ఆదాయం జాస్తి.. లాభం నాస్తి

ABN , First Publish Date - 2020-10-28T08:24:07+05:30 IST

ప్రైవేట్‌ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ ఆదాయం భారీగా పుంజుకున్నప్పటికీ నష్టాల ఊబిలో నుంచి మాత్రం బయటపడలేకపోతోంది...

ఆదాయం జాస్తి.. లాభం నాస్తి

  • రూ.25,785 కోట్ల ఆల్‌టైం రికార్డు రాబడి
  • అయినా రూ.763 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ ఆదాయం భారీగా పుంజుకున్నప్పటికీ నష్టాల ఊబిలో నుంచి మాత్రం బయటపడలేకపోతోంది. వరుసగా ఆరో త్రైమాసికంలోనూ కంపెనీ నష్టాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు త్రైమాసికం(క్యూ2)లో ఎయిర్‌టెల్‌ రాబ డి 22 శాతం వృద్ధి చెంది రూ.25,785 కోట్లకు చేరుకుంది. కంపెనీకి ఇప్పటివరకిదే అత్యధిక త్రైమాసిక ఆదాయం.


టెలికాం సేవల చార్జీల పెరుగుదల, కరో నా కాలంలో రిమోట్‌ వర్కింగ్‌ కారణంగా డేటా వినియోగం పుంజుకోవడం కంపెనీ ఆదాయ వృద్ధికి కలిసివచ్చింది. జూలై-సెప్టెంబరులో ఎయిర్‌టెల్‌కు ఒక్కో కస్టమర్‌ ద్వారా రాబడి (ఏఆర్‌పీయూ) మూడేళ్ల గరి ష్ఠ స్థాయి రూ.162కు పెరిగింది. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఏఆర్‌పీయూ రూ.157గా నమోదుకాగా.. గత ఏడాది జూలై-సెప్టెంబరు కాలానికి రూ.128గా ఉంది. ఆదాయం, ఏఆర్‌పీయూ బాగా పుంజుకున్నప్పటికీ ఎయిర్‌టెల్‌ గడిచిన మూడు నెలలకు  రూ.763 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసుకుంది. గత ఏడాదిలో ఇదే కాలానికి ప్రకటించిన రూ.23,045 కోట్ల రికార్డు నష్టంతో పోలిస్తే మాత్రం చాలా తక్కువే. టెలికాం సేవలకు అంతగా గిరాకీ ఉండని సీజన్‌ అయినప్పటికీ కంపెనీ మాత్రం 22 శాతం ఆదాయ వృద్ధితో పటిష్ఠమైన పనితీరును కనబర్చిందని ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ అన్నారు. తమ కస్టమర్ల డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 58 శాతం పెరిగిందన్నారు. మున్ముందు త్రైమాసికాల్లో లాభదాయకతను పెంచుకునే విషయంలో కంపెనీ కట్టుబడి ఉందన్నారు. 



15.27 కోట్ల 4జీ  కస్టమర్లు

ఠ ఎయిర్‌టెల్‌ భారత విభాగ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.18,747 కోట్లకు చేరుకుంది. కంపెనీ నెట్‌వర్క్‌పై 4జీ సేవల వినియోగం పెరగడం ఇందుకు దోహదపడింది. 

ఠ సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ 4జీ కస్టమర్ల సంఖ్య 1.44 కోట్లు పెరిగి మొత్తం 15.27 కోట్లకు చేరుకుంది. 

ఠ ఏజీఆర్‌ బకాయిల్లో ఇప్పటికే 10ు చెల్లించామని, సుప్రీం ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది.


Updated Date - 2020-10-28T08:24:07+05:30 IST