Airtel 5G Plus: వచ్చేసిన ఎయిర్‌టెల్ 5జీ ప్లస్.. ఖాతాదారులకు గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2022-10-06T21:50:15+05:30 IST

ఈ నెల 1న సేవలను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ తన 5జీ(Airtel 5G) సర్వీసులను.. ‘ఎయిర్‌టెల్ 5జీ ప్లస్’(Airtel 5G Plus) అని పిలుస్తోంది

Airtel 5G Plus: వచ్చేసిన ఎయిర్‌టెల్ 5జీ ప్లస్.. ఖాతాదారులకు గుడ్‌న్యూస్!

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారులకు ఇది శుభవార్తే. దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సేవలను ఎయిర్‌టెల్ (Airtel) నేడు (గురువారం) ప్రకటించింది. ఈ నెల 1న సేవలను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ తన 5జీ(Airtel 5G) సర్వీసులను.. ‘ఎయిర్‌టెల్ 5జీ ప్లస్’(Airtel 5G Plus) అని పిలుస్తోంది. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ ఎక్కువ నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ (Airtel) వినియోగదారులు ఎక్కువమంది వేగంగా 5జీ సేవలను పొందగలుగుతారు. 8 నగరాల్లో సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్ 5జీ టారిఫ్‌లు, ప్యాక్‌ల ధరలు, వాటి పేర్లను ప్రకటించింది.


భారతీ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్

ఎయిర్‌టెల్ చెబుతున్న దాని ప్రకారం.. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, వారణాసిలో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ  నగరాల్లోని వారు 5జీ సేవలను ఆనందించవచ్చు. ఇప్పటకే 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగిన వారు 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. అలాగని అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్లకు ఆ అవకాశం లేదు. ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఏఈఎంఎస్)..  ఓటీఏ (ఓవర్ టు ఎయిర్)ను అప్‌డేట్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే 5జీ సేవలను వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పటికే 4జీ సిమ్ ఉన్న వారు కూడా 5జీ సేవలను ఉపయోగించుకోవచ్చు.


 భారతీ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ ప్లాన్స్ 

ప్రస్తుతానికైతే 5జీకి సంబంధించి ప్రత్యకంగా ఎలాంటి టారిఫ్‌లు లేవు. కాబట్టి కొత్త ప్లాన్లు ప్రకటించే వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్లలోనే 5జీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఎయిర్‌టెల్ గత 27 సంవత్సరాల టెలికం విప్లవంలో ముందంజలోనే ఉందని భారతీ ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. తమ ఖాతాదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించే క్రమంలో మరో గొప్ప నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామని, తమ ప్రయాణంలో ఇది మరో అడుగని పేర్కొన్నారు. తమ కోసం తాము చేసుకునే పనిలో తమ ఖాతాదారులు కీలకంగా ఉంటారని పేర్కొన్నారు.  


భారతి ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ స్పీడ్ టెస్ట్ 

ఇటీవల ముగిసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ఎయిర్‌టెల్ తన 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించింది. సి-బ్యాండ్‌లో ఎయిర్‌టెల్ 5జీ ఎన్ఎస్ఏ నెట్‌వర్క్ అందించిన వేగం అద్భుతంగా ఉందని గోపాల్ విట్టల్ తెలిపారు.  

Updated Date - 2022-10-06T21:50:15+05:30 IST