Abn logo
Feb 1 2020 @ 18:51PM

‘అల వైకుంఠ‌పుర‌ములో..’ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి మమ‌త‌

బ్యాన‌ర్స్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్‌

న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జ‌య‌రాం, ముర‌ళీశ‌ర్మ‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రాజేంద్ర ప్ర‌సాద్, వెన్నెల‌కిషోర్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మానందం, అజ‌య్ త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

కెమెరా: పి.ఎస్‌.వినోద్‌

ఎడిటింగ్‌: న‌వీన్ నూలి

నిర్మాత‌లు: అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్‌

 

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ప్లాప్ త‌ర్వాత అల్లు అర్జున్ త‌దుప‌రి సినిమా చేయ‌డానికి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టే సినిమా చేయాల‌నుకున్నాడో లేక త‌న‌కు న‌చ్చిన డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌తోనే ప‌నిచేయాల‌నుకున్నాడో ఏమో కానీ స‌మ‌యం తీసుకుని సినిమాను అనౌన్స్ చేశాడు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమాతో బ‌న్నీకి స‌క్సెస్ వ‌చ్చిందా? బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబోలో హ్యాట్రిక్ హిట్ ప‌డిందా? సినిమాలోని సాంగ్స్ `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌`, `రాములో రాముల‌` సెన్సేష‌న‌ల్ హిట్స్ అయ్యాయి. మ‌రి ఆ పాట‌లు సినిమాలో ఎలా ఉన్నాయి? బ‌న్నీ డాన్సులు ఇర‌గ‌దీశాడా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు కావాలంటే సినిమా క‌థేంటో తెర‌పై చూడాల్సిందే..!

క‌థ‌:

రామ‌చంద్ర‌(జ‌య‌రాం) కోటీశ్వ‌రుడు. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వాల్మీకి(ముర‌ళీశ‌ర్మ‌)కి ఒకేసారి అబ్బాయిలు పుడ‌తారు. అయితే రామ‌చంద్ర‌పై ఉన్న ద్వేషంతో, అసూయ‌తో వాల్మీకి త‌న బిడ్డ‌ను అత‌ని కొడుకు స్థానంలోకి, అత‌ని కొడుకుని త‌న బిడ్డ స్థానంలోకి మార్చేస్తాడు.  సాక్ష్యంగా ఉన్న నర్స్ ప్ర‌మాదం కార‌ణంగా కోమాలోకి వెళ్లిపోతుంది.  ముర‌ళీశ‌ర్మ త‌న కొడుకు బంటు(అల్లు అర్జున్‌)ని మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తిగానే పెంచుతాడు. అల వైకుంఠ‌పుర‌ములోని రామచంద్ర దంప‌తులే త‌ల్లిదండ్రుల‌ని చెప్ప‌కుండా, దాదాపు వారిని క‌ల‌వ‌నీయ‌కుడా చూస్తాడు. 20 ఏళ్ల త‌ర్వాత బంటుకి అస‌లు నిజం తెలుస్తుంది. అప్పుడు త‌నేం చేస్తాడు? త‌న త‌ల్లిదండ్రుల‌ను చేరుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా తెర‌పై చూడాల్సిందే...

 

విశ్లేష‌ణ‌:

నిజం చెప్పేయాలి. చెప్పేటప్పుడు కష్టంగానే ఉంటుంది. కానీ చెప్పేస్తే టెన్షన్ ఉండదు. నిజంపై నిలబడే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందనే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. అసూయ, ద్వేషంతో ఓ వ్యక్తి చేసిన తప్పు ఎలా రివర్స్ అయ్యిందనే.. విధిని మార్చలేం అనే పాయింట్ కూడా చెప్పకనే చెప్పారు. ఓ సీరియ‌స్ పాయింట్ త‌ర్వాత కోటీశ్వ‌రుడైన అల్లు అర్జున్ మ‌ధ్య త‌ర‌గ‌తి ముర‌ళీశ‌ర్మ ఇంట్లో ఎలా పెరుగుతాడు? అత‌ని తండ్రి అయిన వాల్మీకి మ‌ధ్య త‌ర‌గ‌తి ఆశ‌ల‌తో ఎలా పెంచి పెద్ద‌చేస్తాడు? ఇలాంటి విష‌యాల‌ను ఎంటర్‌టైనింగ్ పంథాలో చెప్పుకుంటూ వ‌చ్చాడు. మ‌రో ప‌క్క రామ‌చంద్ర కొడుకుగా పెరిగేట‌ప్పుడు బిజినెస్‌ను టేక్ ఓవ‌ర్ చేసుకోవ‌డానికి ఇష్టం లేక ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తాడ‌నేది కూడా తెర‌పై ఆవిష్క‌రించాడు. ఇక అమూల్య(పూజా హెగ్డే) ఓ టూరిజం కంపెనీ న‌డుపుతుంటుంది. ఆమె అసిస్టెంట్‌గా అల్లు అర్జున్ జాయిన్ అవుతాడు. ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డే క్ర‌మంలో అమూల్యకి, జ‌య‌రాం ఫ్యామిలీ క‌నెక్ట్ అవుతారు. అది కూడా వ్యాపార పరంగా. త‌ర్వాత అమూల్య‌ను జ‌య‌రాం త‌నింటి కోడ‌లుని చేసుకోవాల‌నుకుంటాడు. అమూల్య తండ్రి దానికి ఓకే చెబుతాడు. అమూల్యకి సుశాంత్‌తో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఈలోపు బ‌న్నీకి అస‌లు విష‌యం తెలిసి అల వైకుంఠ‌పుర‌ములోకి ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డితో ఇంట‌ర్వెల్ ముగుస్తుంది. ఈ పార్ట్‌లో డైరెక్ట‌ర్ ఎలాంటి ట్రాక్ మార్చ‌కుండా, మ‌ళ్లింపు లేకుండా క‌థ‌ను ముందుకు తీసుకెళ్లాడు. జ‌యరాం, టబు విడిపోయిన‌ట్లుంటారు వారిని బ‌న్నీ క‌లుపుతాడు. అలాగే విల‌న్స్ రామ‌చంద్ర వ్యాపారంలో భాగాలు అడుగుతుంటే దాన్ని స‌రిదిద్దుతాడు. వీటిని కామెడీ ట్రాక్‌తో ముందుకు న‌డిపించాడు త్రివిక్ర‌మ్‌.

