అక్క చెల్లెమ్మల ఖాతాలు ఖాళీ!

ABN , First Publish Date - 2021-12-03T07:53:23+05:30 IST

అక్క చెల్లెమ్మల ఖాతాలు ఖాళీ!

అక్క చెల్లెమ్మల ఖాతాలు ఖాళీ!

‘గృహ హక్కు’కు పొదుపు సొమ్ము

నేరుగా రంగంలోకి అధికారులు..

పేద లబ్ధిదారులపైకి రకరకాల ఉచ్చులు

డ్వాక్రా గ్రూపుల పొదుపులోంచి రుణాలు

ఒత్తిడితెచ్చి లీడర్లతో బ్యాంకుకు తీర్మానాలు

అలా తెచ్చిన అప్పు సొమ్ము ఓటీఎ్‌సకు జమ

అనంతలో ఒక్కో బ్రాంచ్‌ నుంచి 20 లక్షలు

సంఘాల్లో సభ్యత్వం లేకుంటే మరో మార్గం

నేరుగా వడ్డీ వ్యాపారులతోనే రుణం

పథకాల్లో మినహాయించుకునేలా ఏర్పాటు

గుంటూరులో మళ్లీ ‘కాల్‌మనీ’ దందా 

రేపు రాష్ట్రవ్యాప్తంగా ఓటీఎస్‌ మేళా


‘పాత ఇళ్లకు కొత్తగా తెచ్చిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్వచ్ఛందమే! ఇందులో బలవంతమేమీ లేదు!’... ఇది సర్కారు పెద్దల ఉవాచ! కానీ... ఓటీఎ్‌సకు ‘ఎస్‌’ అనకపోతే మాత్రం సిబ్బంది ఊరుకోరు. పేదల వెంటపడతారు. ‘మీ దగ్గర డబ్బుల్లేవా! అయితే... డ్వాక్రా సంఘం నుంచి రుణం ఇప్పిస్తాం!’ అంటారు. ‘మీకు డ్వాక్రా సంఘాల్లో సభ్యత్వంలేదా! అయినా ఫర్వాలేదు! ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో అప్పు ఇప్పిస్తాం!’ అంటూ అధికారులు ఎక్కడికక్కడ ‘అరేంజ్‌మెంట్స్‌’ చేస్తున్నారు! ఒకవైపు అక్కచెల్లెమ్మల పొదుపు ఖాతాలు ఖాళీ చేస్తూనే... మరోవైపు ‘కాల్‌మనీ’ దందాకు తెరలేపుతున్నారు. అది కూడా... అధికారికంగా!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సొమ్ములు కట్టాల్సిందే! మీ దగ్గర లేవా? అయితే... మేమే ఇప్పిస్తాం! డ్వాక్రా సంఘంలో సభ్యులైతే... పొదుపు ఖాతాలను ఖాళీ చేయించి మరీ ఇస్తాం! కాకపోతే... వడ్డీ వ్యాపారులతో అప్పు ఇప్పిస్తాం! ఏది ఏమైనా సరే... పాత ఇళ్లకు సంబంధించిన ఓటీఎ్‌సకు ‘ఎస్‌’ అనాల్సిందే! ఇదీ క్షేత్రస్థాయిలో అధికారుల తీరు. దీనికోసం... రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక బృంద సభ్యులు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును ప్రభుత్వం ఖాళీ చేసేస్తోంది. దశాబ్దాల క్రితం పొందిన ఇళ్లకు ఇప్పుడు బకాయి చెల్లించాలంటూ తెచ్చిన ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ (ఓటీఎస్‌) పథకం పేద లబ్ధిదారులను అయోమయంలోకి నెట్టేసింది. రూ.10 వేలు ఒకే విడతలో కడితే ఆ ఇంటిపై సంపూర్ణ హక్కు పొందినట్టేనంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమూ, అధికారుల స్థాయిలో తెస్తున్న ఒత్తిడీ వారిని ఊపిరి తిప్పుకోనీయడం లేదు. వీరినుంచి ఓటీఎస్‌ కట్టించేవరకు ఇటు వలంటీర్లను అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ‘ఎక్కడినుంచి తెచ్చి సొమ్ములు కట్టాలి’ అంటూ అటు ఎక్కడికక్కడ లబ్ధిదారులు నిలదీస్తున్న పరిస్థితి! దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ పథకాన్ని సక్సెస్‌ చేసేందుకు అధికారులు, సిబ్బంది రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. పేద లబ్ధిదారులపైకి రకరకాల ఉచ్చులు పన్నుతున్నారు. లబ్ధిదారు డ్వాక్రా  సభ్యురాలైతే.. ఆ గ్రూపు బ్యాంకులో దాచుకున్న పొదుపులోంచి తీసి ఇచ్చేలా లీడర్లపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ గ్రూపులో లేకపోతే... స్థానిక వడ్డీవ్యాపారికి చెప్పి అధిక వడ్డీలకు అప్పులు ఇప్పించి.. వాటిని ఓటీఎ్‌సకు జమ చేసుకుంటున్నారు. 


ఖాతాలు ఖాళీ..

