ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈవీఎంలు... అఖిలేష్‌కు మమత సలహా

ABN , First Publish Date - 2022-03-11T22:48:56+05:30 IST

యూపీ ఎన్నికల్లో ఈవీఎంల లూటీ, అవకతవకలు జరిగాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి...

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈవీఎంలు... అఖిలేష్‌కు మమత సలహా

కోల్‌కతా: యూపీ ఎన్నికల్లో ఈవీఎంల లూటీ, అవకతవకలు జరిగాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈవీఎంల చోరీ చోటుచేసుకుందంటూ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలను ఆమె బలపరిచారు. అఖిలేష్ ఎంత మాత్రం అధైర్యపడకుండా, ఈవీఎం మిషన్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాలని కోరాలని ఆమె సలహా ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌ను పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో  ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడారు.


కాంగ్రెస్ కోసం వేచిచూడాల్సి పనిలేదు..

బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. చేష్టలుడిగి కూర్చోవడం, కాంగ్రెస్ కోసం వేచిచూడటం వల్ల ఎంతమాత్రం ప్రయోజనం ఉండదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ''ఏం చేయాలనుకుంటున్నారో వాళ్లనే (కాంగ్రెస్) తేల్చుకోనీయండి. బీజేపీని ఓడించడానికి అన్ని విపక్షాలు ఏకతాటిపైకి రావాలని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు'' అని అన్నారు.


బీజేపీ పగటి కలలు కంటోంది...

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని బీజేపీ నేతలు పలువురు వ్యాఖ్యానించడాన్ని మమతా బెనర్జీ కొట్టివేశారు. ''బీజేపీ కలలు కనడం మానుకోవాలి'' అని అన్నారు. కొన్ని సీట్లు గెలుచుకొని గొంతు పెంచి మాట్లాడుతున్నారని, ఈ విజయం (నాలుగు రాష్ట్రాల్లో) నిజమైన ప్రజాతీర్పును ప్రతిబింబించ లేదని అన్నారు. ఓట్లను లూటీ చేసేందుకు ఎలక్షన్ మిషనరీని దుర్వినియోగం చేయడం వల్ల సాధించుకున్న విజయమే ఇదని మమత వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-11T22:48:56+05:30 IST