International Flights: భారత్-ఖతార్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2021-07-30T15:19:31+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు 1 నుంచి ఖతార్‌-భారత్ మధ్య అదనపు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా ప్రకటించింది.

International Flights: భారత్-ఖతార్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు

దోహా: వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు 1 నుంచి ఖతార్‌-భారత్ మధ్య అదనపు నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 29 వరకు ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం ముంబై, హైదరాబాద్, కొచ్చి నుంచి దోహాకు రెండు అదనపు విమానాలు నడపనుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఖతార్ ఎంట్రీ నిబంధనలకు లోబడి అర్హులైన వారికి మాత్రమే ఈ విమానాల్లో ప్రయాణించడానికి వీలు ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది.


విదేశీ ప్రయాణికులపై ఖతార్ విధించిన కరోనా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ధృవపత్రాలు రెడీ చేసుకుని సరిచూసుకున్న తర్వాతే జర్నీకి సిద్ధం కావాలని సూచించింది. అంతేగాక ఏదైనా కారణాలతో ప్రయాణికులకు బోర్డింగ్ నిరాకరిస్తే అందుకు తాము బాధ్యత వహించబోమని కూడా ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ విషయంలో పూర్తిగా ప్రయాణికులదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఇక విమాన టికెట్ల ప్రారంభ ధర రూ. 9200గా ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది.      


ఈ అదనపు నాన్‌స్టాప్ విమాన సర్వీసుల షెడ్యూల్..

దోహా టు కొచ్చి  - మంగళ, గురువారం

కొచ్చి టు దోహా  - బుధ, శుక్రవారం

దోహా టు హైదరాబాద్  - ఆది, బుధవారం(గమనిక: రిటర్న్ ఫ్లైట్స్ ఇవే రోజుల్లో ఉంటాయి.)

దోహా టు ముంబై  - బుధ, శుక్రవారం

ముంబై టు దోహా  - సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం

Updated Date - 2021-07-30T15:19:31+05:30 IST