ఆక్రమణ పేరుతో ప్రహరీ, డెయిరీ కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-22T03:43:35+05:30 IST

మండలంలోని తూర్పుఎర్రబల్లి గ్రామంలో ఆక్రమణ పేరుతో ప్రహరీగోడ, పాల డెయిరీ షెడ్డును శుక్రవారం కూల్చి వేశారు.

ఆక్రమణ పేరుతో  ప్రహరీ, డెయిరీ కూల్చివేత
కూల్చిన పాలడెయిరీ షెడ్డు

కోర్టు స్టేను ఖాతరు చేయని అధికారులు

కొండాపురం, జనవరి 21: మండలంలోని తూర్పుఎర్రబల్లి గ్రామంలో ఆక్రమణ పేరుతో ప్రహరీగోడ, పాల డెయిరీ షెడ్డును శుక్రవారం కూల్చి వేశారు. బాధితుడు బండారు మాల్యాద్రి కథనం మేరకు.. 1988వ సంవత్పరంలో సర్వే నెంబరు 325లో 60 సెంట్ల స్థలాన్ని గ్రామానికి చెందిన ఎస్‌.మాలకొండయ్య దగ్గర కొనుగోలు చేసి రిజిస్రేషన్‌ చేయించుకొని నూనె మిల్లు ఏర్పాటు చేశారు. 2000వ సంవత్సరంలో పంచాయతీ అప్రూవల్‌తోపాటు అన్నిరకాల అనుమతులతో నూనె మిల్లు స్థానంలో రైస్‌ మిల్లును ఏర్పాటు చేశారు. ఇటీవల అదేస్థలంలో పాల డెయిరీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పంచాయతీస్థలమంటూ సచివాలయ అధికారులు నోటీసు ఇవ్వగా కోర్టును ఆశ్రయించి గత నెల 23వ తేదీన స్టే ఆర్డరు తెచ్చుకున్నారు. ఆ ఆర్డరు కాపీ ప్రతివాదులయిన అందరు అధికారులకు పంపామని బాధితుడు తెలిపాడు. అన్నిరకాల అనుమతులున్నా ప్రహరీ గోడ, పాలడెయిరీ షెడ్డును తహసీల్దార్‌ సూర్యనారాయణసింగ్‌, ఈవోపీఆర్‌డీ విజయ్‌కుమార్‌, సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ మాల్యాద్రి, ఆర్‌ఐ, వీఆర్‌వో, సచివాలయ సిబ్బంది స్థానిక వైసీపీ నాయకులతో కలసి కూల్చారని వాపోయాడు. ఈ విషయంపై తహసీల్దార్‌ సూర్యనారాయణసింగ్‌ను వివరణ కోరగా సర్వే నెంబరు 323 శ్మశాన స్థలం హద్దులు చూపించమని కోరారన్నారు. సర్వే చేసి హద్దులు తేల్చగా ఆక్రమణలో ఉన్న నిర్మాణాలను తొలగించారని, సదరువ్యక్తులకు సమయమిచ్చినా తీయకపోవడంతో పంచాయతీ సిబ్బంది కూల్చారన్నారు.

Updated Date - 2022-01-22T03:43:35+05:30 IST