Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 14 Jan 2022 15:15:05 IST

సినిమా రివ్యూ : బంగార్రాజు

twitter-iconwatsapp-iconfb-icon
సినిమా రివ్యూ : బంగార్రాజు

సినిమా: బంగార్రాజు

విడుదల తేది: 14–01–2022

నటీనటులు: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీశెట్టి, ఫరియా అబ్దుల్లా, దక్ష, రావు రమేశ్‌, నాగబాబు, వెన్నెల కిషోర్‌, ఝాన్సీ, బ్రహ్మాజీ, ప్రవీణ్‌. సంపత్‌రాజ్‌ తదితరులు.

కెమెరా: యువరాజ్‌

ఆర్ట్‌: బ్రహ్మ కడలి

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

నిర్మాత: నాగార్జున అక్కినేని

స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌

కథ–దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల


2016 సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా ఐదేళ్ల తర్వాత వచ్చిన చిత్రం ‘బంగార్రాజు’. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలున్నాయి. అచ్చమైన పల్లె వాతావరణంలో, పూర్తిస్థాయి పల్లె పాత్రలతో సినిమాలు అరుదుగా వస్తున్న సమయంలో ఇదొక మంచి ప్రయత్నం అనే చెప్పాలి. ఆ చిత్రంలోని నటీనటుల్లో చిన్న చిన్న మార్పులు చేసి, తండ్రీకొడుకుల కథకు, మనవడిగా నాగచైతన్యను జోడించి కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్లు, పాటలు విడుదలైనప్పటి నుంచి భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సోగ్గాడి అంచనాలను అందుకుందా లేదా అన్నది రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:

మొదటిపార్ట్‌లో బంగార్రాజు కొడుకు రాము (నాగార్జున) జీవితాన్ని సరిదిద్దడానికి స్వర్గ లోకం నుంచి భూలోకానికి వచ్చిన బంగార్రాజు రాము–సీతల మధ్య సమస్యలను పరిష్కరించి పైకి వెళ్లిపోతాడు. ఈసారి తన మనవడు చిన బంగార్రాజు (నాగచైతన్య)ను దార్లోకి తీసుకురావడానికి, అతని ప్రాణానికి ఉన్న ముప్పును, కుటుంబ సమస్యలను తొలగించడానికి యముడి ఆజ్ఞ మేరకు భూలోకానికి వస్తాడు. కిందికి వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి వాటిని ఎలా పరిష్కరించాడు. క్షణం కూడా పడని చిన బంగార్రాజుకు, నాగలక్ష్మీ (కృతిశెట్టికి) ఎలా ముడి వేశాడు. తన ఊరి దేవాలయం నిధులు కాజేయడానికి దుష్టశక్తుల పన్నిన పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టాడు అన్నది కథ. 


సినిమా రివ్యూ : బంగార్రాజు

విశ్లేషణ: 

కథగా చెప్పుకుంటే ‘సోగ్గాడే చిన్నినాయానా’కు దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. అందులో బంగార్రాజు కొడుకు సమస్యను చక్కదిద్దితే, ఇందులో మనవడిని సమస్యల నుంచి గట్టెక్కించాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మగా కనిపిస్తే ఇందులో తన భార్య సత్యభామ(రమ్యకృష్ణ) కూడా ఆత్మగా కనిపించింది. ఫస్టాఫ్‌ అంతా చిన్న బంగార్రాజు, అతని స్నేహితులు, నాగలక్ష్మీ ప్రెసిడెంట్‌ కావడం, సరదా అల్లర్లతో సో. .సోగా సాగింది. సెకెండాఫ్‌ ప్రారంభమయ్యే సరికి ఆసక్తికరంగా సాగింది. కథ రొటీన్‌గా ఉన్నప్పుడు కథనం టైట్‌గా ఉండి ఉంటే బావుండేది. జరగబోయే సన్నివేశం ఏంటనేది ప్రేక్షకుడు ఊహించేలా ఉన్నాయి. స్నేహితుడు ఆది, రావు రమేశ్‌ సినిమాకు విలన్లు అని తెలిసినప్పటి నుంచీ అంత ఆసక్తిగా అనిపించలేదు. కొన్ని సన్నివేశాలను లాజిక్కులు లేకుండా వదిలేశారు. ఇసుక తవ్వకాల దగ్గర కనిపించిన విలువైన వజ్రాల సన్నివేశానికి సంబంధించి మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా గుడి కింద ఉన్న నిధి ప్రస్తావనకు వచ్చారు. ఆ సన్నివేశాలు కాస్త అతికినట్లు లేవు. వాటికి ఏదో ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే ప్రేక్షకుడి ఆలోచన నెగటివ్‌ వేలోకి  వెళ్లే ఆలోచన ఉండేది కాదు. ఆత్మల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కాబట్టి లాజిక్కుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఆ లాజిక్‌ల గురించి  ఆలోచించకుండా దర్శకుడు కామెడీ మీద, ఇంకాస్త ఎమోషన్స్‌ మీద దృష్టి పెట్టి ఉండే ఇంకా ఆసక్తికరంగా సినిమా సాగేది.


