సభ్యత్వ నమోదుపై ముఖ్య నేతల గురి

ABN , First Publish Date - 2022-01-21T05:59:02+05:30 IST

కాంగ్రె్‌సపార్టీ సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు నేడు జిల్లాకు రానున్నారు.

సభ్యత్వ నమోదుపై ముఖ్య నేతల గురి
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌పార్టీ సభ్యత్వాన్ని ఫోన్‌లో నమోదు చేస్తున్న ఎన్‌రోలర్‌

 నేడు జిల్లాలో సమీక్ష సమావేశాలు

 ఒకే రోజు ఎంపీ ఉత్తమ్‌ పార్లమెంటరీ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 

 పరిశీలకులుగా ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి

 హుజూర్‌నగర్‌ , జనవరి 20 : కాంగ్రె్‌సపార్టీ సభ్యత్వ నమోదును సమీక్షించేందుకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు నేడు జిల్లాకు రానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌తో పాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గీతారెడ్డి హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో నిర్వహించే కాంగ్రె్‌సపార్టీ సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్నారు.  ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్టీ సభ్యత్వ నమోదును పరిశీలించడంతో పాటు ప్రతి బూత్‌ స్థాయిలో 300 మందికి పైగా సభ్యత్వ నమోదు చేయించిన పార్టీ ఎన్‌రోలర్లందరినీ సన్మానించి, సర్టిఫికెట్‌తో పాటు మెమోంటోను అందజేయనున్నారు. సభ్యత్వాల నమోదులో ముందున్న ఎంపీగా ఉత్తమ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ పరిధిలోని ఏడు నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ క్రమంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఇప్పటివరకు నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలో సుమారు 1,56,403 సభ్యత్వాలు పూర్తి చేశారు. మొత్తం ఈ నెల 21 నాటికి సుమారు 2 లక్షల సభ్యత్వాలు పూర్తి చేస్తామని చెబుతున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 41 వేలు, దేవరకొండలో 13,689, కోదాడలో 27,476, మిర్యాలగూడలో 7,153, నాగార్జునసాగర్‌లో 19,627, నల్లగొండలో 4,887, సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో 40,859 కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలు పూర్తయినట్లు సమాచారం. హుజూర్‌నగర్‌లో అత్యధికంగా ఉండగా సూర్యాపేట ద్వితీయ స్థానంలో ఉంది. నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కేవలం ఐదు వేల లోపే ఉండడం గమనార్హం.  

హుజూర్‌నగర్‌లో ముమ్మరంగా

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదు ముమ్మరంగా జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 302 బూత్‌లకు 302 బూత్‌ ఎన్‌రోల్స్‌ను నియమించారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా సభ్యత్వాల నమోదు చేయించాలని ఎన్‌రోలర్స్‌ను ఉత్తమ్‌ ఆదేశించడంతో నాయకులు ఇంటింటికి వెళ్ళి సభ్యత్వ నమోదును చేయించారు. ఈ నెల 26 వరకు డిజిటల్‌ సభ్యత్వాలు పూర్తిచేయాలని ఆదేశించింది. కానీ ఈ నెల 21 వరకే హుజూర్‌నగర్‌ సెగ్మెంట్‌లో సభ్యత్వ నమోదును పూర్తి చేసేందుకు ఉత్తమ్‌ దృష్టి సారించారు. ఇందుకోసం ఈ నెల 13 నుంచి 16 వరకు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యకర్తలతో ఎంపీ ఉత్తమ్‌ సమావేశాలు నిర్వహించారు. బూత్‌స్థాయి కార్యకర్తలతో ముఖాముఖి చర్చించి, వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఒక్కో ఎన్‌రోలర్‌ ప్రతి బూత్‌లో 300 మందికి పైగా సభ్యత్వ నమోదు చేయించే పనిలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సభ్యత్వ నమోదును 50వేలకు పైనే చేయించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. 

Updated Date - 2022-01-21T05:59:02+05:30 IST