Vaccination సర్టిఫికేట్లపై జాతీయ జెండా : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-09-18T22:28:51+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి నుంచీ బీజేపీ ఎన్నికల

Vaccination సర్టిఫికేట్లపై జాతీయ జెండా : అఖిలేశ్ యాదవ్

లక్నో : కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి నుంచీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగమేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. గతంలో ఆయన ఈ వ్యాక్సిన్‌ను ‘బీజేపీ వ్యాక్సిన్’ అని ఆరోపించి, విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. శనివారం ఆయన ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తన విమర్శలను పునరుద్ఘాటించారు. 


ఇప్పటి వరకు వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మ ఉందన్నారు. ఇది బీజేపీ వ్యాక్సిన్ అన్నారు. ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామిక దేశపు వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లోనూ ఈ విధంగా ఓ నేత ఫొటో లేదన్నారు. అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇద్దరు దేశాధ్యక్షులు ఉన్నారన్నారు. డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ దేశాధ్యక్షులుగా ఉన్నారని వివరించారు. వారి ఫొటోలను వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ముద్రించలేదని చెప్పారు. బ్రిటన్‌లో వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై కూడా ఆ దేశ ప్రధాన మంత్రి ఫొటో లేదన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పై జాతీయ జెండాను ముద్రించాలని, మోదీ బొమ్మను కాదని అన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పై జాతీయ జెండాను ముద్రించిన రోజున వ్యాక్సినేషన్ కోసం క్యూలో నిల్చునే మొదటి వ్యక్తిని తానే అవుతానన్నారు. 


ఈ ఏడాది జనవరిలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సిన్‌ను బీజేపీ వ్యాక్సిన్‌గా అభివర్ణించారు. దానిని తాను తీసుకోబోనని చెప్పారు. దీంతో చాలా మంది ఆయనపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత జూన్‌లో మాట్లాడుతూ, తాను భారత ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్ వేయించుకుంటానని, బీజేపీ వ్యాక్సిన్ వేయించుకోబోనని అన్నారు. 


ఒక్క రోజులోనే 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసుల అందజేత గురించి ప్రస్తావిస్తూ, ఇది శుభవార్త అని చెప్పారు. ఇది రోజూ జరగాలన్నారు. దీనిని కూడా ఓ ఈవెంట్‌కు అనుసంధానం చేశారన్నారు. ప్రతిరోజూ ఇలా చేయండని కోరారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే, వ్యాక్సిన్ తయారీదారులకు సామర్థ్యం ఉంటే, ప్రతి రోజూ రోజుకు రెండు కోట్లకుపైగా డోసులను ప్రజలకు ఇవ్వాలన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 17న 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-09-18T22:28:51+05:30 IST