యోగి కంచుకోట నుంచి అఖిలేష్ యాత్ర

ABN , First Publish Date - 2021-11-14T16:53:00+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ..

యోగి కంచుకోట నుంచి అఖిలేష్ యాత్ర

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచార యాత్ర చేపట్టారు. ద్రవ్యోల్బణం ప్రధానాంశంగా ఆయన బీజేపీ పాలనను తన యాత్రలో తూర్పారబడుతున్నారు. అడుగడునా ఆయన యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో అఖిలేష్ తన యాత్ర సాగిస్తూ, బీజేపీ పాలనలో ధరల పెరుగదలను ఎండగడుతున్నారు.


''హవాయి చెప్పులు వేసుకునే వాళ్లు సైతం విమానాల్లో తిరిగేలా చేస్తామంటూ బీజేపీ వాగ్దానం చేసింది. కానీ, ఇప్పుడు పెట్రోల్ , డీజిల్ ధరలు భరించలేనంతగా పెంచేసి కనీసం మోటార్ సైకిళ్లపై కూడా ప్రజలు వెళ్లలేని పరిస్థితి తీసుకువచ్చింది'' అని అఖిలేష్ యాదవ్ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ''నా పేద సోదరులారా? మీకేం దక్కింది? బీజేపీ మీకు చాలా పెద్దపెద్ద ఆశలే చూపించింది. కలల్లో తేలియాడేలా చేసింది. కులపోరాటాలు, వివక్షలు ప్రదర్శిస్తూ, అంబేద్కర్ ప్రసాదించిన హక్కులను కాలరాస్తోంది'' అంటూ కుషినగర్‌లో నిర్వహించిన యాత్రలో అఖిలేష్ జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు. యూపీలోని బీజేపీ సర్కార్ ఓవైపు ధరలు అమాంత పెంచేస్తూ, రేషన్ కార్డులు, సంక్షోమ పథకాల బూచి చూపిస్తోందని, హిందుత్వం కార్డు ప్రయోగిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలెండర్ల పథకం 'ఉజ్వల స్కీమ్' ప్రవేశపెట్టామని, ఇవాళ గ్యాస్ ధరలు చుక్కలనంటుతోందని, మహిళలు కనీసం వాటిని రీఫిల్ కూడా చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. ఎరువులు కొనుగోలు చేయడానికి రైతులు గంటల తరబడి క్యూలలో వేచిచూడాల్సి వస్తోందని చెప్పారు. బీజేపీ పేద ప్రజల జేబులు కొల్లగొట్టి పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాస్తోందని అఖిలేష్ తప్పుపట్టారు.


యోగి ఆదిత్యనాథ్ తనపైన, తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పైన వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఇందుకు కారణం, తాను (అఖిలేష్) అధికారంలో ఉన్నప్పుడు యువకులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ, ప్రజలకు అంబులెన్స్ సర్వీసులు, డయిల్ 100 ఎమర్జెన్సీ పోలీసు సేవలు అదుబాటులోకి తేవడమేనని అన్నారు. యోగి ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు ఇంతకుముందు ఏ ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని సర్కార్ వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రెట్టింపు చేయడం మాటెలా ఉన్నా రైతుల హక్కులను సాగు చట్టాల పేరుతో కాలరాసే ప్రయత్నం చేస్తోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అఖిలేష్ అన్నారు.

Updated Date - 2021-11-14T16:53:00+05:30 IST