‘అక్షర చైతన్యం’లో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2022-01-15T04:17:36+05:30 IST

జిల్లాలో ప్రారంభించిన అక్షర చైతన్యం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు.

‘అక్షర చైతన్యం’లో సత్ఫలితాలు
విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 67 నుంచి 87 శాతానికి పెరిగిన అక్షరాస్యత

ఉగాది నాటికి పేదలకు గృహప్రవేశాలు

వ్యాక్సినేషనలో దేశంలోనే జిల్లా ముందుంజ

విలేకరులతో కలెక్టర్‌ చక్రధర్‌బాబు


నెల్లూరు (హరనాథపురం), జనవరి 14 : జిల్లాలో ప్రారంభించిన అక్షర చైతన్యం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు చెప్పారు. నెల్లూరులోని  తిక్కన భవనలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామసీమల్లో నివసించే ప్రజలందరూ అక్షరాస్యులు కావాలనే ధ్రుడ సంకల్పంతో గతేడాది ఆగస్టులో  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుతో జిల్లా అక్షరాస్యత శాతం 67 నుంచి 84 శాతానికి పెరిగిందని చెప్పారు. జిల్లాలోని 40 మండలాల్లో 1,33,438 మంది నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ద్వారా 8426 అక్షర కేంద్రాలను ఏర్పాటు చేసి, మండలవారీగా ప్రత్యేక అధికారులను నియమించి, రూ.38.85 లక్షలతో అభ్యసన సామగ్రి, బోధన పుస్తకాలను వయోజన విద్యాశాఖ ద్వారా అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 8న జరిగిన పరీక్షలో 1,24,270 మంది హాజరవగా, 1,16,566 మంది ఉత్తీర్ణత (93.8 శాతం) సాధించినట్లు తెలిపారు. 


49 వేల ఇళ్లలో గృహప్రవేశాలు


నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లేఅవుట్లలో దాదాపు 49 వేల ఇళ్లలో రాబోవు ఏప్రిల్‌లో గృహప్రవేశాలు చేయించాలని లక్ష్యంగా పని చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. స్వచ్ఛందంగా ఇంటి నిర్మాణాలు చేసుకొంటున్న లబ్ధిదారులకు రూ.39.5 కోట్లను వారి ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.  ఎనఆర్‌ఈజీఎ్‌స పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు 90 పనిదినాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మెప్మా, డీఆర్‌డీఏల ద్వారా పావలావడ్డీకి రూ.35వేల రుణాన్ని అందచేస్తున్నారన్నారు. రాబోయే ఉగాది నాటికి అందరూ  గృహప్రవేశాలు చేసుకోవాలని కోరారు.


కొవిడ్‌ ముందు జాగ్రత్తలు పాటించాలి :


దేశంలో కొవిడ్‌ మూడో ఉధృతి కొనసాగుతోందని, ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారిలో వ్యాక్సినేషనలో ఇప్పటికే నెల్లూరు జిల్లా దేశంలోనే మందంజలో ఉందన్నారు. అలాగే 15 నుంచి 18 ఏళ్ల కేటగిరీలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన అందించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇది చాలా గర్వకారణమైన విషయమన్నారు. జనవరి నుంచి కొవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా ప్రభుత్వ పరంగా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలో 4200 పడకలను సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 50 పడకలకు పైనున్న  వైద్యశాలల్లో ఆక్సిజన ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1300 యాక్టివ్‌ కేసులు ఉన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవన్నారు. పండుగ రోజుల్లో ఎవరి ఇళ్లలో వారుండి పండుగ చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2022-01-15T04:17:36+05:30 IST