అక్కమార్కులే టార్గెట్‌!

ABN , First Publish Date - 2021-07-23T05:20:11+05:30 IST

రెవెన్యూ కార్యాలయాల్లో అక్రమార్కులే టార్గెట్‌గా ఏసీబీ సోదాలు చేస్తోందా? సేవల్లో జాప్యం... లోపాలు... అవినీతి... అక్రమాల అంతు తేల్చే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉన్నారా? కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారా? ఓవైపు సోదాలు చేయడం..మరోవైపు తహసీల్దారు కార్యాలయాలకు వచ్చి..ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం చూస్తుంటే... పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.

అక్కమార్కులే టార్గెట్‌!
భోగాపురం: వినతులను స్వీకరిస్తున్న ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌విష్ణు

తహసీల్దార్‌ కార్యాలయాల్లో మూడో రోజూ విచారణ

లోతుగా వివరాలు సేకరిస్తున్న ఏసీబీ

పౌరుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ


రెవెన్యూ కార్యాలయాల్లో అక్రమార్కులే టార్గెట్‌గా ఏసీబీ సోదాలు చేస్తోందా? సేవల్లో జాప్యం... లోపాలు... అవినీతి... అక్రమాల అంతు తేల్చే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉన్నారా? కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారా? ఓవైపు సోదాలు చేయడం..మరోవైపు తహసీల్దారు కార్యాలయాలకు వచ్చి..ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం చూస్తుంటే... పై ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. మూడు రోజులుగా జిల్లాలోని ఆరు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థ పనితీరు ఎంత దారుణంగా ఉందో ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

అవినీతి.. అక్రమాలకు రెవెన్యూ కార్యాలయాలు కేంద్ర బిందువన్న ఆరోపణలు ఏళ్లుగా వినిపిప్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రెవెన్యూ శాఖే అవినీతిలో అగ్రభాగంగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. విమర్శలకు తగినట్టుగానే కొన్ని మండలాల రెవెన్యూ కార్యాలయాలు అక్రమ ఆదాయానికి పెట్టింది పేరుగా తయారయ్యాయి. ఆ కార్యాలయాల్లో పనిచేసేందుకు తహసీల్దార్లు, సిబ్బంది పోటీ పడుతుంటారు. మంత్రుల సిఫారసులతో తహసీల్దార్‌ కుర్చీని కైవసం చేసుకుంటుంటారు. ఇటువంటి మండలాల్లో కొన్ని చోట్ల తాజాగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూకుమ్మడి దాడులు చేసి లోతుగా ఆరా తీస్తున్నారు. మూడు రోజులుగా కూపీ లాగుతున్నారు. తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఏ చిన్న ఆధారం లభ్యమైనా లోతుగా ప్రశ్నిస్తున్నారు. కార్యాలయాల వద్దకు వచ్చే సాధారణ ప్రజలు, రైతులతోనూ మాట్లాడుతూ మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు అందజేస్తే తీసుకుంటున్నారు. 

ఏసీబీ తనిఖీలతో కొంతమంది ఉద్యోగులు కార్యాలయాల మొహం చూసేందుకు భయపడుతున్నారు. కబురు పెట్టినప్పటికీ అందుబాటులో లేరన్న కారణం చూపి వెళ్లడం లేదు. ఇటువంటి అధికారులకు చెందిన సెల్ఫ్‌లు, బీరువాలను కూడా తెరిచి ఫైళ్లు, రికార్డులను పరిశీలిస్తున్నారు. సీఎం డ్యాష్‌బోర్డుకు వెళుతున్న ఫిర్యాదుల పరిష్కారంపైనా దృష్టి పెట్టారు. అలాగే ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకుంటున్నారు. బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న కారణంగా అనేక మంది ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. మూడు రోజుల తనిఖీల్లో ఏసీబీ అధికారుల దృష్టికి అనేక విషయాలు వెళ్లాయి. 

భోగాపురం మండలం రెడ్డికంచేరు గ్రామానికి చెందిన బాధితుడు ఏసీబీ డీఎస్పీని కలిశారు.  తన తండ్రి మరణ ధృవ పత్రం కోసం నెలల తరబడి తిరుగుతున్నా మంజూరు చేయటం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీబీ అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. 

 పూసపాటిరేగ మండలం భరిణికాం గ్రామంలో వైసీపీ నాయకులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

 పూసపాటిరేగ మండలంలో 2,759 ఫిర్యాదులు రాగా 45 మాత్రమే పరిష్కరించినట్లు గుర్తించారు. 

భోగాపురం మండలంలో 5,643 మంది పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 3,812 దరఖాస్తులను తిరస్కరించారు. అందుకు గల కారణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.

భోగాపురం కార్యాలయంలో వీఆర్‌ఓల సెల్ఫ్‌ల్లో దాచి ఉంచిన పట్టాదార్‌ పాసు పుస్తకాలకు చెదలు పట్టాయి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను కట్టలుగా కట్టి ఏళ్ల తరబడి పరిష్కరించకుండా ఉంచినట్లు గుర్తించారు. 

పూసపాటిరేగ మండలంలో 49 మంది ఇళ్ల పట్టాలు వారికి అందించకుండా బీరువాల్లోనే దాచి ఉంచినట్లు గుర్తించారు. ఆ గ్రామస్థులు తిరస్కరించిన కారణంగా బీరువాల్లో దాచి ఉంచినట్లు రెవెన్యూ సిబ్బంది వివరణ ఇచ్చారు. ఇదే మాదిరిగా భోగాపురం మండలంలో కూడా 8 జగనన్న ఇళ్ల స్థలాల పట్టాలను గుర్తించారు. 

ఏసీబీ తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి స్థాయి వివరాలు అందించేందుకు వారు నిరాకరిస్తున్నారు. గుర్తించిన అవకతవకలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌ పైనా ఆరా తీస్తున్నారు.  మాన్యువల్‌ రికార్డులను వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలతో సరిపోల్చుతున్నారు. ఏదేమైనా ఏసీబీ తనిఖీలతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల ఉద్యోగులకు దడ పట్టుకుంది. ముందుముందు తమ కార్యాలయాలకు కూడా వస్తారేమోనని టెన్షన్‌ పడుతున్నారు. 



Updated Date - 2021-07-23T05:20:11+05:30 IST