400 స్థానాలతో మాదే అధికారం : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-09-15T19:45:04+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని

400 స్థానాలతో మాదే అధికారం : అఖిలేశ్ యాదవ్

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోయాయని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఓ న్యూస్ చానల్ లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమకు 400 స్థానాల్లో విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 


ప్రతి ఎన్నికల్లోనూ పోరాడే విధానం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కొత్త డిమాండ్లు ఉంటాయన్నారు. గతంలో బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారని, బీజేపీకి ఆకర్షణ ఉండేదని, ఇప్పుడు అటువంటి ఆకర్షణ కనిపించడం లేదని చెప్పారు. బీజేపీ తన సంకల్ప పత్రాన్ని చెత్త బుట్టలో పడేసిందన్నారు. 


చేసిన పనులే చెబుతాయన్నారు. ప్రజలు ఈసారి సమాజంలోని అన్ని వర్గాలను గౌరవించేవారికే ఓట్లు వేస్తారన్నారు. రైతులను గౌరవించేవారికి, ఉద్యోగాలు ఇచ్చేవారికి ఓటు వేస్తారని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి, దాని మిత్ర పక్షాలకు ప్రజలు ఈసారి 400 స్థానాలను ఇస్తారన్నారు. 


2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోబోదని చెప్పారు. చిన్న, ప్రాంతీయ పార్టీలతో మాత్రమే పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందన్నారు. పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదని తన అనుభవం ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కేవలం చిన్న పార్టీలను ఓ వేదికపైకి తేవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీకి మహిళలు, యువత మద్దతిచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా సహాయపడతారని చెప్పారు. 


Updated Date - 2021-09-15T19:45:04+05:30 IST