అనుపయోగి సీఎం యోగి : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-12-19T21:08:18+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ నిష్ప్రయోజకుడైన

అనుపయోగి సీఎం యోగి : అఖిలేశ్ యాదవ్

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ నిష్ప్రయోజకుడైన ముఖ్యమంత్రి అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ఆయనకు కనీసం కంప్యూటర్‌తో పని చేయడమైనా రాదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మాట్లాడుతూ, యోగి ఆదిత్యనాథ్ ఉపయోగి (ప్రయోజకుడైన) ముఖ్యమంత్రి అని అభివర్ణించిన సంగతి తెలిసిందే. 


యోగి ఆదిత్యనాథ్‌ను "UP+Yogi = Upyogi" అని మోదీ అభివర్ణించగా, "Un+UP+Yogi = Unupyogi" అని అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముగ్గురు నేతలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన నేపథ్యంలో అఖిలేశ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, యోగిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలను అణగదొక్కడానికి బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటోందని ఆరోపించారు. ఓడిపోతామని భయపడినపుడే రాష్ట్రానికి వచ్చే బీజేపీ అగ్ర నేతల సంఖ్య పెరుగుతుందనడంలో సందేహం లేదన్నారు. తమపై దాడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ తదితర సంస్థలను వాడుకుంటారన్నారు. 


సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్, అఖిలేశ్ యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి జైనేంద్ర యాదవ్, ఆ పార్టీ నేత మనోజ్ యాదవ్ నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ శనివారం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-12-19T21:08:18+05:30 IST