AFCATకు ఎంపికైతే 56వేలకు పైగా స్టయి పెండ్

ABN , First Publish Date - 2022-06-22T22:02:49+05:30 IST

భారత వైమానిక దళంలో టెక్నికల్‌,నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు ఆశించే వారికి చక్కని మార్గం ‘ఏఎఫ్‌క్యాట్‌(ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)’. ఈ పరీక్ష ద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో పర్మనెంట్‌ కమిషన్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ స్థాయి ఉద్యోగాల్లో చేరవచ్చు. శిక్షణ సమయంలో నెలకు...

AFCATకు ఎంపికైతే 56వేలకు పైగా స్టయి పెండ్

భారత వైమానిక దళంలో టెక్నికల్‌,నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు  ఆశించే వారికి చక్కని మార్గం ‘ఏఎఫ్‌క్యాట్‌(ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌)’. ఈ పరీక్ష ద్వారా ఎయిర్‌ఫోర్స్‌లో పర్మనెంట్‌ కమిషన్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ స్థాయి ఉద్యోగాల్లో చేరవచ్చు.  శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం  రూ.56.100 మూల వేతనం లభిస్తుంది. అంతేకాదు పోస్టింగ్‌ పొందిన ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.83 వేల నుంచి రూ.96 వేల వరకు నెల వేతనం(సీటీసీ) పొందవచ్చు.  ఏఎఫ్‌క్యాట్‌ జూన్‌- 2022 నోటిఫికేషను ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌’ విడుదల చేసింది. పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్‌ 30.


ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) ఖాళీల భర్తీకి ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో  ‘ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌’ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఇందులో ‘పర్మనెంట్‌ కమిషన్‌’, ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ అనే రెండు రకాలుంటాయి. ‘పర్మనెంట్‌ కమిషన్‌’ కింద ఎంపికైన వారు ఉద్యోగ విరమణ వయసు వచ్చే వరకు ఉద్యోగంలో ఉంటారు. కానీ ‘షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌’ కింద నియామకమైన వారు మాత్రం కేవలం 14 సంవత్సరాలే సర్వీ్‌స్‌లో ఉంటారు.  ‘ఫ్లయింగ్‌ బ్రాంచ్‌’, ‘గ్రౌండ్‌  డ్యూటీ’ పోస్టులను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద భర్తీ చేస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు సర్వీసు పీరియడ్‌ 14 ఏళ్లు, గ్రౌండ్‌ డ్యూటీ పోస్టులను 10 ఏళ్ల కాలానికే భర్తీ చేస్తారు. అయితే  అవసరాల రీత్యా గ్రౌండ్‌ డ్యూటీ అభ్యర్థుల సర్వీసును మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.


అర్హతలు

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: అభ్యర్థులు ఇంటర్‌లో మేథ్స్‌, ఫిజిక్స్‌ చదివి, 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంటే.. 2023 జూలై 01 నాటికి వయసు  20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(మెకానికల్‌): 50 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ లేదా ఏరోస్పేస్‌ లేదా ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లేదా మెకానికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ల్లో ఏదో ఒక విభాగంలో బీఇ/బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో ఫిజిక్స్‌, మేథ్స్‌ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌కు వయసు: 2023 జూలై 01 నాటికి వయసు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

గ్రౌండ్‌ డ్యూటీ-నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌ విభాగాలకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అకౌంట్స్‌ విభాగానికి 50 శాతం మార్కులతో బీకాం పాస్‌ అయి ఉండాలి. 2023 జూలై 01 నాటికి వయసు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. 


ఎంపిక విధానం

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, పైలెట్‌ ఆప్టిట్యూడ్‌ బ్యాటరీ టెస్ట్‌(పీఏబీటి), మెడికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టు ఏదైనప్పటికీ అభ్యర్థులందరికీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఉంటుంది. టెక్నికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు అదనంగా ఇంజనీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌(ఈకేటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1,స్టేజ్‌-2పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కి దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటరైజ్డ్‌ పైలెట్‌ సెలెక్షన్‌ సిస్టం(సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షను ఇంటర్వ్యూ తరవాత నిర్వహిస్తారు. ఈ పరీక్షలు అన్నింటిలో అర్హత సాధించిన వారికి మెడికల్‌ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. 


పరీక్ష విధానం

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ప్రశ్నలు ఆంగ్లంలో మాత్రమే ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలోనే ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.  తప్పుగా గుర్తించిన ప్రతి  సమాధానానికి ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. టెక్నికల్‌ బ్రాంచి వారికి నిర్వహించే ఈకెటి పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.  50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. మొత్తం మార్కులు 150. 


సిలబస్‌

జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ. న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, మిలిటరీ ఆప్టిట్యూడ్‌ టాపిక్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగతా విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయుల్లో ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 20 ప్రశ్నలు, వెర్బల్‌ ఎబిలిటీ ఇన్‌ ఇంగ్లీష్‌ నుంచి 30, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి 15, రీజనింగ్‌ అండ్‌ మిలిటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి.


ఏఎఫ్‌ఎస్‌బి

రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని  ఎయిర్‌ఫోర్స్‌ సెలెక్షన్‌ బోర్డు(ఏఎఫ్‌ఎస్‌బి) నిర్వహించే స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలకు పిలుస్తారు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ విభాగంలో అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. 10 పుష్‌ అప్స్‌, 3 చిన్‌ అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌-1 స్ర్కీనింగ్‌ టెస్ట్‌లో చిన్న అసైన్‌మెంట్స్‌, పజిల్స్‌ లాంటివి నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్‌-2 పరీక్షకు పిలుస్తారు. సైకాలజిస్ట్‌ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్‌-2లో అర్హత సాధించిన వారికి ఫైనల్‌గా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.


శిక్షణ

ఏఎఫ్‌క్యాట్‌లో ఎంపికైన ఫ్లయింగ్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు 74 వారాల పాటు, గ్రౌండ్‌ డ్యూటీకి ఎంపికైన వారికి 52 వారాలు  ఎయిర్‌ఫోర్స్‌ ట్రెయినింగ్‌ ఇస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్‌, హకీంపేట్‌, బీదర్‌, ఎలహంకల్లో ఆరు నెలలు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. 


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30 

ఏఎఫ్‌క్యాట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: 2022 ఆగస్టు 26 నుంచి 28 వరకు

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ 

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/

Updated Date - 2022-06-22T22:02:49+05:30 IST