సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన..ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ అరెస్టు

ABN , First Publish Date - 2020-06-30T10:17:58+05:30 IST

సిమ్‌స్వాప్‌ దందాలో సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.

సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన..ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సిమ్‌స్వాప్‌ దందాలో సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం సైబరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్ల సిమ్‌ స్వాప్‌ దందా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. జీతం ఇవ్వడంలేదనే సాకుతో యజమాని వద్ద పనిచేసే డ్రైవర్‌ స్నేహితుల సహకారంతో సిమ్‌స్వాప్‌ మోసానికి పాల్పడి యజమాని బ్యాంకు ఖాతాలోంచి రూ. 1.85 లక్షల కాజేశాడు.


ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడుతున్న క్రమంలో యజమానికి సంబంధించిన ఫోన్‌ నంబర్‌కు నకిలీ సిమ్‌ ఇవ్వడంలో, పాత సిమ్‌కార్డు స్థానంలో కొత్తగా తీసుకున్న డూప్లికేట్‌ సిమ్‌ యాక్టివేట్‌ అయ్యేలా చేయడంతో నిందితుల ముఠాకు తణుకుకు చెందిన ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ రావిపాటి శ్రీనివాస్‌ సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ సిమ్‌ యాక్టివేట్‌ కాగానే డెబిట్‌ కార్డుకు కొత్త పిన్‌ నంబర్‌ క్రియేట్‌ చేసి యజమాని ఖాతాలోని డబ్బులను కాజేశారని పోలీసులు గుర్తించారు. నిందితుడు శ్రీనివా్‌సను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. 

Updated Date - 2020-06-30T10:17:58+05:30 IST