:52+05:30 IST

అలగనూరు వెలవెబోతోంది. మిడుతూరు మండలంలోని అలగనూరు జలాశయంపై ఆధారపడ్డ రైతులకు ఈ ఏడాది కడగండ్లు తప్పని పరిస్థితి నెలకొంది.

అగనూరు వెలవెల

ఈ ఏడాది రైతులకు కడగండ్లే 

నిలిచిన అలగనూరు కట్ట మరమ్మతులు 

పెరిగిన అంచనా వ్యయం 

కేసీ చివరి ఆయకట్టు, తలముడిపి చెరువుకు నీరు ప్రశ్నార్థకం


అలగనూరు వెలవెబోతోంది. మిడుతూరు మండలంలోని అలగనూరు జలాశయంపై ఆధారపడ్డ రైతులకు ఈ ఏడాది కడగండ్లు తప్పని పరిస్థితి నెలకొంది. ఈ జలాశయం ప్రారంభమైన 17 ఏళ్లలో మొదటిసారి పూర్తిగా  ఎండిపోయింది.  తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం తగ్గి కేసీ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందని రైతులను ఆదుకోడానికి  1999లో రూ.59.7 కోట్లతో 2.965 టీఎంసీల సామర్థ్యంతో అలగనూరు రిజర్వాయర్‌ నిర్మించారు.  నిర్మాణం పూర్తయ్యాక 2005లో రిజర్వాయర్‌ను  నింపారు.  ఈ ఏడాది అలగనూరు జలాశయం ఎండిపోవడం వల్ల నంద్యాల, కడప జిల్లాలో వేలాది ఎకరాల పంటలకు సాగునీరు,  కుందూ నదీ తీర గ్రామాల ప్రజలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.  2017లో అలగనూరు జలాశయం కట్ట 2.7 కిమీ వద్ద 250 మీటర్ల మేర కుంగిపోయింది. 2019లో రూ.19.98 లక్షలతో దీనికి తాత్కాలిక మరమ్మతులు చేశారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2.965 టీఎంసీలు కాగా 2.64 టీఎంసీల నీరు  నింపుతూ వచ్చారు. జలాశయంలో నీటి అలల తాకిడికి  మరమ్మతులు చేసిన ప్రాంతంలో కట్టకు వేసిన ఇసుక సంచులు కరిగిపోయి కట్ట మరింత కుంగే పరిస్థితి ఏర్పడింది. గతేడాది జూలైలో రిజర్వాయర్‌ కట్ట మరమ్మతు పనులకు జలాశయంలో ఉన్న నీటిని కిందికి వదిలేశారు. రూ.3.12కోట్లతో టెండర్లు పిలిచి కట్టకు మరమ్మతు పనులు ప్రారంభించారు.

- నందికొట్కూరు


పెరిగిన మరమ్మతుల అంచనా వ్యయం

 

 రిజర్వాయర్‌ కట్ట మరమ్మతు పనుల అంచనా వ్యయం అమాంతం పెరిగింది. రూ.3.12 కోట్ల నుంచి రూ.20 కోట్లకు అంచనా వ్యయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగినా అంచనా వ్యయం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 


కేసీ చివరి ఆయకట్టుకు నీరు విడుదల ప్రశ్నార్థకం


అలగనూరు జలాశయం కట్ట మరమ్మతు పనులు పూర్తి చేసే వరకు నీరు నింపే అవకాశం లేదు. దీంతో కేసీ కాలువ చివరి ఆయకట్టుకు నీరందడం ప్రశ్నార్థకమవుతుంది. మిడుతూరు మండలం అలగనూరు జలాశయం నుంచి రెండు టీఎంసీల నీటిని కిందకు వదిలి కుందూ నది ద్వారా రాజోలి ఆనకట్టను నింపి అక్కడి నుంచి కేసీ కాల్వ చివరి ఆయకట్టుకు నీరు మళ్లించేవారు. అయితే  అలగనూరు కట్ట మరమ్మతుకు రావడం, జలాశయం ఖాళీ అవడంతో కేసీ చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమే. 


బీళ్లుగా మారిన తలముడిపి ఆయకట్టు భూములు 


 అలగనూరు జలాశయం ఎండిపోవడంతో మిడుతూరు మండలంలోని తలముడి చెరువు ఆయకట్టు భూములు బీళ్లుగా మారాయి. అలగనూరు జలాశయంలో తలముడిపి చెరువు అంతర్భాగంగా ఉంది. ఈ చెరువు కింద 290 ఎకరాల ఆయట్టు ఉంది. గత ఏడాది ఆగస్టు నుంచి తలముడిపి చెరువుకు నీరందకపోవండం వల్ల పంట పొలాలు బీళ్లుగా మారాయి. అలగనూరు రిజర్వాయర్‌ను నింపే పరిస్థితి లేకపోవడంతో ఈ ఏడాది ఖరీప్‌ పంటలు కూడా సాగు కాకపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలగనూరు జలాశయంలో చేపల వేట ద్వారా వందల మంది మత్య్సకారులు జీవనోపాధి పొందుతున్నారు. జలాశయం ఎండిపోవడంతో వారి జీవనం ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నీరందించాలని రైతులు కోరుతున్నారు. 

 

 తీవ్రంగా నష్టపోతాం


అలగనూరు జలాశయం కింద నాలుగు ఎకరాల భూమి ఉంది. జలాశయంలో నీరు లేక రబీ పంటలకు సరఫరా చేయలేదు. నీరందక పంట పొలాలు బీళ్లుగా మారాయి. వచ్చే ఖరీఫ్‌కు నీరివ్వకపోతే తీవ్రంగా నష్టపోతాం. అధికారులు స్పందించి అలగనూరు జలాశయం, తలముడిపి చెరువులను నింపి పొలాలకు నీరివ్వాలి. 


- ఆంజనేయులు, రైతు, తలముడిపి గ్రామం


అంచనా వ్యయం పెరిగింది.. పనులు నిలిచిపోయాయి 


అలగనూరు జలాశయం కట్ట మరమ్మతు పనుల వ్యయం రూ.3.12కోట్ల నుంచి రూ.20కోట్లకు పెరిగింది.  ఎస్టిమేషన్‌ వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ఇప్పటి వరకు రూ.57 లక్షలు ఖర్చు చేసి కట్ట పనులు చేశాం. అంచనా వ్యయం పెరగడంతో పనులు నిలిపి వేశాం. ప్రభుత్వం పెరిగిన అంచనా వ్యయాన్ని ఆమోదిస్తే టెండర్లు పిలిచి కట్ట మరమ్మతు పనులు చేస్తాం. అలగనూరు కట్ట మరమ్మతు పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో రింగ్‌బండ్‌ ఏర్పాటు చేసి నీటిని నింపే ఆలోచన కూడా ఉన్నతాధికారులు చేస్తున్నారు. 


- మనోహర్‌రావు, అలగనూరు జలాశయం డీఈ 

Updated Date - 2022-04-16T06:14:52+05:30 IST