అక్షరధామ్ ఆలయానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-02-27T15:57:40+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ...

అక్షరధామ్ ఆలయానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చిందో తెలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయ అందాలను చూసేందుకు మన దేశం నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అక్షరధామ్ ఆలయ చరిత్రతో పాటు ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో పలు వారసత్వ సంపదలున్నాయి. వాటిలో ఒకటే అక్షరధామ్ ఆలయం. ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఢిల్లీలోని బ్లూ లైన్ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఈ ఆలయ అందాలను వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం కావడంతో అక్షర‌ధామ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. 

అక్షరధామ్ అంటే.. 

అక్షరధామ్ అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం. ఇది భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ దేవాలయం మతసామరస్యానికి అంకితం అయ్యింది. ఈ ఆలయాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. ఈ ఆలయంలో భారతదేశపు పౌరాణిక నాగరికత అణువణువునా కనిపిస్తుంది.



అక్షరధామ్ ఆలయ చరిత్ర

అక్షరధామ్ ఆలయ నిర్మాణం అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో స్వామినారాయణ్ ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన ఐదవ వారసుడు ప్రముఖస్వామి మహారాజ్ కీలకపాత్ర పోషించారు. ఢిల్లీలోని ఈ అక్షరధామ్ 2005లో భక్తులు, సందర్శకుల కోసం సిద్ధం అయ్యింది. 

అక్షరధామ్ శిల్పాలు

అక్షరధామ్‌ ఆధ్యాత్మికత ప్రతిబింబంలా కనిపిస్తుంది.  అక్షరధామ్‌లో దాదాపు 200 విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మికతను పరిచయం చేస్తాయి. అక్షరధామ్ తెలిపే ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే.. ప్రతి ఆత్మ ఒక దైవిక కాంతి. ప్రతి ప్రార్థన మిమ్మల్ని మీరు మెరుగుపరచుకునేందుకు, దేవునికి దగ్గరయ్యేందుకు ఆధారంగా నిలుస్తుంది. అక్షరధామ్ సందర్శన ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన అనుభవమని భక్తులు చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలోని మ్యూజికల్ ఫౌంటెన్ చాలా ప్రసిద్ధి చెందింది. దీని ప్రదర్శన సాయంత్రం 25 నిమిషాల పాటు ఉంటుంది. అక్షరధామ్ ఆలయం సోమవారాల్లో మూసివేస్తారు. మిగిలిన రోజుల్లో, ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచివుంచుతారు. 

Updated Date - 2022-02-27T15:57:40+05:30 IST