‘ఆకాష్‌’ రామన్న కంపెనీ..

ABN , First Publish Date - 2020-06-03T10:42:49+05:30 IST

ఆకాశ రామన్న కంపెనీ పేరుతో కరువు రైతులకు నాసిరకం విత్తన వేరుశనగను అంటగట్టారు. అవి పండితే ఏంటి, ఎండితే ఏంటి ..

‘ఆకాష్‌’ రామన్న కంపెనీ..

అనంత రైతన్నకు బురిడీ..

అధికారులు, ప్రజాప్రతినిధి కుమ్మక్కు

కర్ణాటక నుంచి నాసిరకం వేరుశనగ దిగుమతి

ఆకాష్‌ ఆగ్రో ఏజెన్సీ పేరుతో బినామీ నిర్వాహకుల పంపిణీ

భారీగా ప్రజాధనం దోపిడీ

రైతులకు నాసిరకం కాయలు అంటగట్టిన దుస్థితి


కళ్యాణదుర్గం, జూన్‌ 2: ఆకాశ రామన్న కంపెనీ పేరుతో కరువు రైతులకు నాసిరకం విత్తన వేరుశనగను అంటగట్టారు. అవి పండితే ఏంటి, ఎండితే ఏంటి అన్న చందంగా వ్యవహారం సాగించారు. ప్రజాప్రతినిధి, సంబంధిత అధికారి కుమ్మక్కై ప్రభుత్వ రాయితీని దోచేశారు. అన్నదాతలను నిలువునా మోసం చేశారు. కరోనా మాటున కర్ణాటక నుంచి నాసిరకం వేరుశనగ కాయలను దిగుమతి చేసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా 4 వేల బస్తాలు (44 కేజీలవి) కళ్యాణదుర్గం వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఓ గోడౌన్‌లో నిల్వ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి.. ఆకాష్‌ ఆగ్రో ఏజెన్సీ (గుట్టూరు) నిర్వాహకుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పంపిణీ వ్యవహారాన్ని ఆ ప్రజాప్రతినిధి సమీప బంధువు, మరో నాయకుడికి అప్పజెప్పారు.


ఏపీ సీడ్స్‌, వ్యవసాయ శాఖాధికారులతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని సాగించినట్లు తెలుస్తోంది. విత్తన పంపిణీ మొదలుకాగానే మార్కెట్‌ యార్డులో వేరుశనగను శుద్ధి చేశారు. 30 కేజీల బస్తాలో నింపి ఆకాష్‌ ఆగ్రో ఏజెన్సీ ట్యాగ్‌లను వేసి కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాలకు సరఫరా చేసినట్లు సమాచారం. సుమారు 4 వేల బస్తాలను గోల్‌మాల్‌ చేసి, లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కె-6 రకం పేరుతో నాసిరకం వేరుశనగ పంపిణీ చేయటంతో కంబదూరు, కుందుర్పి, శెట్టూరు మండలాల్లో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో వేరుశనగ పంపిణీని అడ్డుకున్నారు. తాజాగా కైరేవు, ములకలేడు, పాళ్లూరు తదితర గ్రామాల రైతులు విత్తనం నాణ్యతగా లేదని అధికారులపై విరుచుకుపడ్డారు.


నిబంధనలివీ..

మన విత్తన కేంద్రాల ద్వారా వేరుశనగను రూ.6,100 ప్రకారం రైతుల వద్ద కొనుగోలు చేసి, శుద్ధిచేసి ఏపీ సీడ్స్‌కు 30 కేజీల బస్తా ప్రకారం అందజేయాల్సి ఉంది. కళ్యాణదుర్గం ప్రాంతంలో తొమ్మిది విత్తన సేకరణ కేంద్రాలు, నాలుగు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (కళ్యాణదుర్గం, శెట్టూరు, బ్రహ్మసముద్రం, బెళుగుప్ప) ఉన్నాయి. ఆ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రమే వేరుశనగను కొనుగోలు చేసి, ప్రభుత్వానికి చేరవేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ప్రభుత్వం అందజేసే రాయితీని దోచుకునేందుకు బినామీ అవతారమెత్తి లక్షలు గడిస్తున్నట్లు అధికార పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది.


అధికారులే సూత్రధారులు..

ఓ ప్రజాప్రతినిధితో మెప్పు పొందేందుకు వ్యవసాయ శాఖ కీలక అధికారి ఒకరు దళారీ అవతారమెత్తారని వైసీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. కర్ణాటక నుంచి వేరుశనగ దిగుమతి, పంపిణీ, బినామీ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలను ఆయనే వహించినట్లు బాహాటంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఏపీ సీడ్స్‌ వర్గాలతో ఆ అధికారికి ఉన్న సత్సంబంధాల కారణంగా ఈ వ్యవహారానికి ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఆకాష్‌ ఏజెన్సీకి సంబంధించిన ట్యాగ్‌లను సైతం ఆ అధికారే తీసుకొచ్చి బినామీ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. రైతులకు పంపిణీ చేసిన విత్తనం నాసిరకంగా ఉందంటూ సమస్యలు తలెత్తితే ఆ అధికారే బాధ్యత తీసుకుని పంపిణీ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారట. రైతులకు సర్దిచెప్పటంలో సఫలీకృతులయ్యారనే విమర్శలు లేకపోలేదు.

Updated Date - 2020-06-03T10:42:49+05:30 IST