Abn logo
Sep 24 2020 @ 01:04AM

‘మృత సంజీవని’ పైనా అక్కసు?

Kaakateeya

విద్య, జ్ఞానం, దర్శన శాస్త్రాల్లో భారత దేశం ప్రపంచంలో ప్రాచీన గౌరవం పొందింది ఏ భాష వల్లనో వీళ్లకు తెలియకపోతే మనం ఏమీ చేయలేం. సంస్కృతం ఈ దేశంలో అన్ని భాషలకూ 70 శాతం పైగా పదాలను అందించింది. తాను బతికి అన్ని భాషల్నీ బతికించింది. మన దేశంలో 25 అధికార భాషలు, మనం మాట్లాడేందుకు ఉపయోగించే 3280 భాషల్లో సంస్కృతం ప్రభావం ఏదోరకంగా అన్నింటిపైనా ఉంది. ఒక్క హిందీ భాషలోనే 7 లక్షల పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి? అయినా కేవలం 2900 మూల పదాలున్న ఆంగ్లం మనకు గొప్ప భాష అయిందా, ప్రపంచ ‘తత్వదర్శనాన్ని’ మెట్లుగా నిలబెడితే తలపైన తళుక్కుమనే సంస్కృతం మృతభాష అయిందా? ఇంతకన్నా భావదారిద్య్రం ఇంకేముంటుంది!


అప్పాల శ్రీనివాస్‌ ఈ నెల 4వ తేదీన రాసిన వ్యాసంలోనూ, వాగమూడి లక్షీరాఘవరావు 10వ తేదీన రాసిన వ్యాసంలోనూ ‘సంస్కృత’ భాషపై అక్కసంతా వెళ్లగక్కారు. ఏ దేశ పౌరులైనా తమ జాతిలో ప్రాచీనమైన ప్రతి విషయానికి ప్రాధాన్యం ఇచ్చి గర్వించి మురిసిపోతుంటారు. కానీ ఈ దేశంలోని కొందరు తమ దేశ ‘ప్రాచీనత’ను ఎంత బాగా తిట్టాలో తిట్టి మనశ్శాంతి పొందుతుంటారు. సామాన్యులకు సంస్కృతంతో సంబంధం లేదన్న ఈ వ్యక్తులు ఒక్కసారి తమ పేర్లలోని ‘పద నిర్మాణం’ 


ఏ భాషదో చెప్పాలి. ఈ దేశంలో ఊర్ల పేర్లు, వ్యక్తుల పేర్లతో సహా సంస్కృత శబ్దాలు కలిగి ఉండటం గమనిస్తాం. అంతెందుకు! తెలంగాణలో ‘సక్లంముక్లం’ అనే పదం ‘సకలమ్ ముకులమ్’ నుండి వచ్చింది కాదా? ఏదో ఒకటి రాయాలని, మోదీ ప్రభుత్వాన్ని తిట్టాలనే (అసలు ఈ జాతీయ ప్రభుత్వం వచ్చాక కూడా సంస్కృతానికి ఒరిగిందేమీ లేదు) అక్కసుతో చేస్తున్న ఆరోపణలే తప్ప సంస్కృతం గురించి వీళ్లకు తలాతోకా తెలియదన్నది స్పష్టం. 


జర్మనీ వాళ్లు వాళ్ల విమానాలకు ‘లుఫ్తాన్సా’ అని, ఇండోనేషియా వాళ్లు ‘గరుడ’ అని పేర్లు పెట్టుకొంటే మనం ‘కింగ్‌ఫిషర్‌’ అని పెట్టుకొన్నాం. మన స్వాభిమానం అక్కడే కనబడుతోంది! సంస్కృతంలో 102 మిలియన్‌ల 78 కోట్ల 50 లక్షల శబ్దాలున్నాయని మనకు తెలియదు. పాణిని పుట్టిన నేలను జైషే మహ్మద్‌ తీవ్రవాదులకు అప్పజెప్పిన ఘనత మనది. జర్మనీలో మొదటి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, లండన్‌లోని సెయింట్‌ జేమ్స్ జూనియర్‌ స్కూల్‌ ఆక్స్‌ఫర్డ్‌లో సంస్కృతం నేర్పిస్తుంటే, మన విశ్వవిద్యాలయాల్లో సంస్కృత బోధనే తొలగించిన ఘనులం మనం. Scientific, Ancient Spiritual Language అని సంస్కృతం గురించి నాసా ప్రకటిస్తే, మన అర్బన్‌ నక్సలైట్లకు ఈ భాష ఇష్టం లేదు కాబట్టి మనం దీనిని మృతభాషగా డిక్లేర్‌ చేస్తాం!


