ఆయువు తీస్తున్న వాయువు

ABN , First Publish Date - 2022-06-05T06:08:52+05:30 IST

ఆధునికత ఓ వైపు.. ప్రకృతి ప్రకోపం, మరోవైపు మానవుడి ఆధిపత్యంతో పర్యావరణం దెబ్బతిని మానవునితోపాటు జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

ఆయువు తీస్తున్న వాయువు

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

ప్రశ్నార్థకంగా జీవరాశుల మనుగడ

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

గాలి పీల్చినా చస్తాం... పీల్చకపోయినా చస్తాం.. అన్నట్లుంది పరిస్థితి.  ప్రస్తుతం వాయు కాలుష్యం వల్ల ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్లు, శ్వాసకోస వ్యాధులు, నరాల వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక రుతువులు గతి తప్పడానికి, వేసవి తీవ్రత అధికం కావడానికి వాతావరణంలో వస్తున్న మార్పులే కారణం. ఈ మార్పులకు వాయు కాలుష్యమే ప్రధానంగా నిలుస్తోంది. ఒక వైపు పరిశ్రమల నుంచి వచ్చే వాయువులు, మరో వైపు వాహనాల కాలుష్యం.. దీనికి తోడు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం వెరసి మనల్ని రోగాల ఊబిలోకి నెడుతున్నాయి. వాతావరణంలో భూతాపం పెరిగేందుకు ప్రధాన కారణమవుతున్నాయి. ఫలితంగా రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1973 ‘వాయు కాలుష్యాన్ని ఓడిద్దాం..’ అంటూ నినదించింది. పర్యావరణంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా జూన 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.


పుట్టపర్తి, జూన 4(ఆంధ్రజ్యోతి): ఆధునికత ఓ వైపు.. ప్రకృతి ప్రకోపం,  మరోవైపు మానవుడి ఆధిపత్యంతో పర్యావరణం దెబ్బతిని మానవునితోపాటు జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న క్లోరోఫోరోకార్బన్లు భూ ఉపరితలాన్ని వేడెక్కిస్తూ పలు కాలుష్యాలకు కారణమవుతున్నాయి. అదే విధంగా మానవుని స్వార్థానికి జిల్లాలో అటవీ సంపద కనుమరుగవుతోంది. ఈ నేపథ్యంలో పచ్చదనం లేక వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. జిల్లాలో కాస్తోకూస్తో ఉన్న అటవీ సంపదపై వేసవి ఆరంభమైదంటే కొందరు స్వార్థపరులు, ఆకతాయిల దెబ్బకు అగ్నికి ఆహుతవుతున్నాయి. భూతాపం పెరగడంతో పర్యావరణంలో పెనుమార్చులు చోటు చేసుకుని జీవరాసుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వాతావరణం మార్పులతో జీవవైవిధ్యం దెబ్బతినడంతో కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. పర్యావరణంలో వస్తున్న పెను మార్పులు, కాలుష్యం కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌తో ఓజోనపొర దెబ్బతింటోంది. అదేవిధంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం కూడా వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది. 


ముప్పు తెస్తున్న ఆధునికత 

ఇటీవల పట్టణాలు, పల్లెలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇదే సందర్భంలో మానవుని అవసరాల పేరుతో దశాబ్దాలుగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోగా పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయి. ప్రధానంగా శ్రీసత్యసాయి జిల్లాలో విలువైన అటవీ వృక్షజాతులు, వన్యప్రాణులు మానవుడి స్వార్థానికి బలవుతున్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన అడవులు మానవ అవసరాలతో పాటు కొందరు అడవికి నిప్పు పెట్టడంతో అటవీ సంపద ఆహుతవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో పరిశ్రమలు పదుల సంఖ్యలో ఉన్నా చెట్లను సంరక్షించే చర్యలు అధికారులు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ తరుణంలో భవిష్యత తరాలు బాగుండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మొక్కలునాటి సంరక్షించాలి. కాలుష్య నియంత్రణతో పాటు అడవులు, వన్యప్రాణులను రక్షించి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి.


పచ్చదనాన్ని పెంపొందించాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. మొక్కలు నాటి సంరక్షించాలి. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న అడవుల్లో అరుదైన వృక్షజాతులు, వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని మనం కాపాడుకోవాలి. పట్టణాలతోపాటు పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్‌ను నిషేధించాలి. పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 

- డాక్టర్‌ శ్రీదేవి, వృక్షశాస్త్ర విభాగం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెనుకొండ


Updated Date - 2022-06-05T06:08:52+05:30 IST