బీజేపీ సొంత నివేదిక అది : మనీష్ సిసోడియా

ABN , First Publish Date - 2021-06-25T20:33:47+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు..

బీజేపీ సొంత నివేదిక అది : మనీష్ సిసోడియా

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ఆక్సిజన్ అవసరాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం నాలుగు రెట్లు పెంచి చెప్పినట్టు సుప్రీంకోర్టు ప్యానల్ పేర్కొందని బీజేపీ చేసిన ఆరోపణలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కొట్టిపారేశారు. అలాంటి రిపోర్ట్ ఏమీ లేదని అన్నారు. శుక్రవారంనాడు ఆన్‌లైన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ ప్యానల్ సభ్యులు అలాంటి ఏ రిపోర్టును ఆమోదించలేదని చెప్పారు. ''అలాంటి రిపోర్టు ఏమీ లేదు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యులతో మేము మాట్లాడాం. అలాంటి రిపోర్టు ఏదీ ఆమోదించడం కానీ, సంతకం చేయడం కానీ చేయలేదని చెప్పారు'' అని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీజేపీ తన పార్టీ ప్రధాన కార్యాలయంలో కూర్చుని ఇలాంటి తప్పుడు నివేదకను రూపొందించదని ఆరోపించారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ సభ్యుల సంతకాలతో ఉన్న రిపోర్ట్ ఏదైనా ఉంటే అది చూపించాలని డిప్యూటీ సీఎం సవాలు చేశారు. ఇలాంటి పనులకు పాల్పడటం ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ అవమానించడమే కాకుండా, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా కేంద్రం అవమానించిందని అన్నారు. ఆక్సిజన్ సంక్షోభం సమయంలో కేంద్రం నిర్వహణా లోపాలను కూడా డిప్యూటీ సీఎం తప్పుపట్టారు.


దీనికి ముందు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాతో మాట్లాడుతూ, సెకెండ్ వేవ్ సమయంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ డిమాండ్‌ను అవసరానికి కంటే నాలుగు రెట్లు హెచ్చు చేసి చెప్పిందని అన్నారు. ఇది కేజ్రీవాల్ ''హేయమైన నేరం'' అని విమర్శించారు. కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కేజ్రీవాల్, ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాను ఊహించని విధంగా రాజకీయం చేసిందని, నీచమైన రాజకీయాలకు పాల్పడిందని అన్నారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఇచ్చిన నివేదికలోని విషయాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని అన్నారు. అవసరానికి మించి నాలుగు రెట్లు ఆక్సిజన్ డిమాండ్ చేయడంతో ట్యాంకర్లన్నీ రోడ్డుపైనే ఉండిపోయాయనీ, ఆ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడి ఉంటే చాలా ప్రాణాలు నిలిచి ఉండేవని అన్నారు. ఇదేమీ చిన్న విషయం కాదని, దీనికి కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-25T20:33:47+05:30 IST