Chitrajyothy Logo
Advertisement

అలాంటప్పుడే బంధాల బలమేంటో తెలుస్తుంది!

twitter-iconwatsapp-iconfb-icon
అలాంటప్పుడే బంధాల బలమేంటో తెలుస్తుంది!

సుశాంత్‌, సంగీత, సాహిత్య.. 

ఈ ముగ్గురూ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, మనవరాళ్లు. పేరుకు తగినట్లే.. సుశాంత్‌ది ప్రశాంతమైన స్వభావం. సంగీత పియానో ప్లే చేస్తుంది.  సాహిత్య కవితలు రాస్తుంది. ‘నాకో అక్క, చెల్లి ఉన్నందుకు.. రెండు రాఖీలు కట్టించుకొనే అబ్బాయిగా ఎంతో ఆనందపడతా. కష్టాల్లో వీరిద్దరూ తోడుగా నిలుస్తార’ంటాడు సుశాంత్‌. ‘నెమ్మదస్తుడు. ఎల్లవేళలా మాకు అండగా నిలుస్తాడు’ అంటున్నారు సంగీత, సాహిత్య. రాఖీ పూర్ణిమ సందర్భంగా సంగీత, సుశాంత్‌, సాహిత్య ‘నవ్య’తో తమ అనుబంధాల్ని, ఆత్మీయతల్ని చెప్పుకొచ్చారిలా...


బాల్యంలో రాఖీ పండుగ.. 

సుశాంత్‌- రాఖీ రోజు ఇల్లంతా పండుగే. అమ్మ ఏనాడూ ఈ పండుగని మరచిపోలేదు. చిన్న మామయ్య నాగార్జున, పెద్ద మామయ్య వెంకట్‌ ఎక్కడున్నా వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ రాఖీలు కట్టేది. మేం అమ్మతో వెళ్లే వాళ్లం. వాళ్ల అన్నయ్యల కోసమే కాకుండా నా కోసం అమ్మ రెండు రాఖీలు కొనేది. అవే సంగీతకి, సాహిత్యకి కట్టేవాణ్ని. ఇప్పటికే ఇదే ఫాలో అవుతున్నా(నవ్వులు). 


సంగీత- ఊహ వచ్చినప్పటి నుంచీ తమ్ముడికి  రాఖీ కట్టిన తర్వాత తీపి పదార్థం తినిపిస్తున్నా. చిన్నప్పటి నుంచీ చూస్తున్నా... కనీసం ఐదు రోజులకోసారైనా అమ్మ యోగ క్షేమాలు మామయ్యలు తెలుసుకుంటుంటారు. అలాగే సుశాంత్‌ కూడా మాతో ఉంటాడు.

సాహిత్య- ఇంట్లో చిన్నదాన్ని. రాఖీ రోజే అన్నయ్య కొత్తగా ఉన్నట్లు అనిపించదు. సంప్రదాయం కాబట్టి రాఖీ కడతా. ఎటూ బహుమతులు వస్తాయి కదా (నవ్వులు)! గతేడాది రాఖీ రోజున తొమ్మిది మంది గ్యాంగ్‌ ఖాళీగా ఉండటంతో మా ఇంట్లోనే కలిశాం. కజిన్స్‌లో ఐదుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. ఐదుగురూ గిఫ్టులు తెచ్చారు. ఈ ఏడాది అన్నయ్య ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమా పనులతో బిజీ. అయినప్పటికీ ఈ ఆదివారాన్ని మాకే కేటాయించాడు.


రాఖీలు కట్టాక బహుమతుల సంగతేంటి... 

సుశాంత్‌- రాఖీలతో పాటు స్వీట్‌ ప్యాకెట్స్‌, గిఫ్టులూ అమ్మ కొనేది. మన పనంతా అమ్మ చెప్పింది చేయటమే. సంపాదించటం మొదలయ్యాక.. అది కూడా మూడేళ్ల నుంచి బహుమతులు కొంటున్నా.

సంగీత- సుశాంత్‌కు పిల్లలంటే ప్రాణం. నా కూతుర్ని బాగా ముద్దు చేస్తాడు. గతేడాది సుప్రియ కూతురికి, నా కూతురికి కూడా బహుమతులు ఇచ్చాడు.

