సీఎం నిర్లక్ష్యం వల్లే కొవిడ్‌ మరణాలు

ABN , First Publish Date - 2021-06-20T05:28:01+05:30 IST

కరోనా పట్ల ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు.

సీఎం నిర్లక్ష్యం వల్లే కొవిడ్‌ మరణాలు
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్న అఖిలపక్ష పార్టీల నాయకులు

మృతుల సంఖ్యపై తప్పుడు లెక్కలు

బాధితులకు న్యాయం జరిగే వరకు దశలవారి పోరాటం

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నాయకులు

గుంటూరు(తూర్పు), జూన్‌ 19: కరోనా పట్ల  ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ శనివారం సీపీఐ జిల్లా కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ పారాసిటమాల్‌, కొవిడ్‌తో సహజీవనం వంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి తీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి తెల్లరేషన్‌ కార్డుదారునికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ మాట్లాడుతూ కేరళ రూ.44 వేల కోట్లు, మహారాష్ట్ర రూ.6 వేల కోట్లు, తమిళనాడు రూ.4 వేల కోట్లు కొవిడ్‌ కు నిధులు కేటాయిస్తుంటే మన ముఖ్యమంత్రి మాత్రం రూ.2 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. ఆయన సొంతపత్రికలో.. కొవిడ్‌ సమయంలో రూ.2,829 కోట్లు కేటాయించారని దానిలో రూ.900 కోట్లు కొవిడ్‌ సిబ్బందికి జీతాలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని, అదే నిజమైతే జీతాలు అందడం లేదని ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్‌ మొదలై 154 రోజులు గడుస్తున్నా రాష్ట్ర జనాభాలో కేవలం 4.9 శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ అందించారని తెలిపారు. జనసేన పొలిట్‌బ్యూరో సభ్యుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ  నవరత్నాల మినహా మిగిలిన ఏ సమస్యను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ మోదీ, జగన్‌లు కొవిడ్‌ నియంత్రణలో విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు జంగాల అజయ్‌కుమార్‌, కోటా మాల్యాద్రి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-20T05:28:01+05:30 IST