రైతులకు ‘ఉపాధి’ అక్షయపాత్ర

ABN , First Publish Date - 2022-05-19T06:31:50+05:30 IST

దేశ వ్యాప్తంగా ఉపాధి హామీలో ఒకే సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలన్న నిబంధనలతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ పథకం ఓ అక్షయ పాత్ర వంటిది. చిన్న, సన్నకారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థికంగా పూర్తిగా చేయూతనిస్తూ ఎన్నో పథకాలు ఆచరణలోకి వచ్చాయి.

రైతులకు ‘ఉపాధి’ అక్షయపాత్ర
డీఆర్‌డీవో పీడీ కాళిందిని

 సాఫ్ట్‌వేర్‌ బాధ్యత పంచాయతీ సెక్రటరీలదే 

 గిరిజన రైతుల ప్రగతికి గిరి వికాసం 

 అక్రమాలకు పాల్పడితే ఒకేసారి నగదు రూపంలో రికవరీ 

 జిల్లా వ్యాప్తంగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు పూర్తి 

 ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో డీఆర్‌డీవో పీడీ కాళిందిని

నల్లగొండ, మే 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశ వ్యాప్తంగా ఉపాధి హామీలో ఒకే సాఫ్ట్‌వేర్‌ వినియోగించాలన్న నిబంధనలతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గ్రామీణాభివృద్ధిలో ఉపాధి హామీ పథకం ఓ అక్షయ పాత్ర వంటిది. చిన్న, సన్నకారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థికంగా పూర్తిగా చేయూతనిస్తూ ఎన్నో పథకాలు ఆచరణలోకి వచ్చాయి. ఇప్పటి వరకు నిర్మించిన అనేక భవనాలు, నీటి నిల్వ పనులకు మరమ్మతులు చేసేందు కు ఉపాధి హామీలో నిధులు మంజూరు కానున్నాయి. పల్లెపల్లెనా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు పూర్తి తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో డీఆర్‌డీవో పీడీ కాళిందిని ఇలా స్పందించారు. 

ఆంధ్రజ్యోతి:ప్రభుత్వం రూపొందించుకున్న ‘రాగా’ సాఫ్ట్‌వేర్‌ నుంచి కేంద్రం ఆమోదించిన ఎన్‌ఐసీకి మారడంతో సర్వత్రా ఇబ్బందులు తలెత్తుతున్నాయి? పరిష్కారం ఏంటి?

పీడీ: ఒక వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారినప్పుడు సమస్యలు సర్వ సాధారణం. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా 229 పంచాయతీల్లో ఇంకా కొత్త సాఫ్ట్‌వేర్‌ను స్థానిక సిబ్బంది ఆచరణలో పెట్టడంలో విఫలమయ్యారు. పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు వెలువడడం, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తిరిగి నియామకం అవుతారన్న ఆలోచనతో ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఈ విషయంలో అలసత్వం వహించారు. ఈ పంచాయతీల్లో కొత్త సాఫ్ట్‌వే ర్‌ ఆచరణలో పెట్టే బాధ్యత పంచాయతీ సెక్రటరీలకు అప్పగించాం. ఎంపీడీవోలు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. 20 మంది పనిచేసే ప్రాంతాన్ని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయా లి, 4గంటల వ్యవధిలో రెండుసార్లు కూలీల హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇవి చేయడంలో కొంత మంది నిర్లక్ష్యం మూలంగా అక్కడక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి. 

ఆంధ్రజ్యోతి కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చిన తర్వాత ఉపాధిలో కొత్తగా ఏమైన పనులు ప్రతిపాదిస్తున్నారా? 

పీడీ: ప్రభుత్వ భవనాలు, పశువుల షెడ్లు వంటివి మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం ఉంది. సర్పంచ్‌లు దీన్ని వినియోగించుకోవాలి. చిన్న, సన్నకారు రైతులు కొంద రు భూములను ఖాళీగా వదిలేస్తున్నారు. పట్టణాల్లో స్థిరపడిన వారు ఈ విధంగా చేస్తున్నారు. అయితే భూములు ఖాళీగా ఉండకుండా వారికి భద్రత కూడా లభించేలా ఆ భూ ముల్లో యూకలిప్టస్‌, వెదురు, వేప, నేరేడు వంటి మొక్కలు ఉపాధి హామీ ద్వారా నాటే అవకాశం కొత్తగా ప్రారంభమైంది. ఉపాధి హామీ అనేది రైతులకు అక్షయ పాత్ర లాంటిది. 

ఆంధ్రజ్యోతి అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టు వివరాలు చెప్పండి? 

పీడీ: ఈ ప్రాజెక్టు కింద 75నీటి నిల్వ పనులు చేసేందుకు అనుమతి లభించింది. రూ.8లక్షలతో ఎకరం విస్తీర్ణంలో నీటి నిల్వ ట్యాంకులు నిర్మించుకోవచ్చు. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ వనరుల మరమ్మతులు, పూడికలు తీయడం, తూములకు గేట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. 

ఆంధ్రజ్యోతి: గిరి వికాస్‌ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి?

పీడీ: గిరిజన రైతుల అభివృద్ధికి సంబంధించిందే గిరి వికాస్‌. 5 నుంచి 15 ఎకరాలు ఒకేచోట ఉన్న రైతులు ఒక క్లస్టర్‌గా తీసుకుని వారి భూమిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. నీటి వనరులు కల్పించేందుకు అవసరమైన విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటుకు రూ.3లక్షలు నగదు రూపంలో అందజేస్తాం. రూ.3లక్షలపైన వ్యయం అయితే సోలార్‌ వ్యవస్థను అందుబాటులోకి తెస్తాం. బోర్లు వేయడం, సబ్‌మెర్సిబుల్‌ మోటర్‌ ఏర్పాటు చేయిస్తాం. నాలుగు పశువులు ఉంటే షెడ్‌, తోటలకు పెట్టుబడి సాయం, పశువులకు పశుగ్రాసం ఇవన్నీ పూర్తిగా ఉచితంగా గిరిజన రైతులకు అందించనున్నాం.  

Updated Date - 2022-05-19T06:31:50+05:30 IST