కొత్త నినాదంతో సిద్ధమైన Akhilesh Yadav

ABN , First Publish Date - 2021-07-18T18:39:43+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి

కొత్త నినాదంతో సిద్ధమైన Akhilesh Yadav

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సరికొత్త నినాదంతో సిద్ధమైంది. అంతకుముందు వినిపించిన నినాదంపై బీజేపీ పదునైన వ్యంగ్యాస్త్రాలను సంధించడంతో దానికి బదులుగా వేరొక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్‌పీ కొత్త నినాదం ‘‘కామ్ బోలేగా’’ (చేతలే చెబుతాయి). 


ఎస్‌పీ అంతకుముందు ప్రజల ముందు ఉంచిన నినాదం ‘ఖేలా హోబే’ (ఆట ఆడుకుందాం). పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ నినాదంతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఆశలపై నీళ్ళు జల్లడంలో ఈ నినాదం ప్రభావం చాలా ఉందని టీఎంసీ చెప్తోంది. ఈ నినాదంతో చాలా హోర్డింగులను అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్‌పీ ఏర్పాటు చేసింది. ‘‘2022లో ఆట జరుగుతుంది’’ అంటూ కాన్పూరు, వారణాసిలలో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. బీజేపీ ప్రతిస్పందిస్తూ పశ్చిమ బెంగాల్‌ నుంచి అరువు తెచ్చుకున్న నినాదంపై ఎస్‌పీ ఆధారపడిందని ఎగతాళి చేసింది. ‘‘2022లో ఆట జరగదు’’, ‘‘గూండా, మాఫియా, భూ మాఫియా, అవినీతిపరులు దేశ ద్రోహులు, వారి ఆట ముగిసిపోతుంది’’ అంటూ పోస్టర్లను ఏర్పాటు చేసింది. దీంతో ఎస్‌పీ ‘‘కామ్ బోలేగా’’ అనే నినాదాన్ని రూపొందించింది. 


ఇదిలావుండగా, అఖిలేశ్ యాదవ్ ఇటీవల మాట్లాడుతూ, రానున్న శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి 350 స్థానాలు లభిస్తాయని జోస్యం చెప్పారు. తాను అధికారం చేపట్టిన వెంటనే ఈవీఎంలను నిషేధిస్తానని, ప్రజలు బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌ను మాత్రమే విశ్వసిస్తున్నారని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2021-07-18T18:39:43+05:30 IST