నిధులెక్కడ?

ABN , First Publish Date - 2021-04-13T06:22:33+05:30 IST

విమానాశ్రయ విస్తరణ పర్వంలో నిర్వాసితుల వేదన అరణ్య రోదనగా మారుతోంది.

నిధులెక్కడ?
ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ భూములు ఇవే

ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం విమానాశ్రయ నిర్వాసితుల పోరుబాట

జిల్లా యంత్రాంగానికి వారం డెడ్‌లైన్‌

స్పందించకుంటే నిరవధిక నిరాహార దీక్ష 

కలెక్టర్‌ను కలిసి అల్టిమేటం ఇచ్చేందుకు ప్రయత్నం 


విమానాశ్రయ విస్తరణ పర్వంలో నిర్వాసితుల వేదన అరణ్య రోదనగా మారుతోంది. పరిహారం కోసం నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇదిగో జీవో ఇచ్చేశాం అని ప్రభుత్వం ప్రకటించింది. జీవో ఇచ్చి నాలుగు నెలలు దాటినా నయా పైసా కూడా చేతికందలేదు. సొంత గూడును కోల్పోయి.. అద్దె ఇళ్లలో ఉండాల్సి రావటం.. ఆ అద్దె కూడా అందకపోవడంతో నిర్వాసితుల్లో సహనం నశించింది. ఏడాది కాలంగా జిల్లా యంత్రాంగాన్ని కలుస్తున్న నిర్వాసితులు ఇక లాభం లేదనుకుని నేరుగా కలెక్టర్‌  ఇంతియాజ్‌ను కలిసి, తమ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్‌ విధించాలని నిర్ణయించుకున్నారు. వారంలోగా సమస్య పరిష్కారం కాకుంటే పోరుబాట పట్టాలని భావిస్తున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

కడుపుమండిన విమానాశ్రయ నిర్వాసితులు పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నిధుల సంగతి ఈ వారంలో తేల్చకుంటే, చిన అవుటపల్లిలోని లే అవుట్‌ దగ్గర నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని నేరుగా కలెక్టర్‌ ఇంతియాజ్‌కే అల్టిమేటం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.. సోమవారం సాయంత్రం విమానాశ్రయ నిర్వాసితులు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్‌ మూడు రోజులు సెలవులో ఉన్నారని తెలిసి వెనుదిరిగారు. ఆయన వచ్చిన తర్వాత కలిసి తమ సమస్యలపై నిలదీయాలని నిర్ణయించుకున్నారు. జీవో ఇచ్చి నాలుగు నెలలు దాటుతున్నా, ఇప్పటి వరకు పైసా కూడా విడుదల చేయకపోవటం ధర్మమా? అని నిర్వాసితులు మీడియా ముందు వాపోయారు. జిల్లా యంత్రాంగం మీద గౌరవంతో నెలల తరబడి ఓపిక పట్టామని, దీనిని అలుసుగా తీసుకుని రేపు మాపు అంటూ మభ్యపెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వారంలోగా పరిహారం ఇస్తే సరి.. లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని తెగేసి చెప్పారు.


నిధులు మంజూరై నాలుగు నెలలు..

విజయవాడ విమానాశ్రయ విస్తరణ కోసం గన్నవరం పరిసర ప్రాంతవాసులు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. బుద్ధవరం, దావాజీగూడెం, అల్లాపురం గ్రామాల్లో దాదాపు 400 మందికి పైగా నిర్వాసితులకు ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ వర్తింప చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో చిన అవుటపల్లిలో 50 ఎకరాల భూమిని సేకరించి అందులో పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. ఆ భూముల్లో లే అవుట్‌ కూడా వేయించారు. ఈ లే అవుట్‌లో మోడల్‌ గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. ముందుగా మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిలిచిన పనులు ముందుకు సాగలేదు. మరోవైపు నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకపోవటంతో అభివృద్ధి చేసిన రన్‌వేను కూడా ఫంక్షన్‌లోకి తీసుకురాలేకపోయారు. నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రజ్యోతి వరస కథనాలను ప్రచురించింది. ఆ తరువాత ప్రభుత్వం నుంచి కదలిక  వచ్చింది. 

గత ఏడాది డిసెంబర్‌ 24న ప్రభుత్వం జీవో ఆర్‌టీ నెంబర్‌ 49 ద్వారా ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు అనేక అపరిష్కృత అంశాలపై స్పందిస్తూ రూ.112.75 కోట్ల నిధులకు పాలనా ఆమోదం తెలుపుతున్నట్టు ఉత్తర్వులు జారీ చే సింది. 


విడుదల కాని నిధులు ఇవే.. 

విమానాశ్రయ పెండింగ్‌ అంశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో సింహభాగం ఆర్‌అండ్‌ఆర్‌ కేటాయింపులే ఉన్నాయి. బుద్దవరం, అల్లాపురం, దావాజీగూడెంలలోని ఇళ్లను తరలించేందుకు రూ. 57.20 కోట్ల నిధులకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ నేతృత్వంలో మంచినీటి ట్యాంక్‌ను నిర్మించేందుకు రూ.9.5 కోట్లు కేటాయించింది. తొలగించిన 55 గృహాలకు ఇవ్వాల్సిన అద్దె వ్యయం రూ.1.37 కోట్లు కూడా ఇందులో ఉన్నాయి. 


రూ.9 లక్షల ప్యాకేజీ ఎక్కడ?

గత ప్రభుత్వం మోడల్‌ గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పింది. ఆ ప్రభుత్వం మారింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇక దక్కదేమోనన్న భయంతో నిర్వాసితులు ఓ మెట్టు దిగారు. ప్రభుత్వం ఇంటికి రూ. 9 లక్షలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీకి అంగీకరించారు. ముందు రూ.4.50 లక్షలు, తర్వాత రూ.4.50 లక్షలు ఇస్తామని జిల్లా యంత్రాంగం చెబితే దానికీ ఒప్పుకున్నారు. తీరా అసలు పరిహారమే అందకపోవటంతో.. ఆందోళన చెందుతున్నారు. వారంలోగా సమస్య పరిష్కారం కాకపోతే నిరవధిక దీక్ష చేపట్టాలని కొందరు, న్యాయపోరాటానికి వెళదామని మరికొందరు భావిస్తున్నారు.

Updated Date - 2021-04-13T06:22:33+05:30 IST