గాలిమర నుంచి నీరు, విద్యుత్‌ ఉత్పత్తి

ABN , First Publish Date - 2020-12-04T06:18:32+05:30 IST

గాలిమరల నుంచి ఇప్పటివరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయడం చూశాం. అయితే స్థానిక యువకుడు మధు వినూత్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా నీటిని కూడా ఉత్పత్తి చేశాడు.

గాలిమర నుంచి నీరు, విద్యుత్‌ ఉత్పత్తి
మధు తయారీ చేసిన గాలిమర, నీటిని సేకరిస్తున్న దృశ్యం

వజ్రకరూరు యువకుడి వినూత్న ఆవిష్కరణ

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ ప్రశంసలు

ప్రధాని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఇన్నోవేషన్‌పై ట్విట్‌ 


వజ్రకరూరు, డిసెంబరు 3: గాలిమరల నుంచి ఇప్పటివరకు విద్యుత్‌ ఉత్పత్తి చేయడం చూశాం. అయితే స్థానిక యువకుడు మధు వినూత్న ఆలోచనతో ప్రయోగాత్మకంగా నీటిని కూడా ఉత్పత్తి చేశాడు. ఈవినూత్న ఆవిష్కరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. మధు గుత్తిలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అక్టోబరు 9న ప్రధాని మోదీ పిలుపు మేరకు గాలిలో తేమ నుంచి గాలిమరల ద్వారా విద్యుత్‌తో పాటు నీటిని ఉత్పత్తి చేసే వినూత్న ఆవిష్కరణకు పూనుకున్నాడు. మధు మాట్లాడుతూ ఇప్పటివరకు గాలిమరల నుంచి విద్యుత్‌ మాత్రమే ఉత్పత్తి చేశారన్నారు. అయితే తాను రూ.50 వేల ఖర్చుతో రోజుకు 80 లీటర్ల నీరు, వంద యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో విజయం సాధించినట్లు పేర్కొన్నాడు. ఈనూతన ఆవిష్కరణ ద్వారా తీర, ఎడారి ప్రాంతాల్లో నీటిని సమృద్ధిగా అందించవచ్చని అభిప్రాయపడ్డాడు. దీని నిర్వహణ ఖర్చుకూడా తక్కువేనన్నారు. ఎటువంటి వాతావారణ పరిస్థితిలోనైనా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే రోజుకు వెయ్యి లీటర్ల నీటిని, వెయ్యి యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తానని తెలిపారు. మధు విజయవంతమైన తన ఆవిష్కరణను వీడియో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశాడు. అదికాస్తా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్‌ జవడేకర్‌ దృషికి వెళ్లడంతో ఆయన ప్రశంసలు కురిపించారు. తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రధాని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఇన్నోవేషన్‌పై ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-12-04T06:18:32+05:30 IST