అక్షర శరధీ! దాశరథీ!

ABN , First Publish Date - 2021-07-22T08:40:11+05:30 IST

తెలంగాణ విముక్తికై తేజోరాశిగా గళమెత్తిన అరాచకత్వంపై ‘అగ్నిధార’గా కలమెత్తిన...

అక్షర శరధీ! దాశరథీ!

తెలంగాణ విముక్తికై

తేజోరాశిగా గళమెత్తిన

అరాచకత్వంపై

‘అగ్నిధార’గా కలమెత్తిన

అక్షర శరధీ-దాశరథీ!

కమనీయ కవితా పయోనిధీ!

పోలీసుల లాఠీలకు

రజాకార్ల తూటాలకు

రవ్వంతయు వెరువని ధీనిధీ!

మహాకవిగానే గాక

మండే రవిగా ప్రజ్వరిల్లిన విప్లవవారధీ!

‘తిమిరంతో సమరం’కై ఎగిసిన

తీవ్ర భావ తరంగ వారిధీ!

అంతరంగం నినదిస్తూ

అందిస్తోంది అక్షరాంజలి!...

చలనచిత్ర శృంగారగీతమైనా

జ్వలనసూత్ర అంగార పద్యమైనా

అలవోకగా అల్లగలిగిన సవ్యసాచీ!

నీ జయంతిని స్మరిస్తూ

నిఖిల తెలంగాణం

నివాళి అర్పిస్తోంది కేలుమోడ్చీ!...

డా. వడ్డేపల్లి కృష్ణ

Updated Date - 2021-07-22T08:40:11+05:30 IST