సంపదల తల్లి వేడుక

ABN , First Publish Date - 2021-05-14T06:24:43+05:30 IST

అక్షయ తృతీయ వేడుకను శుక్రవారం నిర్వహించుకునేందుకు జిల్లాలోని హైందవ కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి.

సంపదల తల్లి వేడుక

  1. నేడు అక్షయ తృతీయ
  2. కనిపించని ‘బంగారు’ సందడి


కర్నూలు(కల్చరల్‌), మే 13: అక్షయ తృతీయ వేడుకను శుక్రవారం నిర్వహించుకునేందుకు జిల్లాలోని హైందవ కుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, సిరిసంపదలు ప్రసాదించాలని మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించుకుంటారు. వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన (శుద్ధ తదియ) రోజున అక్షయ తృతీయను నిర్వహిస్తారు. ఈ రోజున పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాదులు చేస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. నరసింహస్వామి ప్రహ్లాదుడ్ని అనుగ్రహించిన రోజునే అక్షయ తృతీయగా పిలుస్తారు. జిల్లాలో అక్షయ తృతీయ వేడుకపై కొవిడ్‌ నిబంధనల ప్రభావం  కనిపిస్తోంది. గత ఏడాది కూడా ఇదే సమస్యతో ఆభరణాల వ్యాపారుల ఆశలు ఫలించలేదు. వరుసగా రెండో ఏడాదీ అదే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ లేనందున మధ్యాహ్నం 12 గంటల వరకైనా కొంత వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆశపడుతున్నారు. కొవిడ్‌ భయంతో వ్రతాలు, పూజలకు ఎవరినీ ఆహ్వానించలేని పరిస్థితి ఏర్పడింది. మహిళలు తమ తమ గృహాల్లోనే వేడుకకు పరిమితమవుతున్నారు. 


కనిపించని సందడి

అక్షయ తృతీయ రోజున కాసు ఎత్తు బంగారమైనా కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. గృహిణులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇళ్లలోనే ఉన్నంతలో పూజలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన బంగారాన్ని పండుగ రోజున ధరించనున్నారు. అయితే, ఈ పర్వదినాన కనీసం లక్ష్మీ కాసులనైనా కొనకపోతారా అన్ని వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మాసంలో శుభకార్యాలపై ఉన్న ఆంక్షలు కూడా బంగారు కొనుగోళ్లపై ప్రభావితం చూపిస్తున్నాయని వ్యాపారాలు పేర్కొంటున్నారు. 

Updated Date - 2021-05-14T06:24:43+05:30 IST