సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వం అవసరం

ABN , First Publish Date - 2021-04-10T06:52:22+05:30 IST

దేశానికి ప్రస్తుత పరిస్ధితుల్లో సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వం అవసరమని భారత వాయుసేనాధిపతి భదౌరియా అన్నారు.

సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వం అవసరం

భారత వాయుసేనాధిపతి ఆర్‌కేఎస్‌. భదౌరియా

అల్వాల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): దేశానికి ప్రస్తుత పరిస్ధితుల్లో సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వం అవసరమని భారత వాయుసేనాధిపతి భదౌరియా అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌ సైనిక్‌పురిలోని కాలేజ్‌ అఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌లో 159మంది త్రివిధ దళాల అధికారులకు, 12 మంది మిత్రదేశాలకు చెందిన అధికారులకు 44 వారాలపాటు హయ్యర్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో శిక్షణ అందించారు. కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  సైనిక అధికారులనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాయుధ దళాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలను, వాటి రూపురేఖలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాయుధ దళాల్లో మిషన్‌ ప్రాథమిక లక్ష్యం, దేశానికి కావల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీర్చిదిద్దే విధంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు. ఎలాంటి యుద్ధాలు వచ్చినప్పటికీ పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, కెన్యా, మాల్దీవులు, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలకు చెందిన 12మంది అధికారులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎంఎంఎస్‌)లో డిగ్రీ, ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఎఐఎంఎ)లో సర్టిఫికేట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ కోర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ లభించింది. కార్యక్రమంలో సీడీఎం కమాడెంట్‌ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ పవన్‌ మోహి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-10T06:52:22+05:30 IST