ఆక్రోశ్

ABN , First Publish Date - 2021-05-05T05:47:15+05:30 IST

కర్తవ్యం పట్ల నిలువెత్తు నిర్లక్ష్యమిది. ఎలక్షన్లే దానికి తిరుగులేని సాక్ష్యం. వైరస్‌ను మించిన రాజకీయ నవరస్ నాట్యమాడుతోంది...

ఆక్రోశ్

కర్తవ్యం పట్ల

నిలువెత్తు నిర్లక్ష్యమిది.

ఎలక్షన్లే దానికి

తిరుగులేని సాక్ష్యం.


వైరస్‌ను మించిన

రాజకీయ నవరస్ నాట్యమాడుతోంది.

గాలిలో దీపమై

ప్రాణం చివరిగీతం పాడుతోంది.


పత్రికల్లో మృత్యువు తప్ప

ఏ వార్తా రుచించటం లేదు.

ఇప్పుడు ప్రతి శవమూ

ఒక టోకన్‌గా మారి ఎదురుచూస్తుంది.

దేశమంతా

ఒక పరాకాష్ఠంగా మండుతుంది.


దేశంలో అవినీతి వుందని

నేనిప్పుడే కొత్తగా కనుక్కోలేదు

అయితే అది

ఇప్పుడు కూడా అపవాదం కాదని

ఎలుగెత్తి చాటుతున్నాను.


అన్ని విలువలూ

స్వార్థం ముందు డొల్లలైనాయి

ధర్మానికీ కరుణకూ

సంబంధమే లేదు.

మొద్దుబారిన అనుభవాలు

శిలలతో సమానం.

పరిపాలన

మురికి సముద్రమంత

దరిద్రంగా వుంది.


రేపు మనిషి

వైరస్‌ను జయించినా

మానవత్వం ముందు మాత్రం

చిత్తుగా ఓడిపోతున్నాడు.

చరిత్రా!

నీ వర్తమానం పుటలు

మలినాతిమలినం.

డా.౹౹ ఎన్. గోపి

Updated Date - 2021-05-05T05:47:15+05:30 IST