 

మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా, నిజం తెలిసిన‌ప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో వ‌చ్చిన త‌న స‌మ‌స్య‌ల‌ను తీర్చుకుంటూ ఎలా ముందుకెళ్లాడ‌నే కాన్సెప్ట్‌తో బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు. దాన్ని బ‌న్నీ చ‌క్క‌గా ముందుకు న‌డిపించాడు. ఇక బ‌న్నీ డాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అమూల్య రోల్‌కి పూజా హెగ్డే చ‌క్క‌గా సూట్ అయ్యింది. సుశాంత్, అత‌ని ల‌వ‌ర్‌గా నివేదా పేతురాజ్ చ‌క్క‌గా న‌టించారు. ముర‌ళీశ‌ర్మ చ‌క్క‌టి పాత్ర చేశారు. సంద‌ర్భానుసారం సముద్ర‌ఖ‌ని, అజ‌య్ విల‌నిజం బావుంది. ఇక ట‌బు, జ‌యరాం, న‌వ‌దీప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సునీల్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సముద్ర‌ఖ‌ని, అజ‌య్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇలాంటి క‌థాంశం చాలా సినిమాల్లోచూసిందే. దాన్ని త్రివిక్ర‌మ్ రిచ్‌గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. సెకండాఫ్ లాగిన‌ట్లు అనిపిస్తుంది.

త‌మ‌న్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా మారింది. సామ‌జ‌వ‌రగ‌మ‌న‌, రాములో రాముల‌, బుట్ట‌బొమ్మ సాంగ్స్ విన‌డానికే కాదు.. చూడ‌టానికి కూడా బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. పి.ఎస్‌.వినోద్ కెమెరా వ‌ర్క్ చాలా బావుంది. ప్ర‌తి సీన్ చాలా రిచ్‌గా, అందంగా క‌నిపించింది. ఎడిట‌ర్ సెకండాఫ్ విష‌యంలో ఓ ఐదు ప‌ది నిమిషాలు ఎడిట్ చేసుంటే బావుండేది అనిపించింది.

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ సెకండాఫ్‌లో కనపడుతుంది. నిజం తెలిసినా చెప్పని తండ్రి.. చాటుగా నిజం విన్న హీరో తాతయ్యగా సచిన్ ఖేడేకర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. జయరాం, టబు మాట్లాడుకోని ఓ విషయాన్ని బన్నీ ఎంత సున్నితంగా చెబుతాడు అనేది కూడా సినిమాలో చూడొచ్చు. అలాగే క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే శ్రీకాకుళం యాస పాట.. అందులోనే డిజైన్ చేసిన ఫైట్ బావుంది. అలాగే జయరాంను ప్రమాదం నుండి బన్ని ఎంత తెలివిగా కాపాడాడు అనే పాయింట్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. చివరలో సీక్రెట్‌ని తల్లికి తెలియనీయకుండా.. పెంచిన ప్రేమను దూరం చేయకూడదనే హీరో ఆలోచన బావుంటుంది.  

 

చివ‌ర‌గా: అల వైకుంఠ‌పుర‌ములో.. ఈ సంక్రాంతికి కుటుంబం అంతా క‌లిసి ఎంజాయ్ చేస్తూ చూడ‌ద‌గ్గ చిత్రం

రేటింగ్‌: 3/5

Advertisement
Advertisement
Advertisement