తమిళ స్టార్ హీరో అజిత్ నటిస్తోన్న ‘వలిమై’ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అంటూ ఇప్పటి వరకు మేకర్స్ చెబుతూ వచ్చారు కానీ.. క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా, అజిత్‌కి యాక్సిడెంట్ వంటి కారణాలతో ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం పక్కా అంటూ నిర్మాత బోనీ కపూర్ విడుదల తేదీని కూడా ప్రకటించేశారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత బోనీ కపూర్ అధికారిక ప్రకటన చేశారు. ఈ విషయం తెలుపుతూ ఓ పవర్ఫుల్ పోస్టర్ని ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. దీంతో ఇప్పుడు ‘వలిమై’ ట్యాగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. ‘వలిమై’ చిత్ర తమిళ ట్రైలర్‌ను డిసెంబర్ 30, గురువారం విడుదల చేయగా.. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో రికార్డులను క్రియేట్ చేస్తోంది. అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా.. 3 నిమిషాల 5 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ గ్రాండ్ విజువల్స్‌తో అదిరిపోయింది. తెలుగులో ‘ఖాకి’గా విడుదల అయిన కార్తీ తమిళ సినిమా ‘థీరన్ అధిగారం ఒండ్రు’ సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అజిత్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఇంతకు ముందు.. హిందీ హిట్ ‘పింక్’ను తమిళంలో ‘నెర్కొండ పార్వై’గా తెరకెక్కించారు. అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ ‘వలిమై’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై బోనీకపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్లో నటిస్తుండగా.. అజిత్ సరసన బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి కథానాయికగా నటించింది.