సకల హంగులతో సిద్ధమైన ‘ఎయిరిండియా వన్’ విమానం... అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు సన్నాహాలు...

ABN , First Publish Date - 2020-08-15T00:33:03+05:30 IST

దేశంలోని అగ్ర శ్రేణి రాజ్యాంగ పదవులు నిర్వహించేవారు ప్రయాణించేందుకు ఉద్దేశించిన

సకల హంగులతో సిద్ధమైన ‘ఎయిరిండియా వన్’ విమానం... అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు సన్నాహాలు...

న్యూఢిల్లీ : దేశంలోని అగ్ర శ్రేణి రాజ్యాంగ పదవులు నిర్వహించేవారు ప్రయాణించేందుకు ఉద్దేశించిన ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాన్ని స్వీకరించేందుకు ఉన్నతాధికారులు అమెరికా వెళ్ళారు. ఎయిరిండియా అధికారులు, భద్రతాధికారులు, సీనియర్ ప్రభుత్వ అధికారుల బృందం ఈ వీవీఐపీ విమానాన్ని స్వీకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. 


ఆ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించడం కోసం రెండు వీవీఐపీ విమానాలను తయారు చేయిస్తున్నారు. వీటిలో ఒకటి బట్వాడాకు సిద్ధంగా ఉంది. దీనిని స్వీకరించేందుకు భారత దేశ అధికారులు అమెరికా వెళ్ళారు. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు ఎయిరిండియా అధికార ప్రతినిథి నిరాకరించారు. 


అత్యంత ఆధునిక హంగులుగల రెండు బోయింగ్-777ఈఆర్ విమానాలను భారత ప్రభుత్వం కొంటోంది. ఇవి స్పెషల్ ఎక్స్‌ట్రా సెక్షన్ ఫ్లైట్ (ఎస్ఈఎస్ఎఫ్) లేదా వీవీఐపీ విమానాలు. వీటిని ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాలు అని పిలుస్తారు. 


ప్రస్తుతం బట్వాడాకు సిద్ధమైన విమానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనలకు అనువుగా ఉండేవిధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దీనిలో విలేకర్ల సమావేశం నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ఏకంగా 17 గంటలపాటు నిరంతరాయంగా ప్రయాణించగలదు. దీనిలో దృశ్య, శ్రవణ ప్రసార మాధ్యమాల వ్యవస్థ కూడా ఉంటుంది. ఈ విమానం ప్రయాణిస్తుండగానే వీటిని ఉపయోగించుకోవచ్చు. మినీ మెడికల్ సెంటర్ కూడా దీనిలో ఉంది. 


వీవీఐపీ విమానాలను భారత వాయు సేన నిర్వహిస్తుంది కాబట్టి, ఈ విమానాన్ని ఎయిరిండియా స్వీకరించిన తర్వాత భారత వాయు సేనకు అప్పగిస్తుంది. 


Updated Date - 2020-08-15T00:33:03+05:30 IST