రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా.. ?

ABN , First Publish Date - 2021-01-27T06:15:10+05:30 IST

రైతుల కోసం పోరాడుతున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు.

రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా.. ?
మాట్లాడుతున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

  1. గ్రామ పంచాయతీ పోరుకు సిద్ధం కావాలి 


చాగలమర్రి, జనవరి 26: రైతుల కోసం పోరాడుతున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. చాగలమర్రి గ్రామంలోని  మాజీ సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు మహబూబ్‌బాషా ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని మంగళవారం ఆమె సందర్శించి పరామర్శించారు. అలాగే టీడీపీ నాయకుడు షఫి భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పెద్దవంగలి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ నాయకుడు నరసింహులు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.  అధికార పార్టీ స్థానిక నాయకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారని విమర్శించారు. ఇసుక, పింఛన్‌ కావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి కాని, రాజకీయాలను అడ్డంపెట్టుకొని ప్రజలకు ఇబ్బందిపెట్టకూడదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు టీడీపీని గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను భయపెడితే భయపడరని, మరింత బలంగా తయారవుతారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలకు భూమా కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. టీడీపీకి బలమైన క్యాడర్‌ ఉందని, అన్ని పంచాయతీల్లో గట్టి పోటీ ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. నాయకులు ఐక్యతతో గ్రామాల్లో సత్తా చాటాలని అన్నారు. ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుదరలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కోర్టు తగిన గుణపాఠం చెప్పిందని అన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. నిత్యావసర ధరలు మొదలుకొని ఇసుక, సిమెంట్‌ ధరలు ఆకాశనంటుతున్నాయని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని అన్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీలు రఘునాథ్‌రెడ్డి, మస్తాన్‌వలి, మాజీ జెడ్పీటీసీలు రామగురివిరెడ్డి, రామసుబ్బయ్య, మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, టీడీపీ నాయకులు సల్లానాగరాజు, కొలిమి ఉసేన్‌వలి, గుత్తి నరసింహులు, జెట్టి నాగరాజు, రఫిద్దీన్‌, శ్యాబా, నాగూర్‌వలి, గఫార్‌, హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:15:10+05:30 IST