గురువారం ఒక్కరోజే అనంతపురం జిల్లాలోని ప్రతీ బ్యాంకుబ్రాంచ్‌లో రూ.20 లక్షలు చొప్పున పొదుపు నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. పొదుపు సంఘాల లీడర్లను వెంటపెట్టుకుని స్వయంగానే అధికారులు బ్యాంకులకు వెళ్లారు. సదరు లభ్ధిదారుకు పొదుపు సొమ్ముల్లోంచి రుణం ఇవ్వాలంటూ  గ్రూపు లీటర్లతో తీర్మానాలు చేయించి బ్యాంకు మేనేజర్లకు అందిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా తమ కనుసన్నల్లోనే అధికారులు పూర్తి చేస్తున్నారు. లబ్ధిదారుల కుటుంబాల్లో ఎవరైనా పొదుపు సంఘాల్లో ఉంటే... వారు దాచుకున్న సొమ్ము నుంచి డ్రా చేసి ఓటీఎ్‌సకు చెల్లించాలని నిర్ణయించారు. సెర్ప్‌ అధికారుల సహకారంతో ఆయా గ్రామాల్లో ఉన్న లబ్ధిదారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అయితే, ఇంత పెద్దఎత్తున ఒక్కసారిగా బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేస్తే...భవిష్యత్తులో పొదుపు సభ్యుల అత్యవసరాలకు ఏం చేస్తారన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానంలేదు. గ్రూపు లీడర్లపై సెర్ప్‌ సిబ్బంది, యానిమేటర్లు ఒత్తిడి తెచ్చి ఈ తీర్మానాలు చేయించినట్టు సమాచారం. రకరకాల మార్గాల ద్వారా లబ్ధిదారులకు రుణాలిప్పించి ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలన్న తహతహతో అధికారులు పనిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.


సంతకాలూ ఫోర్జరీ..

కొంత మంది గ్రూపు సభ్యుల సంతకాలు తీర్మానంలో ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకర్లు ఉన్నపళంగా ప్రతి సభ్యురాలి సంతకం పరిశీలించడం అసాధ్యం. దీంతో గ్రూపు తరపున కోరిన మొత్తాన్ని డ్రా చేసి ఆయా సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో సమానంగా జమచేస్తున్న సమాచారం. కొన్ని దశాబ్దాల తరబడి స్వయం సహాయక బృంద సభ్యులు దాచుకున్న సొమ్ములవి. ప్రభుత్వం ఇప్పుడు అప్పనంగా వసూలు చేస్తుండటంతో ఇక డ్వాక్రా సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని కొందరు గ్రూపు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు బ్యాంకులు ఈ పొదుపు సొమ్ము ఆధారంగా రుణాలిస్తున్నాయి. డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ పొదుపు డబ్బుల వల్లనే గ్రామాల్లో అత్యంత పరపతి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. కరోనా కల్లోలం సంభవించినా, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పొదుపు గ్రూపు సభ్యుల పరపతికి ఢోకా లేకుండా ఉండేది.  ఆ డబ్బులే ఖాళీ అయితే ఇక డ్వాక్రా సంఘాలు రాష్ట్రంలో ఉంటాయా అని పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, అనారోగ్యం, విద్యావసరాలు తదితర అత్యవసరాలకు వినియోగించుకోవాల్సిన ఈ మొత్తాన్ని ప్రభుత్వఖజానాకు అప్పగించాల్సిన పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కాల్‌మనీ నాగులు

ఓటీఎస్‌ కింద కట్టాల్సిన డబ్బులను లబ్ధిదారులకు గుంటూరు జిల్లాలోని పలు బస్తీల్లో వడ్డీ వ్యాపారుల నుంచి కొంత మంది వలంటీర్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు చేరుకునేందుకు వలంటీర్ల అన్నీ మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో తిరిగి కాల్‌మనీ నాగులను బుట్టలోంచి బయటకు వదులుతున్నారు. ‘‘ఫలానా పథకంలో ఆయా ఇళ్ల లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారు. ఆ పథకం డబ్బులు రాగానే వడ్డీతో పాటు మీకు ఇప్పిస్తాం. రుణం ఇవ్వండి’ అంటూ వడ్డీవ్యాపారులను వలంటీర్లు ఒప్పిస్తున్నారు. పలువురికి నెలకు రూ.3, రూ.5 వడ్డీతో రుణమిప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


రేపు మేళా...

ఓటీఎస్‌ అమలుకు అధికారులు అన్ని అస్త్రాలు వాడుతున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లు పెట్టి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. కనీస టార్గెట్లు చేయని వారికి నోటీసులిస్తున్నారు. కొంత మందిని సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారు. సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ కూడా దక్కదని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 4నఓటీఎస్‌ కోసం మేళా పెట్టాలని నిర్ణయించారు. ఆ మేళాకు ముందే లబ్ధిదారుల ఫొటోలు తీసుకుని వారిని రిజిస్ట్రేషన్‌కు సన్నద్ధం చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆ రోజు అమావాస్య అయినందున చాలా మంది డబ్బులు చెల్లించరని, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుండటం గమనార్హం. 

Updated Date - 2021-12-03T07:53:23+05:30 IST