UAE: ఈద్ హాలీడేస్‌కు స్వదేశానికి వచ్చిన భారత్, పాక్ ప్రవాసులకు.. రిటర్న్ జర్నీ షాక్..!

ABN , First Publish Date - 2022-05-08T14:12:12+05:30 IST

ఈసారి రంజాన్‌కు యూఏఈలో ఏకంగా 9 రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో పాటు కరోనా ఆంక్షలు కూడా పూర్తిగా ఎత్తివేయడంతో చాలా మంది ప్రవాసులు స్వదేశాలకు క్యూకట్టారు.

UAE: ఈద్ హాలీడేస్‌కు స్వదేశానికి వచ్చిన భారత్, పాక్ ప్రవాసులకు.. రిటర్న్ జర్నీ షాక్..!

అబుదాబి: ఈసారి రంజాన్‌కు యూఏఈలో ఏకంగా 9 రోజుల లాంగ్ వీకెండ్ రావడంతో పాటు కరోనా ఆంక్షలు కూడా పూర్తిగా ఎత్తివేయడంతో చాలా మంది ప్రవాసులు స్వదేశాలకు క్యూకట్టారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ నుంచి భారీ సంఖ్యలో ప్రవాసులు స్వదేశాలకు వచ్చారు. సెలవులు ముగియడంతో తిరిగి యూఏఈ వెళ్లేందుకు ప్రవాసులు రెడీ అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడే వారికి రిటర్న్ జర్నీ షాక్ ఇస్తోంది. ఎందుకంటే విమాన చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. పాక్, భారత్‌లో కొన్ని గమ్యస్థానాల నుంచి యూఏఈ వెళ్లేందుకు బడ్జెట్ క్యారియర్స్‌లో వన్-వే టికెట్ ధర 1500 దిర్హమ్స్(రూ.31వేలు) పలుకుతుంటే.. ప్రీమియం క్యారియర్స్‌లో ఈ ధర ఏకంగా 2500 దిర్హమ్స్(రూ.52వేలు)గా ఉంది. భారత్‌లోని కొచ్చి, ముంబై, చెన్నై, కోజికోడ్ వంటి నగరాల నుంచి యూఏఈ వెళ్లేందుకు ప్రస్తుతం 3వేల దిర్హమ్స్(సుమారు రూ.63వేలు) చెల్లించాల్సి వస్తుందని ప్రవాసులు వాపోతున్నారు. ఇదిలాఉంటే.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈద్ హాలీడేస్ సందర్భంగా ఏప్రిల్ 29 నుంచి మే మొదటి వారం వరకు సుమారు 1.9 మిలియన్ల మంది ప్రయాణాలు కొనసాగించినట్లు అంచనా వేసింది. ఇందులో మే 7వ తేదీన అత్యధికంగా 2లక్షల మంది ప్రయాణించినట్లు వెల్లడించింది.    

Read more