అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికకానున్నారు. తాజా ఎన్నికల్లో ఎస్పీ 403 స్థానాలకుగాను, 111 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌ను తమ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎస్పీ ప్రకటించింది. ఈ అంశంపై చర్చించేందుకు తమ మిత్రపక్షాలతో అఖిలేష్ సమావేశమవుతారని చెప్పింది. ఇప్పటికే అఖిలేష్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా ఉంటూ, 2027 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో అఖిలేష్ ఉన్నారని ఎస్పీ వర్గాలు తెలిపాయి.