తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ

ABN , First Publish Date - 2022-09-27T09:01:18+05:30 IST

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత ఐలమ్మ

  • 75 ఏళ్లలో చేయలేని పనులు 8 ఏళ్లలో కేసీఆర్‌ చేశారు: గంగుల
  • వెనుకబడిన వర్గాలన్నీ సంఘటితంగా ఉండాలి: తలసాని
  • రవీంద్రభారతిలో ఐలమ్మ జయంతి సభ

రవీంద్రభారతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ గడ్డపై ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఐలమ్మ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి మంత్రులు గంగుల, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ బస్వరాజు తదితరులు నివాళులర్పించారు. అనంతరం గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ ఐలమ్మ స్ఫూర్తితోనే కేసీఆర్‌ తెలంగాణ పోరాటం సాగించారని తెలిపారు. 75 ఏళ్లలో ఎవరూ చేయలేని పనులను ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ చేసి చూపెట్టారని అన్నారు.


 2014కు ముందు 19 గురుకులాల్లో 7,500 మంది విదార్థులు చదువుకుంటే.. నేడు 310 గురుకులాల్లో 1,65,400 మంది విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. కులవృత్తులు చేసుకొని జీవించే ప్రతి కుటుంబం.. తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తున్నారని వెల్లడించారు. 87.3 ఎకరాల్లో 41 బీసీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ.5వేల కోట్లు కల్యాణిలక్ష్మి కోసం కేటాయిస్తే అందులో 50 శాతం వాటా బీసీలకే దక్కిందన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రజలందరూ సంఘటితంగా ఉండాలని, విచ్చిన్నకర శక్తుల దురాగతాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఎలా ఉండాలనే విజన్‌ ఉందని, దాని కోసమే ఆయన నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. అది పట్టని మతోన్మాద శక్తులు కుక్కల్లా మొరుగుతున్నాయని విమర్శించారు.


Updated Date - 2022-09-27T09:01:18+05:30 IST