Air India: అమృత్‌సర్-లండన్ మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు.. ఎప్పట్నుంచంటే..

ABN , First Publish Date - 2022-02-16T18:53:49+05:30 IST

సుమారు 70 ఏళ్ల తర్వాత ఇటీవలే ఎయిరిండియా సొంతగూటికి(టాటా గ్రూపు) చేరిన విషయం తెలిసిందే.

Air India: అమృత్‌సర్-లండన్ మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు.. ఎప్పట్నుంచంటే..

ఇంటర్నెట్ డెస్క్: సుమారు 70 ఏళ్ల తర్వాత ఇటీవలే ఎయిరిండియా సొంతగూటికి(టాటా గ్రూపు) చేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా సర్వీసుల సంఖ్య పెంచడం, ప్రయాణికులకు పలు సౌకర్యాలు కల్పించడం చేస్తోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. అమృత్‌సర్-లండన్ మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడిపించనున్నట్లు ప్రకటించింది. మార్చి 27 నుంచి ఈ కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. అమృత్‌సర్ నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి ఈ సర్వీసులు పని చేస్తాయి. 


కాగా, ప్రస్తుతం అమృత్‌సర్ నుంచి యూకేకు వారానికి కేవలం ఒక్క సర్వీస్ మాత్రమే ఉంది. దీంతో బ్రిటన్‌లో అధికంగా ఉండే పంజాబీలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రమాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ రూట్‌లో విమాన సర్వీసులు నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఫ్లైఅమృత్‌సర్ ఇనిషియేటివ్ గ్లోబల్ కన్వీనర్ వికాస్ మంచ్, విదేశీ కార్యదర్శి సమీప్ సింగ్ గుమ్టాలా, యూకెలోని SEVA ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్ కన్వల్ సింగ్ సెఖోన్ ఒక సంయుక్త ప్రకటన చేశారు. మహమ్మారి నేపథ్యంలో సాధారణ అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్‌తో ఈ ప్రధాన మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కనుక ఈ మార్గంలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచడం బ్రిటన్‌లోని పంజాబీ డయాస్పోరాకు కలిసిరానుందని పేర్కొన్నారు. 


ఇక AI-170 విమానం లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి శని, ఆది, సోమ వారాల్లో అమృత్‌సర్ వస్తుంది. అలాగే అమృత్‌సర్ నుంచి ఆది, సోమ, మంగళ వారాల్లో తిరిగి లండన్ వెళ్తోంది. మార్చి 27 నుంచి ఈ సర్వీసులు ప్రారంభం అవుతాయి. కాగా, ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా ఎయిరిండియా కూడా వీక్లీ అమృత్‌సర్-బర్మింగ్‌హామ్ మధ్య ఒక విమాన సర్వీస్ నడిపిస్తోంది. ఇప్పుడు వారానికి మూడు విమానాలు నడపడం ద్వారా పంజాబ్ నుంచి బ్రిటన్ వెళ్లేవారికి హెల్ప్ అవుతుందని సమీప్ సింగ్ గుమ్టాలా తెలిపారు.  

Updated Date - 2022-02-16T18:53:49+05:30 IST