Airtel Chief : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పథకం అద్భుతం : సునీల్ భారతి మిట్టల్

ABN , First Publish Date - 2022-08-18T22:02:13+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని

Airtel Chief : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పథకం అద్భుతం : సునీల్ భారతి మిట్టల్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారం చేయడం సులువు) పథకం అద్భుతంగా ఉందని ఎయిర్‌టెల్ చీఫ్ (Airtel Chief) సునీల్ భారతి మిట్టల్ (Sunil Bharti Mittal) చెప్పారు. అధికారుల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండానే పనులు చురుగ్గా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 30 ఏళ్ళ తన అనుభవంలో ఇంత సునాయాసంగా పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. 


సునీల్ మిట్ట‌ల్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, అనవసరమైన ఆందోళన లేకుండా, పని చేయాలని ఎప్పటికప్పుడు వెంటబడవలసిన అవసరం లేకుండా, కార్యాలయాల ప్రాంగణాల్లో తిరగవలసిన అవసరం లేకుండా, గొప్పలేవీ లేకుండా పనులు జరుగుతున్నాయని సునీల్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ease of doing business) సంపూర్ణమైన సామర్థ్యంతో పని చేస్తోందన్నారు. టెలికాం డిపార్ట్‌మెంట్ (Department of Telecom)తో తనకు ప్రత్యక్షంగా 30 ఏళ్ళకుపైగా అనుభవం ఉందన్నారు. తన అనుభవంలో పనులు వేగంగా జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారు. వ్యాపారం అంటే ఇలాగే జరగాలన్నారు. అత్యున్నత స్థాయిలోనూ, టెలికాం డిపార్ట్‌మెంట్‌లోనూ నాయకత్వం పని చేస్తోందన్నారు. ఎంత గొప్ప మార్పు వచ్చిందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దేశాన్ని మార్చగలిగే మార్పు వచ్చిందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే కలలకు శక్తినిచ్చే మార్పు వచ్చిందని తెలిపారు. 


5జీ స్పెక్ట్రమ్ వేలంలో భారతి ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు చెల్లించవలసిన రూ.8,312.4 కోట్లను బుధవారం చెల్లించారు. నాలుగేళ్ళకు చెల్లించవలసిన సొమ్మును షెడ్యూలుకు ముందే చెల్లించారు. ఈ నెలలోనే 5జీ సేవలను అందుబాటులోకి తేవడానికి ఎయిర్‌టెల్ కృషి చేస్తోంది. 


ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పెక్ట్రమ్ కేటాయింపుల లేఖలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు జారీ చేసినట్లు తెలిపింది. 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవాలని వారిని కోరింది. 


కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ‘కూ’తలో, స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ లెటర్ జారీ చేసినట్లు తెలిపారు. 5జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమవాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. 


Updated Date - 2022-08-18T22:02:13+05:30 IST