Apr 11 2021 @ 00:43AM

బార్డర్ పై బాలీవుడ్ గురి

లవ్‌స్టోరీలు, హారర్‌ కామెడీలు, బయోపిక్‌లే కాదు ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో దేశభక్తి చిత్రాల నిర్మాణం కూడా పెరిగింది. జాన్‌ అబ్రహం, అక్షయ్‌కుమార్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ లాంటి కొంతమంది బాలీవుడ్‌ హీరోలు ఈ జానర్‌లో ఏటా కనీసం ఒక చిత్రంలో నటిస్తున్నారు. సరిహద్దు దేశాలతో యుద్ధం, భారత సైనికుల వీరోచిత పోరాటాలను వెండితెరపై వీక్షించేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుండటంతో ఈ చిత్రాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో పలు చిత్ర నిర్మాణ సంస్థలు దేశ భక్తి చిత్రాలను రూపొందిస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న కొన్ని బాలీవుడ్‌ దేశభక్తి చిత్రాలు...


ఎటాక్‌, సత్యమేవ జయతే 2

‘పరమాణు’, ‘సత్యమేవ జయతే’ లాంటి దేశభక్తి చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహమ్‌. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న మరో రెండు చిత్రాల్లో ఆయన కథానాయకుడుగా నటిస్తున్నారు. ముంబైలో తీవ్రవాదుల దాడుల నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటాక్‌’. మిలటరీ ఆపరేషన్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో జాక్వెలిన్‌ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘ఎటాక్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


జాన్‌ అబ్రహం నటిస్తోన్న ‘సత్యమేవ జయతే 2’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే తెరకెక్కింది. మే 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సమాజంలో అసమానతలు, రాజకీయ నాయకుల అక్రమాల వల్ల దేశం ఎలా నష్టపోతుందో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో జాన్‌ అబ్రహం ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈద్‌ సందర్భంగా మే 13న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు కానీ కరోనా కారణంతో ఆ రోజున విడుదల చేస్తారో లేదో వేచి చూడాలి.


సూర్యవంశీ

బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెపుతానంటున్నారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. ఆయన నటించిన ‘సూర్యవంశీ’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే తెరకెక్కింది. ఇందులో అక్షయ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ చీఫ్‌ పాత్రలో కనిపించనున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకుడు. ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్‌ వేవ్‌తో వాయిదాపడింది. 


శామ్‌

స్వతంత్ర భారతంలో తొలి ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘శామ్‌’. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో తన వ్యూహాలతో శత్రువుల వెన్ను విరిచారు. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొని దేశానికి విజయాలు సాధించిపెట్టారు. అటువంటి యోధుడి కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో విక్కీ కౌశల్‌ శామ్‌ మానె క్‌ షా పాత్రలో నటిస్తున్నారు.


మేజర్‌ 

ముంబై తీవ్రవాద దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ‘మేజర్‌’ టైటిల్‌తో వెండితెరపైకి రానుంది. ఉన్ని కృష్ణన్‌ పాత్రను అడివిశేష్‌ పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌తో కలసి మహేశ్‌ బాబు ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘గూఢచారి’ చిత్రంతో హిట్‌ అందుకున్న శశికిరణ్‌ తిక్కా దీనికి దర్శకుడు. జులై 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


భుజ్‌ 

1971 భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భుజ్‌’. అప్పట్లో భుజ్‌ విమానాశ్రాయానికి  భారత వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్‌ లీడర్‌ విజయ్‌ కర్ణిక్‌ ఇన్‌చార్జిగా ఉండేవారు. యుద్ధంలో భుజ్‌ విమానాశ్రయం దెబ్బతినటంతో యుద్ధ ప్రాతిపదికన దాన్ని పునర్నిర్మించి సైన్యానికి అందుబాటులోకి తెచ్చారు.  భుజ్‌ సమీపంలో ఉన్న మాదాపూర్‌ అనే గ్రామానికి చెందిన 300 మంది మహిళలతో కలసి విజయ్‌ కర్ణిక్‌, ఆయన బృందం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కోసం ఎయిర్‌బే్‌సను పునర్నిర్మించిన ఉత్తేజపూరిత ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అభిషేక్‌ దూదయ్య దర్శకుడు. అజయ్‌దేవ్‌గణ్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా ప్రధాన తారాగాణం. త్వరలో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలవుతోంది. 


తేజస్‌, మణికర్ణిక రిటర్న్స్‌:ద లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా

‘మణికర్ణిక’ చిత్రంతో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా ప్రేక్షకులను అలరించిన కంగనా రనౌత్‌ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘తేజస్‌’. ఇందులో ఆమె యుద్ధ విమానాల పైలెట్‌గా కనిపించనున్నారు. వైమానిక దళంలో దేశ రక్షణ కోసం శ్రమిస్తోన్న మహిళా పైలెట్ల ధైర్యసాహసాలు, త్యాగాల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం రాజస్థాన్‌ ఎడారుల్లో చిత్రీకరణ జరుగుతోంది. సర్వేశ్‌ మేవారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తేజస్‌ తో పాటు కంగన నటిస్తోన్న మరో చిత్రం ‘మణికర్ణిక రిటర్న్స్‌:ద లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’. కశ్మీరీ యువరాణి దిద్దా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ కశ్మీరీ యువరాణి రెండు యుద్ధాల్లో ఘజనీ మహమ్మద్‌ను ఓడించింది.  


షేర్‌షా

పరమ వీర చక్ర పురస్కారం పొందిన కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా జీవిత కథతో తెరకెక్కుతోన్న దేశభక్తి చిత్రం ‘షేర్‌ షా’. సిద్ధార్థ్‌ మల్హోత్రా కథానాయకుడు. విక్రమ్‌ బాత్రా, ఆయన కవల సోదరుడు విశాల్‌ పాత్రను కూడా సిద్ధార్థ్‌ పోషిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. తమిళ దర్శకుడు విష్ణువర్దన్‌కి ఇది తొలి హిందీ చిత్రం. జులై 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.


ఇఫ్తీకార్‌

పారా స్పెషల్‌ ఫోర్సె్‌సకు చెందిన మేజర్‌ మోహిత్‌ శర్మ జీవిత కథ ఆధారంగా అప్‌లాజ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ సంస్థ ‘ఇఫ్తీకార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇఫ్తికార్‌ భట్‌ పేరుతో హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో మోహిత్‌ శర్మ కోవర్టుగా చేరారు. శత్రువుల రహస్యాలను సైన్యానికి చేరవేశాడు. మోహిత్‌ శర్మ మరణానంతరం ప్రభుత్వం ఆయన్ను అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారు. నటీనటుల ఎంపిక జరుగుతోంది.