మొదటి లిపి దేవనాగరి, మొదటి భాష బ్రాహ్మీ. ఈ రెండూ ప్రపంచానికి మొదట మనమే ఇచ్చాం అని ఇండాలజిస్టులు చెప్తుంటే ఇప్పుడు ‘మృత భాష’ అనటం రాక్షసానందం కాదా! సంస్కృత వ్యాకరణం లక్షల సంవత్సరాల నుండి ఈ రోజు వరకు చిన్న మార్పు కూడా లేకుండా ఉండటం మనం గర్వించాల్సిన విషయం కాదా! శబ్ద బాంఢాగారం ఏ భాషలో ఉందో ఈ అపర మేధావులు చెప్పగలరా! విద్య, జ్ఞానం, దర్శన శాస్త్రాల్లో భారత దేశం ప్రపంచంలో ప్రాచీన గౌరవం పొందింది ఏ భాష వల్లనో వీళ్లకు తెలియకపోతే మనం ఏమీ చేయలేం. సంస్కృతం ఎలా పతనం అయిందో భారత్‌ రాజకీయంగా అంతే వేగంగా పతనం అయ్యింది. సంస్కృతం ఈ దేశంలో అన్ని భాషలకూ 70 శాతం పైగా పదాలను అందించింది. తాను బతికి అన్ని భాషల్నీ బతికించింది. మన దేశంలో 25 అధికార భాషలు, మనం మాట్లాడేందుకు ఉపయోగించే 3280 భాషల్లో సంస్కృతం ప్రభావం ఏదోరకంగా అన్నింటిపైనా ఉంది. ఒక్క హిందీ భాషలోనే 7 లక్షల పదాలు సంస్కృతం నుంచి వచ్చాయి? అయినా కేవలం 2900 మూల పదాలున్న ఆంగ్లం మనకు గొప్ప భాష అయిందా, ప్రపంచ ‘తత్వదర్శనాన్ని’ మెట్లుగా నిలబెడితే తలపైన తళుక్కుమనే సంస్కృతం మృతభాష అయిందా? ఇంతకన్నా భావదారిద్య్రం ఇంకేముంటుంది!


పురాతన ప్రపంచ మత చరిత్రలను, అందులోని తాత్విక జ్ఞానాన్ని సంస్కృతం తెలియకుండా తరచి చూడగలమా? మన పురాతన నాగరికత, సారస్వతం గురించి అధ్యయనం జరగకుండా జాతి చరిత్రను అంచనా వేయగలమా! సంస్కృతానికి ఎంత గొప్పతనం ఉందో సంస్కృతంతోనూ, చైనా దురాక్రమణ మనస్తత్వాన్ని బయటపెట్టే విషయంతోనూ ముడిపడిన ఓ విషయం చెపితేనన్నా ఈ చైనా చెంచాలకు జ్ఞానోదయం కలుగుతుందని ఆశిస్తున్నాను. గతంలో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డప్పుడు, చైనా మన భూభాగం కబ్జా చేయాలనుకొన్నప్పుడు, చైనా టిబెట్‌పై దురాక్రమణ చేసి దమనకాండ సాగిస్తున్నప్పుడు, డా. రామ్ మనోహర్‌ లోహియా ఒక అద్భుతమైన వ్యాసం రాశాడు. 1961లో ‘హిమాలయాస్‌, ది ఎంప్టీ సింబల్‌ అండ్‌ సెవెన్‌ రెవల్యూషన్స్‌’ అనే వ్యాసంలో డా. లోహియా కాళిదాస మహాకవి రచించిన ‘కుమార సంభవం’లోని శ్లోకాన్ని ఉటంకించాడు:

అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా 

హిమాలయోనామ నగాధిరాజః

పూర్వాపరౌ తోయనిధి వగాహ్యస్థితః

పృథివ్యా ఇవమానదండః

హిమాలయాలు పర్వతాల్లో రాజాధిరాజు అని, దేశానికి ఆత్మ అనీ, తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య ప్రపంచాన్ని కొలుస్తున్నట్లు ఈ హిమాలయాలు ఠీవిగా నిలబడ్డాయనీ దీని భావం. కుమార సంభవంలోని ఈ మొదటి శ్లోకం హిమాలయాలకు సంబంధించిన కాళిదాసు లోకోత్తర వర్ణన. ‘నేను చైనా వాళ్లని సవాల్‌ చేస్తున్నా. వాళ్ల చీనీ భాషలో హిమాలయాల మీద ఈ శ్లోక సౌందర్యంలో కనీసం సగభాగమైనా ధీటుగా ఉండే పంక్తుల్ని చూపిస్తే నేను మాకు హిమాలయాల పైన హక్కు ఉందనే వాదన వదులుకొంటాను’ అని లోహియా ఆ వ్యాసంలో సవాల్‌ చేశాడు. ఇదీ సంస్కృతం గొప్పదనం. ‘దేశ భౌగోళిక సరిహద్దులను సైతం నిర్ణయిస్తాం’ అని ఓ సోషలిస్టు నాయకుడు సవాల్‌ చేయగలిగే శక్తిని ఇస్తుంది. మోదీని వ్యతిరేకించే కుత్సిత యత్నంలో ఈ దేశ ప్రాచీనతను అవహేళన చేయడం అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది దేశ దురదృష్టం.

డా. పి.భాస్కర యోగి

Advertisement
Advertisement
Advertisement