సాహిత్య- నాకో స్వచ్ఛంద సంస్థ ఉంది. పుట్టినరోజు, రాఖీ పండుగరోజున డొనేషన్‌ ఇస్తాడు. మీకో విషయం తెలుసా? ఇద్దరికీ ఈ ఇయర్‌ రింగ్స్‌ కొనిచ్చాడు. ఎంత బావున్నాయో! 


మీ తాతయ్య రాఖీ పండుగ సంగతులు.. 

సుశాంత్‌-  రాఖీ పండుగ సమయాల్లో తాతను ఎప్పుడూ కలవలేదు. కుటుంబమంతా కలిసినప్పుడే పండుగ అనేవారాయన. సంక్రాంతి పండుగకు అన్నపూర్ణ స్టూడియోలో కచ్చితంగా కలిసేవాళ్లమంతా. ఎందుకంటే.. ఆ రోజే స్టూడియోకి పునాది రాయి వేశారు తాతయ్య. దీపావళి పండక్కి కూడా కలిసేవాళ్లం. 


చిన్నప్పుడు గొడవపడేవారా?

సంగీత- బాగా కొట్లాడుకునే వాళ్లం. ఎంతగా అంటే.. మేం అమెరికాకి ఉన్నత చదువులకు వెళ్తూ ఉంటే.. ‘మీ ఇద్దరినీ  ఒకే విమానంలో పంపకూడదు’ అనేవారు నాన్న. అయితే విచిత్రంగా అమెరికా వెళ్లాక మేం క్లోజయ్యాం. నేను ఎమ్‌.ఎస్‌ చదువుతోంటే.. సుశాంత్‌ బిటెక్‌ ఎలక్ర్టానిక్స్‌ చేసేవాడు. ఖాళీ దొరికితే చాలు.. నా దగ్గరకు వచ్చేవాడు. ‘అక్కా.. ఏదైనా మంచి ఫుడ్‌ చెయ్యి’ అనేవాడు. తనకిష్టమైన వంటలు చేసేదాన్ని. తర్వాత్తర్వాత ఒక్కసారి కూడా మేం కొట్లాడుకున్నట్లు గుర్తే లేదు. 

సుశాంత్‌- అన్నీ చిన్నగొడవలే. ఎప్పుడూ.. కారులో ఎడమ పక్క కూర్చునేది అక్క. ఎందుకో తెలిసేది కాదు నాకు. ఆ సీట్లో కూర్చోవాలని మంకుపట్టు పట్టేవాణ్ని. గొడవ పడేవాణ్ని. అక్క ఏమి చేసినా.. అనుకరించేవాణ్ని. అమెరికా వెళ్లాక ఇద్దరం ఇంటికీ, దేశానికి దూరం కావటం వల్ల ఇద్దరం ఒకే విషయం మాట్లాడేవాళ్లం. అమెరికన్‌ సిటిజన్‌షిప్‌ ఉంది కాబట్టి ఫీజు తక్కువుండేది నాకు. అక్కకి ఫీజు ఎక్కువ. ఉద్యోగం చేసి.. డబ్బులు ఇచ్చేది. విమాన టికెట్లూ తనే బుక్‌ చేసేది. అంత కేరింగ్‌ తను. 

సాహిత్య- వీళ్లిద్దరూ గొడవ పడేవాళ్లు. నేను చిన్నదాన్ని కదా..అందుకే నన్ను ఏమీ అనేవాళ్లు కాదు. అమెరికా వెళ్లొచ్చాక.. ఇద్దరూ దగ్గరయ్యారు. పదేళ్లనుంచి మా మధ్య అనుబంధం పెరిగింది. ఇంత దగ్గరయ్యాక కూడా.. అభిప్రాయ బేధాలతో రెండు, మూడు సార్లు గొడవపడ్డాం. ఆ ఫైటింగ్స్‌తో మరింత గౌరవం పెరిగింది. ఒకరి అభిప్రాయాలకు మరొకరం విలువనిచ్చాం. నేను చెప్పేదొక్కటే.. తోబుట్టువుల మధ్య ఫైటింగ్‌ ఉండాల్సిందే. అప్పుడే బావుంటుంది (నవ్వులు). 


తోబుట్టువుల అనుబంధం... 

