ఫర్‌ సేల్‌

ABN , First Publish Date - 2021-10-28T06:50:37+05:30 IST

రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రైవేటు పరం కాబోతోంది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోను విక్రయించి తీరాలని కేంద్రం పట్టుదలతో ఉండడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.

ఫర్‌ సేల్‌
రాజమహేంద్రవరం విమానాశ్రయం

  అమ్మకానికి రాజమహేంద్రవరం విమానాశ్రయం
  జాతీయ మానిటైజేషన్‌ పాలసీ కింద  విక్రయించనున్న కేంద్రం
  బిడ్డింగ్‌లో విక్రయించి రూ.130 కోట్ల వరకు రాబట్టాలని కేంద్రం యోచన

 (కాకినాడ-ఆంధ్రజ్యోతి) రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రైవేటు పరం కాబోతోంది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోను విక్రయించి తీరాలని కేంద్రం పట్టుదలతో ఉండడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జాతీయ మానిటైజేషన్‌ పాలసీ కింద విమానాశ్రయాలను ప్రైవేటీకరించి భారీగా నిధులు సమీకరించాలన్న కేంద్రప్రభుత్వ ఆలోచనలో భాగంగా మరో రెండేళ్లలో ఎయిర్‌పోర్టును విక్రయించడానికి ఇప్పటికే రోడ్డుమ్యాప్‌ సిద్ధం చేసింది. అందులోభాగంగా రూ.130 కోట్లకు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని విక్రయించి నిధులు రాబట్టాలని నివేదికలో ప్రస్తావించింది. ఈనేపథ్యంలో ఎయిర్‌పోర్టు భవిష్యత్తులో ఏకంపెనీ చేతుల్లోకి వెళ్తుందనేది తేలాల్సి ఉంది. కాగా ఇక్కడి ఎయిర్‌పోర్టుకున్న భూమి విలువే వెయ్యికోట్లకుపైగా ఉంది. ఈనేపథ్యంలో దీనికి ప్రత్యేక విలువ కట్టి విక్రయిస్తారా? లేదా అన్నీ కలిపి గంపగుత్తుగా ప్రైవేటుకు పరాధీనం చేస్తారా? అనేది అయోమయంగా మారింది. అటు తమ కొలువుల మాటేంటని ఏఏఐ ఉద్యోగులు కలవరపడుతున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం మధురపూడిలో వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు నిత్యం సర్వీసులు నడుస్తున్నాయి. ప్రధానంగా ఇండిగో ఎక్కువ విమానాలు నడుపుతోంది. రూ.38 కోట్లతో 2007లో ఈ విమానాశ్రయాన్ని ఆధునికీకరించగా 2012లో ప్రారంభమైంది. కేవలం 150 మంది ప్రయాణికులకు సరిపడేలా అప్పట్లో టెర్మినల్‌ నిర్మించారు. ఆ తర్వాత ఇటీవల రూ.135 కోట్లతో కొత్త టెర్మినల్‌ భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 30 వేలు దాటింది. జిల్లాలో పనిచేస్తున్న గ్యాస్‌, ఆయిల్‌ కంపెనీలు ఇతర రాష్ట్రాలు, దేశాలు వెళ్లాలంటే ఈ విమానాశ్రయమే శరణ్యం. ఇక్కడి నుంచి ఇతర నగరాలకు వెళ్లి అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుతారు. జిల్లావాసులు హైదరాబాద్‌ వెళ్లడానికి ఈ విమానాశ్రయంపై ఆధారపడతారు. అయితే ఇన్నేళ్లయినా సర్వీ సులు మాత్రం పెద్దగా పెరగలేదు. పక్కనే ఉన్న విశాఖకు సర్వీసులు ప్రారంభించి రద్దీ లేక నిలిపివేశారు. అయితే ఎప్పటికైనా ఈ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడుతుందని భావించిన జిల్లావాసులకు కేంద్రం షాక్‌ ఇచ్చింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఆధీనంలోని ఈ విమానాశ్రయాన్ని లాభాలు లేవనే సాకుతో విక్రయించడానికి కేంద్రం నిర్ణయించడం ఆందోళన రేపుతోంది. జాతీయ మానిటైజేషన్‌ పాలసీ కింద 2022-25 మధ్య దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించి రూ.20,782 కోట్లు రాబట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులోభాగంగా రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని జాబితాలో చేర్చింది. 2023 లేదా 2024లో విక్రయించడానికి సన్నాహాలు చేస్తోంది. బిడ్డింగ్‌ ద్వారా ప్రైవేటు కంపెనీలకు విక్రయించి రూ.130 కోట్ల వరకు రాబట్టాలని ఆలోచిస్తోంది. అయితే ఇప్పుడీ నిర్ణయంపై విమానాశ్రయ ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. విమానాశ్రయంలో ఏఏఐ ఉద్యోగులు 69 మంది ఉండగా, ఇతర ప్రైవేటు ఉద్యోగులు 250 మంది వరకు ఉన్నారు. ప్రైవేటుకు విక్రయిస్తే తమ ఉద్యోగాలకు ముప్పు తప్పదని వీరంతా ఆందోళన చెందుతున్నారు. అటు ప్రయాణికులకు విషయానికి వస్తే ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరిస్తే సర్వీసుల సంఖ్య పెరిగినా చార్జీల మోత పెరిగిపోతుందని చెబుతున్నారు. ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌ ట్రావెలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓరుగంటి నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రైవేటీకరణతో యూజర్‌, ఇతర యూ డీఎఫ్‌ ఛార్జీలు భారీగా పెరిగిపోతాయని విశ్లేషించారు. ఏఏఐ ఆధీ నంలోని విమానాశ్రయాల్లో తక్కువ చార్జీలు ఉంటాయని, అదే ప్రైవేటు ఆధీనంలోని ఎయిర్‌పోర్టుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తారని పేర్కొన్నారు. ఇది ప్రయాణికులకు పెనుభారం అని వివరించారు. మరోపక్క రాజమహేంద్రవరం విమానాశ్రయానికి 1,020 ఎకరాల భూమి ఉంది. స్థానికంగా ఎకరా రేటు రూ.కోటి వరకు పలుకుతోంది. దీన్నిబట్టి భూమి విలువ ఎంతలేదన్నా వెయ్యి కోట్లకుపైగా ఉంటుంది. అలాంటప్పుడు కేంద్రం ఇక్కడి విమానాశ్రయానికి రూ.130 కోట్ల ధర ఎలా నిర్ధారిస్తుందనేది అర్థం కావడం లేదు. భవిష్యత్తులో దీన్ని విక్రయించినప్పుడు భూమి విలువ మినహాయించి ఒక్క విమానాశ్రయానికి ధర లెక్కించి విక్రయిస్తారా? లేదా? ప్రైవేటు కంపెనీలకు మొత్తం అంతా కలిపి కారుచౌకగా కట్టబెడతారా? అనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి విమానాశ్రయం టెర్మినల్స్‌, ఏటీసీ, నైట్‌ల్యాండింగ్‌ పరికరాలు, గుడ్‌విల్‌, విమానాశ్రయం లో మౌలిక సదుపాయాలు అన్నింటికి ధర నిర్ణయిస్తే వందల కోట్లు ఉంటుంది. అప్పుడు రూ.130 కోట్ల ధర నిర్థారిస్తే ప్రభుత్వానికి నష్టం వాటిల్లి దీన్ని దక్కించుకునే కంపెనీకి మేలు జరుగుతుంది.

Updated Date - 2021-10-28T06:50:37+05:30 IST