రుణపై మాఫీపై సర్వే

ABN , First Publish Date - 2020-07-09T09:46:19+05:30 IST

డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ ఇచ్చిన

రుణపై మాఫీపై సర్వే

‘ఆసరా’లో ఎస్‌హెచ్‌జీ సభ్యుల అర్హులు, అనర్హుల గుర్తింపు కోసం  సర్వే

రంగంలోకి దిగిన వెలుగు సిబ్బంది 

20 నాటికి సర్వే పూర్తి చేయడానికి లక్ష్యం  

అర్హులైన వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు జమ


(కాకినాడ- ఆంధ్రజ్యోతి) : డ్వాక్రా సంఘాల సభ్యులకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తోంది. ‘వైఎస్‌ఆర్‌ ఆసరా’ పేరుతో అర్హులైన సభ్యులకు మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈమేరకు డీఆర్‌డీఏ, మెప్మా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు అర్హులు, అనర్హుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో సంఘాలతో చర్చించి నివేదిక సిద్ధం చేయడంలో వెలుగు సిబ్బంది నిమగ్నమయ్యారు. జాబితాలో అర్హత పొందిన సంఘ సభ్యులకు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.


అర్హుల జాబితా ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని అధికా రులు భావిస్తున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాం తాల్లో 84,754 సంఘాల్లో 8.16 లక్షల మంది సభ్యులున్నారు. గతంలో 75,376 సంఘాలకు ‘ఆసరా’ వర్తిస్తుందని భావించారు. నగరాలు, పట్టణాల్లో 22,000 సంఘాలకు 15,705 సంఘాల్లో 1.66 లక్షల మందికి లబ్ధి కలుగు తుందని అంచనా వేశారు. తాజా సర్వే రిపోర్టులో ఈ సంఖ్య పెరుగుతోందా, వివిధ కారణాలు సాకుగా చూపి ఇంకా తగ్గిస్తారా అనేది తేలాల్సి ఉంది. సభ్యులకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో సున్నా వడ్డీ ఒకటి. సభ్యులు గతంలో తీసుకున్న రుణ వాయిదా చెల్లింపులకు కరోనా నేపథ్యంలో మూడు నెలల మారటోరియాన్ని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు ఆసరా పేరుతో రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గరిష్టంగా రూ.3 లక్షలు అప్పు తీసుకున్న సంఘాలకు లబ్ధి వర్తించనుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏ మం డలం, ఏ వార్డులో ఎన్ని సంఘాలకు చెందిన వారు ఎంతమంది సభ్యులున్నారు, ఎంతమంది రాయితీ కోసం అర్హులనే వివరాలతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. అర్హత గల సంఘాలు, అందులో సభ్యులకు 2019 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు తీసుకున్న రుణాలు, సక్రమంగా చెల్లించిన సంఘ సభ్యులకు మాత్రమే ఆసరా వర్తిస్తుందని తెలుస్తోంది. 


కార్పొరేషన్ల నుంచి చెల్లింపులు 

‘ఆసరా’లో మాఫీ చేసే నగదును సభ్యుల సంఘాల ఖాతాల్లో జమ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత సభ్యుల వ్యక్తిగత ఖాతా ల్లో వేస్తామన్నారు. గతంలో ఈ నగదు మొత్తా న్ని డీఆర్‌డీఏ, మెప్మాకు విడతల వారీ మంజూ రు చేస్తామన్నారు. తాజాగా సామాజిక వర్గాల కేటగిరీ విభజించి, ఆయా కార్పొరేషన్‌ల ద్వారా చెల్లించాలని భావిస్తున్నారు. దీంతో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా ఆయా సంఘాల్లో సభ్యుల కులాలను వెలుగు సిబ్బంది సర్వే చేస్తున్నారు.


ఆయా కులాల వారీ సభ్యు లకు ఆయా కార్పొరేషన్‌లు నగదును బ్యాంకుల్లో జమ చేస్తాయి. అలాగే సభ్యులు ఏ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వివరాలు, ఫోన్‌ నంబరు సేకరిస్తున్నారు. అలాగే సభ్యురాలు జీవించి ఉన్నారా లేదా అనే విషయాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆసరా సొమ్ము జమ చేయనున్నారు. తొలి విడత ఆసరా సొమ్ములు ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి బ్యాంకుల్లో జమ చేస్తారని తెలుస్తోంది.  

Updated Date - 2020-07-09T09:46:19+05:30 IST