సుశాంత్‌- నేనూ, సుమంత్‌ అన్న, సుప్రియ, సంగీత తాతయ్యగారింట్లో ఆరేడేళ్లు పెరిగాం. అక్కడ తోబుట్టువులు, కజిన్స్‌ అనే తేడా ఎప్పుడూ లేదు. మేం ఎవరింటికి వాళ్లం వెళ్లాక్కూడా తాతగారింట్లోనే ఎక్కువ కలిసేవాళ్లం. సమస్యలు వస్తేనే అనుబంధం బలమేంటో తెలుస్తుంది. కష్టాల్లో ఒకరికొకరం తోడుగా ఉంటాం.

సంగీత- వాట్సప్‌లో కజిన్స్‌ గ్రూప్‌, ఫ్రెండ్సు గ్రూపు ఉంది. దాదాపు మా స్నేహితులంతా ఒక్కటే. ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటాం. ఏ సమస్య అయినా చక్కని పరిష్కారం తమ్ముడు చెబుతాడు. ఫాలోఅప్‌ చేస్తాడు.

సాహిత్య- ఎవరి రూమ్‌లో వాళ్లం ఉన్నా.. వాట్సప్‌లో మాట్లాడుకుంటుంటాం (నవ్వులు). అది పక్కనపెడితే నా వృత్తిలో ప్రతిరోజూ సమస్యలే. జుట్టు పీక్కునే సమస్యలకూ సలహా ఇట్లే ఇచ్చేస్తాడు. 


మానసిక బలం ఎవరికి ఎక్కువంటే...

సుశాంత్‌- ఈ మధ్య అక్క మానసికంగా స్ర్టాంగ్‌ అయింది. చెల్లి ప్రశాంతంగా, నవ్వుతూ ఉంటుంది. బాధను కనపడనివ్వదు. ఏ సమస్య వచ్చినా చెప్పదు. తన వల్ల కాకుంటే చెబుతుంది. సలహాలు తీసుకుంటుంది. తను నడిపే స్వచ్ఛంధ సంస్థను విప్రోలాంటి సంస్థతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించింది. యూనిసెఫ్‌తో కలిసి ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతికి పాటు పడుతుంది. కష్టపడి ఈ రంగంలో నమ్మకం తెచ్చుకుందంటే.. అదే గొప్ప విషయం. 


మీకు ‘సుశాంత్‌’ ఇచ్చే భరోసా.. 

సాహిత్య- గత మూడేళ్ల నుంచీ సుష్‌లో మార్పు అద్భుతం. అమ్మాయిల పాయింటాఫ్‌ వ్యూలో ఆలోచిస్తున్నాడు. ఎవరికి సమస్య వచ్చిన కబుర్లు చెప్పడు. స్పందించే విధానం బావుంటుంది. ‘జరిగిందేదో జరిగింది.. ఇలా చెయ్యి’ అంటూ సరైన నిర్ణయం చెబుతాడు. అపజయం వచ్చినా భయపడడు. 2017 నుంచి ‘ఇంక్విలాబ్‌’ అనే స్వచ్ఛంధ సంస్థను నడుపుతున్నా. మన చుట్టూ సమస్యలను గుర్తించి పరిష్కరించేట్లు చేస్తాం. మా సంస్థ మంచి పనుల్ని అడక్కుండానే సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తాడు సుశాంత్‌. నా పనిలో బిజీ అయితే.. విశ్రాంతి తీస్కో అంటాడు. నా పొరపాట్లను సరి చేస్తాడు. 


సమస్యల్ని పరిష్కరించే శక్తి ఎలా వచ్చింది?

సుశాంత్‌- సినీ పరిశ్రమలోకి వచ్చాక జీవితం పబ్లిక్కే. సినిమా కథ దగ్గర నుంచి షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకూ... ఎన్నో అహాలు, సృజనాత్మకతలో అభిప్రాయ బేధాలు, ఒత్తిళ్లు, డెడ్‌లైన్లు ఉంటాయి. ఇలాంటప్పుడు టీమ్‌ వర్క్‌ ఉండాలి. ఓపిగ్గా అందరితో మాట్లాడాలి. ఆ సహనం.. సమస్యల్ని సులువుగా పరిష్కరించేలా చేసిందేమో! 


సుశాంత్‌ సినిమాల్లోకి వచ్చాక మీరేమనుకున్నారు..