నటీనటులు విషయానికొస్తే... తెరపై నాగార్జున చేసిన సందడి అలరించింది. మనవడిని, నాగలక్ష్మీతో కలపడానికి తను చేసిన మేజిక్‌లు ఆకట్టుకున్నాయి. ఈసారి తెరపై తాను కనిపించడం కన్నా నాగచైతన్యకే ఎక్కువ స్కోప్‌ ఇచ్చారు. అయితే చైతూ కూడా తండ్రితో సమానంగా ఎక్కడా తగ్గకుండా యాక్ట్‌ చేశాడు. గుడి దగ్గర రివీల్‌ చేసిన రావు రమేశ్‌ మలుపు.. స్నేహితుడు ఆది తన పాలిట శత్రువు అనే ట్విస్ట్‌లు అలరించాయి. మావిడి తోటలో ఎద్దు సన్నివేశం, అత్తమామలు, కోడలి మధ్య సమస్యలను సర్దుబాటు సన్నివేశంలో బంగార్రాజు చెప్పే డైలాగ్‌లు, తన భార్య సత్తెమ్మతో ‘ఏం చేసిన బతికుండగానే చేయాలి. చచ్చాక ఫొటోలు మాత్రమే జ్ఞాపకాలుగా ఉంటాయి’ అన్ని భావోద్వేగంగా చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి. మాటలపరంగా దర్శకుడు మంచి మార్క్‌ చూపించాడు. ‘అచ్చొసిన చందమామ’ లాంటి సంభాషణలు అలరించాయి. నాగార్జున, రమ్యకృష్ణలది హిట్‌ అండ్‌ రొమాంటిక్‌ పెయిర్‌ అనేది అందరికీ  తెలిసిందే. వారిద్దరి కెమిస్ట్రీ మరోసారి బాగా వర్కవుట్‌ అయిందనే చెప్పాలి. నాగచైతన్య కూడా తండ్రికి పోటీగా నటించాడు. గ్రామీణ నేపథ్యంలో ఇప్పటి వరకూ చైతూ ఏ సినిమా చేయలేదు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న ఆయన ఈ తరహా పాత్రలకు సరిపోతాడని నిరూపించాడు. చైతూ కూడా మన్మథుడే అని ఈ సినిమా నిరూపించింది. హీరోయిన్‌ కృతిశెట్టికి నటనతోపాటు డాన్స్‌కు కూడా మంచి స్కోప్‌ దొరికింది. చాలా సహజంగా ఆమె నటన ఉంది. ఆమె పండించిన హాస్యం కూడా అలరించింది. వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, రావు రమేశ్‌ తదితరులు పాత్రల మేరకు న్యాయం చేశారు. ప్రవీణ్‌ వంటి ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ వారి నుంచి వినోదాన్ని పుట్టించే ప్రయత్నం పెద్దగా చేయలేదు దర్శకుడు. దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, వేదిక, మీనాక్షి దీక్షిత్‌ వంటి అతిథి పాత్రలో స్ర్కీన్‌ని మరింత కలర్‌ఫుల్‌గా చేశారు. అనూప్‌ రూబెన్స్‌ పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. నిర్మాణ విలువలు, లొకేషన్లు, కెమెరా పనితనం సినిమాకు ఎసెట్‌. సంక్రాంతి సీజన్‌లో కమర్షియల్‌ హంగులతో పక్కా విలేజ్‌ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఉంది. 


ట్యాగ్‌లైన్‌: లాజిక్కులు పట్టించుకోకపోతే పండగ ‘బంగార్రాజు’లదే! Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International