బీర్బల్‌ తెలివి!

ABN , First Publish Date - 2020-05-15T05:30:00+05:30 IST

‘‘నా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎలాగైనా మీరే ఆ దొంగను పట్టుకొని నాకు న్యాయం చేయండి.’’ అంటూ ఒక వర్తకుడు అక్బర్‌ సభను ఆశ్రయించాడు. అక్బర్‌ వెంటనే బీర్బల్‌ను పిలిచి దొంగెవరో కనిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్‌ జరిగిన విషయం తెలుసుకొని...

బీర్బల్‌ తెలివి!

‘‘నా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎలాగైనా మీరే ఆ దొంగను పట్టుకొని నాకు న్యాయం చేయండి.’’ అంటూ ఒక వర్తకుడు అక్బర్‌ సభను ఆశ్రయించాడు. అక్బర్‌ వెంటనే బీర్బల్‌ను పిలిచి దొంగెవరో కనిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. బీర్బల్‌ జరిగిన విషయం తెలుసుకొని ‘‘నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ అని ప్రశ్నించాడు. ‘‘నా దగ్గర పనిచేసే వాళ్లలో ఒకడు తీసి ఉంటాడని సందేహంగా ఉంది’’ అని అన్నాడు వర్తకుడు. వెంటనే వర్తకుడి దగ్గర పనిచేసే వాళ్లందరినీ పిలిపించాడు. ‘‘దొంగతనం ఎవరు చేశారు?’’ అని అడిగాడు బీర్బల్‌. ‘మేము చేయలేదు’ అని అందరూ సమాధానం ఇచ్చారు.


‘‘అయితే సరే! మీ అందరికీ ఒక కర్రపుల్ల ఇస్తాను. దాన్ని ఇంటికి తీసుకెళ్లి రేపు మళ్లీ తీసుకుని రండి. ఎవరైతే దొంగతనం చేశారో వారి కర్రపుల్ల రేపటికి రెండు అంగుళాలు పెరుగుతుంది’’ అని అన్నాడు బీర్బల్‌. అందరూ వాటిని తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు అందరూ సభకు చేరుకున్నారు. వారి కర్రపుల్లలు చూసిన బీర్బల్‌ అందులో ఒకడిని చూపిస్తూ ‘ఇతనే దొంగ’ అని అన్నాడు. ‘‘ఎలా చెబుతున్నావు బీర్బల్‌’’ అని కుతూహులంగా అడిగాడు అక్బర్‌. ‘‘జహాపనా! అందరి కర్రపుల్లలు నేనెలా ఇచ్చానో అలాగే ఉన్నాయి. ఇతని కర్ర మాత్రం రెండు అంగుళాలు చిన్నది అయింది. దొంగతనం చేశాడు కాబట్టి కర్ర ఎక్కడ పెరుగుతుందో అని రెండు అంగుళాలు కోసేసి తీసుకొచ్చాడు. అలా దొరికిపోయాడు’’ అని వివరించాడు బీర్బల్‌.


Updated Date - 2020-05-15T05:30:00+05:30 IST