సంగీత- వీడిని చూసి ఓ అక్కగా గర్వపడ్డాను. తన ఆశయం నెరవేరిందనే ఆనందం. సాహిత్య- సినిమాలంటే ప్రాణం. షూటింగ్‌ ఉన్నప్పుడు హుషారుగా ఉంటాడు. సుశాంత్‌- ఇద్దురూ అపజయాల్లో తోడున్నారు.


నిజంగా ఈ రంగానికి  ఇష్టంతో వచ్చారా? లేదా వాతావరణం ప్రభావమా?

సుశాంత్‌- తాతయ్య నటించిన ‘రావుగారిల్లు’ షూటింగ్‌ గుర్తుంది. ‘శివ’, ‘హలో బ్రదర్‌’ సినిమాల్లోని దాదాపు అన్ని పాటల చిత్రీకరణ చూశా. ‘రౌడీ అల్లుడు’ చిత్రీకరణ సమయంలో చిరంజీవిని కలిశా. అలా వాతావరణ ప్రభావం పడింది. సినిమాల్లో నటించగలనా? అనే సందేహం వెంటాడేది. అమెరికాలో చదువు పూర్తయ్యాక క్యాంపస్‌ ఇంటర్వ్యూలోనే ఓ ఆయిల్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించా. పని ఒత్తిడి ఎక్కువుండేది. జీతం అంతే బావుండేది. సినిమాపై ప్రేమతో ఆర్నెళ్ల ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చా. ఓ రోజు తాతయ్యతో ‘సినిమాల్లోకి రావాలనుంద’ని చెప్పా. ‘బావున్నావు. ప్రయత్నించు’ అన్నారాయన. 


జయాపజయాల్ని ఎలా నిర్వచిస్తారు..

సుశాంత్‌- సినిమాల్లో విజయం, అపజయం రెండూ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇది దాచుకునే వృత్తి కాదు. వ్యాపారం చేస్తే లాభ, నష్టాలు ఇతరులకు తెలీవు. అయితే సినిమా అలా కాదు.. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌. సినిమా పోయిందా?లేదా అనే విషయం ఎవరడిగినా చెబుతారు. ఏవీ మన చేతుల్లో ఉండవు. పనిలో లోపం ఉండకూడదు.


భవిష్యత్‌లో సుశాంత్‌ ఎలా ఉండాలనుకుంటారు..

సంగీత- చేసే ప్రతి సినిమా మనసు పెట్టి చేస్తున్నాడు. ఈ రంగంలో మంచి విజయాలందుకోవాలి. సాహిత్య- మంచి పాత్రలు చేయాలి. ఏడాదికి రెండు సినిమాలు చేయాలి.


ముగ్గురూ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. సంగీత బీకామ్‌ తర్వాత అమెరికాలో ఐ.టిలో ఎమ్‌.ఎస్‌ చేసింది. ఇరవై ఏళ్లుగా ఐ.టి.రంగంలో పని చేస్తోంది. అమెరికాలో ఉన్నపుడు పియానో నేర్చుకుంది. మళ్లీ తన కూతురితో పాటు పియానో నేర్చుకుంటోందిప్పుడు. ‘చదివిన బిటెక్‌ ఎలక్ర్టానిక్స్‌ ..ఎడిటింగ్‌, సౌండ్‌ మీద అవగాహన పెరగడానికి ఉపయోగపడింది’ అంటాడు సుశాంత్‌. లాక్‌డౌన్‌లో పియానో నేర్చుకున్నాడు. ప్రస్తుతం ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నాడు. సాహిత్య బిట్స్‌ పిలానీలో చదివింది. ‘టీచర్‌ ఫర్‌ ఇండియా’లో రెండేళ్లు పని చేసింది. ప్రస్తుతం ఇంక్విలాబ్‌ అనే స్వచ్ఛంధ సంస్థ నడుపుతోంది. ఇంట్లో ఉంటే ముగ్గురూ బోర్డు గేమ్స్‌తో పాటు టేబుల్‌ టెన్నిస్‌ ఆడతారు. ముఖ్యంగా మూడు కుక్కపిల్లలతో ఆడుకుంటే సమయమే తెలీదంటారు.

- రాళ్లపల్లి రాజావలి

ఫొటోలు- లవ కుమార్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement