ఎన్నికల ఫలితాల ముందు అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-09T01:29:13+05:30 IST

మంగళవారం లఖ్‌నవూలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ గెలుస్తుందనే ప్రేరణ కనిపిస్తోంది. అభ్యర్థులకు తెలియకుండా ఈవీఎంలను తరలిస్తున్నారు..

ఎన్నికల ఫలితాల ముందు అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రెండు రోజుల సమయం కూడా లేదు. అంతలోనే ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఎన్నికల సంఘం అధికారులు కొందరు ఈవీఎం ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు అఖిలేష్ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అఖిలేష్ ఈ ఆరోపణలు చేయడం మరింత ఆసక్తి రేపుతున్నాయి. వాస్తవానికి ఈసారి కూడా అధికారంలోకి రాదని ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు వెల్లడించాయి.


మంగళవారం లఖ్‌నవూలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ ‘‘ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ గెలుస్తుందనే ప్రేరణ కనిపిస్తోంది. అభ్యర్థులకు తెలియకుండా ఈవీఎంలను తరలిస్తున్నారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి జిల్లా కలెక్టర్.. ఈవీఎంలను తరలించారు. మన ఓట్లు మనం కాపాడుకోలేకపోతున్నాం. దీనిపైన ఈసీ దృష్టిపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేను ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నాను’’ అని అన్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరికీ సమాచారం లేకుండా ఈవీఎంలను తరలించడం ఏంటి? ఇది దొంగతనం కిందే లెక్క. మా ఓట్లను కాపాడాలి. ఈ విషయమై మేము కోర్టుకు ఎక్కడానికి సిద్ధమే. అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ గెలవబోతోంది. అందుకే అక్కడి ఈవీఎంలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో కొందరు ఎన్నికల అధికారులు కూడా ఉన్నారు’’ అన్నారు. ఒకటి రెండు సర్వేలు మినహా దాదాపుగా అన్ని సర్వేలు బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేల్చి చెప్పాయి.

Updated Date - 2022-03-09T01:29:13+05:30 IST